జూరాల ప్రాజెక్ట్‌కు భారీ వరద - 12 గేట్లు ఎత్తి నీటి విడుదల, శ్రీశైలానికి పెరిగిన వరద-heavy flood hits jurala project 12 gates lifted ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  జూరాల ప్రాజెక్ట్‌కు భారీ వరద - 12 గేట్లు ఎత్తి నీటి విడుదల, శ్రీశైలానికి పెరిగిన వరద

జూరాల ప్రాజెక్ట్‌కు భారీ వరద - 12 గేట్లు ఎత్తి నీటి విడుదల, శ్రీశైలానికి పెరిగిన వరద

ఎగువన కురుస్తున్న వర్షాలతో జూరాల ప్రాజెక్ట్ కు భారీగా వరద తరలివస్తోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు… 12 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు శ్రీశైలానికి వరద నీరు వచ్చి చేరుతోంది.

జూరాల ప్రాజెక్ట్

కృష్ణా బేసిన్ లో భారీగా వరద పారుతోంది. దీంతో జూరాల ప్రాజెక్ట్‌కు వరద నీరు వచ్చిచేరుతోంది. దీంతో 12 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో లక్షా 30 వేల క్యూసెక్కులుగా ఉండగా… ఔట్‌ఫ్లో లక్షా 44,076 క్యూసెక్కులుగా ఉంది.జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా… ప్రస్తుతం 317.200 మీటర్లుగా ఉంది.

జూరాల ప్రాజెక్ట్(ఆత్మకూరు- గద్వాల మధ్య) ఉంటుంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు ఈ ప్రాజెక్ట్ జలప్రదాయినిగా నిలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ 1997లో వినియోగంలోకి వచ్చింది. మొత్తం 67 రేడియల్‌ గేట్లు ఉన్నాయి. ఇందులో కొన్నిగేట్ల రోప్‌లు నీటి తాకిడితో తుప్పుపట్టాయి. అంతేకాకుండా కొన్ని గేట్ల నుంచి నీటి లీకేజీ సమస్య ఉంది. గేట్ల మరమ్మత్తుల కోసం 2022లో రూ.11 కోట్లతో టెండర్లు పిలించారు. ఈ పనులు ప్రారంభయ్యాయి. అయితే అనుకున్నంత పురోగతి కనిపించటం లేదన్న విమర్శలు తాజాగా తెరపైకి వచ్చాయి.

ప్రస్తుతం రోప్‌ల మార్పిడి పనులు జరుగుతున్నాయి. అయితే తాజాగా నాలుగో గేట్‌ ఇనుప రోప్‌ తెగిపోవడంతో ప్రాజెక్ట్ గేట్ల నిర్వహణపై ఆందోళన వ్యక్తమైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాజెక్ట్ ను సందర్శించారు. ప్రాజెక్ట్ కు ఎలాంటి ముప్పు లేదని చెప్పారు.

శ్రీశైలానికి వరద…

ఎగువ నుంచి వస్తున్న వరదలతో కృష్ణా బేసిన్ లో ఉన్న ప్రాజెక్టులకు జలకళ మొదలైంది. ఎగువ నుంచి కొనసాగుతున్న వరద ప్రవాహంతో శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం నెమ్మదిగా పెరుగుతోంది. ఆదివారం (జూన్ 29) ఉదయం 06. 37 నిమిషాల రిపోర్ట్ ప్రకారం…. శ్రీశైలం జలాశయం నీటిమట్టం 869.8కు చేరింది. నీటినిల్వ 140.65 టీఎంసీలుగా (మొత్తం సామర్థ్యం 215.81 టీఎంసీలు)నమోదైంది. ఎగువ నుంచి 1,35,100 క్యూసెక్కుల వరద వస్తుండగా…ఔట్ ఫ్లో లేదు. వరద ప్రవాహం కొనసాగుతున్న క్రమంలో… నీటినిల్వలు మరింత పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

సాధారణంగా భారీ వర్షాల నేపథ్యంలో.. శ్రీశైలంలో గేట్లు ఎప్పుడు ఎత్తుతారని టూరిస్టులు ఎదురుచూస్తూ ఉంటారు. గేట్లు ఎత్తినప్పుడు.. భారీ స్థాయిలో పర్యాటకులు తరలివస్తారు. ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు ఎక్కువగా కురుస్తున్న నేపథ్యంలో…. శ్రీశైలం ప్రాజెక్ట్ నిండటం ఖాయంగానే కనిపిస్తోంది.

మరోవైపు నాగార్జున సాగర్ లో చూస్తే ఇవాళ ఉదయం 8:12 రిపోర్ట్ ప్రకారం …. ఈ ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులుగా ఉంటే… ప్రస్తుతం 514.2 గా ఉంది. ఇక 138.91టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇన్ ఫ్లో 4,408గా ఉండగా… 4,408 క్యూసెకుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.