Warangal Rains: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు చోట్ల వాతావరణంలో అనూహ్య మార్పులు కనిపించాయి. ఒక్కసారిగా వచ్చిన ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడగా.. బలమైన ఈదురు గాలులు వీచాయి. దానికి తోడు వడగండ్ల వాన పడటంతో కొన్నిచోట్లా పంటలకు నష్టం వాటిల్లి రైతన్నలు ఇబ్బంది పడగా, ఇంకొన్ని చోట్లా ఇళ్లు దెబ్బతిని జనాలు అవస్థలు పడాల్సి వచ్చింది.
జనగామ జిల్లాలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులతో వడగండ్ల వాన పడింది. దీంతో జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులు ఆరబోసిన ధాన్యం కాస్త వరదకు కొట్టుకుపోయింది. మిగతా ధాన్యమంతా వర్షానికి తడిసి ముద్దయ్యింది. దీంతో అన్నదాతలు ధాన్యాన్ని కాపాడుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అయినా ఫలితం లేకపోవడంతో రైతులు ఆవేదనకు గురయ్యారు.
జనగామ, లింగాల గణపురం, రఘునాథపల్లి మండలాల్లో కురిసిన వర్షానికి కోతకు వచ్చిన వరి పంట నేల కొరిగాయి. దీంతో వడ్లు చాలా వరకు నేల పాలవగా.. ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంట చేతికి అందకుండా పోయిందని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షం రైతులను నిండా ముంచిందని, తడిసిన ధాన్యాన్ని తేమతో సంబంధం లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు.
వరంగల్ జిల్లాలోని పలు మండలాల్లో ఈదురు గాలుల ప్రభావం ఎక్కువగా కనిపించింది. రాయపర్తి మండలంలో ఈదురు గాలులతో వర్షం కురిసింది. ముఖ్యంగా జింకురాం తండా, కొలన్ పల్లి గ్రామాల్లో వడగండ్ల వాన పడగా.. కొన్ని చోట్ల చేతికొచ్చిన పంట నేలవాలింది. దాదాపు అరగంట పాటు ఈదురు గాలులు వీచగా, రైతులతో పాటు జనాలు కూడా భయాందోళనకు గురయ్యారు.
ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం ఏజెన్సీ ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా ఒక్కసారిగా వాతావరణం చల్లబడగా, ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. ఏటూరు నాగారం బస్టాండ్ ఆవరణ వరద నీటితో నిండిపోయింది. ఇదిలాఉంటే ఈదురు గాలుల ధాటికి ఏటూరు నాగారం మండల కేంద్రంలో కొన్ని ఇళ్లు కూడా దెబ్బతిన్నాయి. మండల కేంద్రంలోని తాళ్లగడ్డలో ప్రేమలత అనే మహిళ ఇంటిపై తాటి చెట్టు కూలడంతో ఇల్లు పూర్తి దెబ్బతింది. అదృష్టావశాత్తు ఇంట్లో వారెవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన తమను ప్రభుత్వం ఆదుకుని న్యాయం చేయాలని ప్రేమలత కుటుంబ సభ్యులు వేడుకున్నారు.
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ పరిధిలో ఈదురు గాలులు, వడగండ్ల వానకు పంటలు దెబ్బతిన్న విషయంపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు. దెబ్బతిన్న పంటలను వెంటనే పరిశీలించి, రిపోర్ట్ ఇవ్వాలని రెవెన్యూ, అగ్రికల్చర్ ఆఫీసర్లకు ఆదేశాలు ఇచ్చారు. మార్కెట్లోకి వచ్చిన పంట ఉత్పత్తులను జాగ్రత్తగా కాపాడాలని మార్కెటింగ్ అధికారులకు సూచించారు.
కొనుగోలు చేసిన పంటను వెంటనే గోదాములకు తరలించాలన్నారు. రాష్ట్రంలో మరో రెండు, మూడు రోజులు కూడా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నియోజకవర్గ రైతులు ఎవరూ అధైర్య పడొద్దని, ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి భరోసా ఇచ్చారు.
(రిపోర్టింగ్: హిందుస్తాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)
సంబంధిత కథనం