తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చాలాచోట్ల వరద ఏరులై పారుతోంది. ఫలితంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. ముఖ్యంగా మెదక్, కామారెడ్డి, నిర్మల్, ఆసిఫాబాద్ తో పాటు మరికొన్ని జిల్లాల్లో వర్ష తీవ్రత ఎక్కువగా ఉంది.
ఇవాళ కూడా మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, మెదక్, కామారెడ్డి, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే సూచనలున్నాయి.
మరోవైపు కామారెడ్డిలో మళ్లీ వర్షం మొదలైంది. గురువారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది.బుధవారం రాజంపేటలో అత్యధికంగా 44 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైన సంగతి తెలిసిందే. కామారెడ్డి చెరువుకు వరద ఉధృతి కొనసాగుతుడంగా… జలదిగ్బంధంలోనే పలు కాలనీలు ఉన్నాయి.. కామారెడ్డి-హైదరాబాద్ రూట్‌లో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. చాలా మేరకు రోడ్డు దెబ్బతిన్నది. ప్రస్తుతం 25 శాతం రాకపోకలు మాత్రమే కొనసాగుతున్నాయని జిల్లా ఎస్పీ కార్యాలయం ఓ ప్రకటన ద్వారా తెలిపింది. ప్రజలందరూ గమనించి… ప్రత్యామ్నాయ మార్గాలు వినియోగించుకోవాలని సూచించింది.
భారీ వర్షాల నేపథ్యంలో మెదక్, కామారెడ్డి, నిర్మల్, ఆసిఫాద్, కరీంనగర్, జగిత్యాల, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని అన్ని పాఠశాలలకు జిల్లా విద్యాధికారులు ఇవాళ సెలవు ప్రకటించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లాల కలెక్టర్లు విజ్ఞప్తి చేశారు.
భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాల్లో రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదైంది. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆర్గొండలో అత్యధికంగా 440.5 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇక నిర్మల్ జిల్లాలోని అక్కాపూర్‌లో 325.3 మి.మీ వర్షపాతం నమోదనట్లు అధికారులు వెల్లడించారు. కామారెడ్డిలోని తాడ్వాయిలో, మెదక్ జిల్లాలోనీ సర్థానాలో కూడా అధిక వర్షపాతం నమోదైంది.
భారీ వరదతో పలుచోట్ల రైల్వే పట్టాలు దెబ్బతిన్నాయి. దీంతో హైదరాబాద్-కామారెడ్డి మధ్య పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. భిక్కనూరు-తలమడ్ల, అక్కన్నపేట్-మెదక్ స్టేషన్ల మధ్య పట్టాలపై వర్షపు నీరు చేరింది. కరీంనగర్- కాచిగూడ, మెదక్- కాచిగూడ, బోధన్- కాచిగూడ, కాచిగూడ-మెదక్, నిజామాబాద్- తిరుపతి, ఆదిలాబాద్- తిరుపతి రైళ్లు రదయ్యాయి.
వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ఇవాళ ఆయా ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రధాన కార్యదర్శి కీలక ప్రకటన చేశారు. భారీ వర్షాలు పలు జిల్లాల్లో ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జిల్లా యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు.
సంబంధిత కథనం