Weather Updates Telugu States: గత మూడు రోజులుగా ఏపీ, తెలంగాణలోని వర్షాలు దంచికొడుతున్నాయి. ఉపరితల ద్రోణి ప్రభావంతో వడగళ్లు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. మరో రెండు రోజులు కూడా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ చెబుతోంది. దక్షిణ కర్ణాటక నుంచి జార్ఖండ్, అంతర్గత కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా మీదుగా ఉత్తర ఛత్తీస్‌గఢ్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఫలితంగా ఇవాళ కూడా పలుచోట్ల వర్షాలు కురిసే అకాశం ఉందని పేర్కొంది.,ఎల్లో అలర్ట్…ద్రోణి ప్రభావం నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, సిద్ధిపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అకాశం ఉందని తెలిపింది. మిగిలిన జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని... 40-50 కి. మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.,ఇక శనివారం హైదరాబాద్ లో భారీగా వర్షం కురిసింది. దాదాపు గంటపాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. ఫలితంగా రోడ్లపై ట్రాఫిక్ జామ్ అయింది. పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. ఇదిలా ఉంటే... జనగామ, జగిత్యాల, సూర్యాపేట, నారాయణపేట, ఖమ్మం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఫలితంగా పండ్ల తోటలు నేలకొరిగాయి. వడగళ్ల వర్షానికి వరి పైరు నేలకొరగగా, మామిడి, ఇతర తోటలకు నష్టం వాటిల్లింది. మరికొన్నిచోట్ల పొగాకు, మామిడి, ఆముదం పంటలు నాశనమయ్యాయి. అకాల వర్షాలత నష్టపోయిన తమని ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.,ద్రోణి ప్రభావంతో ఏపీలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో పిడుగులు, వడగళ్లతో కూడా వానలు పడుతున్నాయి. పలుచోట్ల పంట నష్టం కూడా వాటిల్లింది. ఇవాళ కూడా వర్షాలు పడే అవకాశం ఉంది. అయితే క్రమంగా ద్రోణి ప్రభావం ఇవాళ తగ్గే అవకాశం ఉందని తెలంగాణ వెథర్ మ్యాన్ ఖమ్మం, కరీంనగర్, భూపాలపల్లి మీదుగా ఛత్తీస్ ఘడ్, ఏపీవైపు మళ్లే అవకాశం ఉందని అంచనా వేసింది.,వడగళ్లు కురుస్తున్న నేపథ్యంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతులను అప్రమత్తం చేసింది. ఈ మేరకు పలు సూచనలు కూడా చేసింది. భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున అధిక వర్షపు నీరు బయటకు పోయేందుకు ఆరుతడి, కూరగాయలు పండించే పొలంలో మురుగు కాలువలు ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. కోసిన పంటలను ముందు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతానికి తరలించాలి. మార్కెట్‌కు తరలించిన ధాన్యం తడవకుండా టార్పాలిన్‌తో కప్పి ఉంచాలి. కోతకు సిద్ధంగా ఉన్న కూరగాయ పంటలను వెంటనే కోసుకోవాలని పేర్కొంది.