TS AP Weather : తెలంగాణలో ఇవాళ, రేపు భారీ వర్షాలు! ఈ జిల్లాలకు 'ఎల్లో' హెచ్చరికలు
Rains in Telangana AP : ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం కారణంగా… శనివారం నుంచి తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు జిల్లాలకు హెచ్చరికలను జారీ చేసింది.
Rains in Telugu States: గడిచిన రెండు మూడు రోజులుగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఉత్తర తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో వానలు పడుతున్నాయి. అయితే మరోసారి తెలంగాణకు అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. అల్పపీడనం కారణంగా తెలంగాణవ్యాప్తంగా రాబోయే మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరాలను పేర్కొంది.
ఎల్లో హెచ్చరికలు…
శనివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. ఇక ఆదివారం పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడుతాయని అంచనా వేసింది. సెప్టెంబర్ 26వ తేదీ వరకు వానలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. శుక్రవారం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలో 4.4 సెం.మీటర్లు, నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో 4 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది. ఉమ్మడి వరంగల్, మెదక్ జిల్లాల్లో వాన దంచికొట్టింది. పర్వతగిరి మండలంలో అత్యధికంగా 141 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది.
ఏపీలో వర్షాలు….
ఆంధ్రప్రదేశ్ లోనూ తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ కూడా పలు ప్రాంతాల్లో వానలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ముఖ్యంగా శ్రీకాకుళం,విజయనగరం,పార్వతీపురంమన్యం,అల్లూరి , కాకినాడ,కోనసీమ,తూర్పుగోదావరి,ఏలూరు,ఎన్టీఆర్, బాపట్ల,పల్నాడు,ప్రకాశం,నెల్లూరు,కర్నూలు,నంద్యాల,సత్యసాయి, వైఎస్ఆర్,అన్నమయ్య,చిత్తూరు,తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.