
Thu, 09 Oct 202512:57 PM IST
ఈసీ ప్రకటన
బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధిస్తూ తీర్పునివ్వటంతో రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించింది. హైకోర్టు ఆదేశాలను పాటిస్తామని ఓ ప్రకటన ద్వారా తెలిపింది. దీంతో ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పాడినట్లు అయింది.
Thu, 09 Oct 202512:52 PM IST
ప్రభుత్వం ఏం చేయబోతుంది…?
జీవో 9పై హైకోర్టు స్టే ఇవ్వడంతో ప్రభుత్వం ఏం చేయబోతోంది.? అనేది ఉత్కంఠగా మారింది. సుప్రీంకోర్టుకి వెళ్లి హైకోర్ట్ ఇచ్చిన స్టేను వెకేట్ చేయిస్తుందా లేక పాత రిజర్వేషన్లతో మరో నోటిఫికేషన్ ఇస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఇవన్నీ కాకుండా హైకోర్టులో కేసు తేలేవరకు ఎన్నికలు వాయిదా వేస్తుందా అనేది ప్రశ్నగా మారింది.
Thu, 09 Oct 202512:51 PM IST
తెలంగాణ బంద్ కు పిలుపు
రేపు తెలంగాణకు బంద్ కు తెలంగాణ రాజ్యాధికార పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రకటన చేశారు. జీవో పేరుతో బీసీలను మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని పిలుపునిచ్చారు.
Thu, 09 Oct 202512:18 PM IST
స్టే విధిస్తుందని అనుకోలేదు - మంత్రి పొన్నం
“హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు కాపీ అందిన తరువాత చట్టపరంగా, న్యాయపరంగా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం. ప్రభుత్వం తరుపున బలమైన వాదనలు వినిపించడం జరిగింది. ప్రభుత్వం కుల సర్వే నిర్వహించి ,డెడికేటెడ్ కమిషన్ వేసి ,సబ్ కమిటీ వేసి కేబినెట్ ఆమోదించి ,శాసన సభలో చట్టం చేసి గవర్నర్ గారికి పంపడం జరిగింది..2018 పంచాయతీ రాజ్ చట్ట సవరణ చేశాం. స్థానిక సంస్థల ఎన్నికలు జరపకపోవడం వల్ల కేంద్రం నుండి రావాల్సిన నిధులు రావడం లేదు. హైకోర్టు స్టే విధిస్తుందని అనుకోలేదు” అని మంత్రి పొన్నం ప్రకటన విడుదల చేశారు.
Thu, 09 Oct 202512:03 PM IST
నిలబడదని వారికి తెలుసు…
“బీసీలకు 42% రిజర్వేషన్లు దక్కాలంటే 9వ షెడ్యూల్లో చేర్చి ప్రొటెక్షన్ కోసం రాజ్యాంగ సవరణ జరగాలని మేము ముందు నుండి చెప్తున్నాం. జీవో ద్వారా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తే ఎన్నికలు జరగవు.. సుప్రీంకోర్టులో 50% మించకూడదు అని తీర్పు ఉంది. బీసీలకు 42% రిజర్వేషన్ల జీవో తెచ్చారు. ఇది కోర్టులో నిలబడదు అని రేవంత్ రెడ్డికి తెలుసు, మంత్రులకు తెలుసు, తెలంగాణ ప్రజలకు మొత్తానికి తెలుసు. దీని గురించి నేను అసెంబ్లీలో మాట్లాడితే మంత్రులు నా మీద నోరు పారేసుకున్నారు” అని గంగుల వ్యాఖ్యానించారు.
Thu, 09 Oct 202512:01 PM IST
ఎమ్మెల్యే గంగుల కామెంట్స్
ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఎన్నికలు జరగాలనే తాము డిమాండ్ చేస్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల డిమాండ్ చేశారు. “నేను గతంలో కూడా అసెంబ్లీలో చెప్పాను తమిళనాడు చేసిన ప్రకారం వెళ్దాము. బీహార్, మహారాష్ట్ర తరహాలో మనం తప్పు చేయొద్దని చెప్పాను” అని గుర్తు చేశారు.
Thu, 09 Oct 202511:47 AM IST
కాంగ్రెస్ రాజకీయ కోణంలోనే ఆలోచించింది - రాంచందర్ రావు
బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ రాజకీయ కోణంలోనే ఆలోచించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు విమర్శించారు. కాంగ్రెస్ లబ్ధి పొందాలని అనుకుంది… అందుకే ఈ జడ్జిమెంట్ వచ్చిందన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు బీజేపీ మద్దుతు ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రభుత్వం ప్రాసెస్ ఫాలో కావడం లేదని విమర్శించారు.
Thu, 09 Oct 202511:26 AM IST
డ్రామా క్రియేట్ చేశారు - ప్రభుత్వంపై హరీశ్ రావ్ ఫైర్
“మాయ మాటలు చెప్పి గత ఎన్నికల్లో బీసీలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ లబ్ది పొందాలని చేసిన కుట్రలు పటాపంచలయ్యాయి. 22 నెలలుగా బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో కొట్లాడాల్సిన రేవంత్ రెడ్డి, గల్లీలో కొట్లాడుతున్నట్లు డ్రామా క్రియేట్ చేసారు తప్ప, బీసీలకు 42శాతం రిజర్వేషన్ సాధించడం పట్ల ఏనాడూ చిత్తశుద్ది ప్రదర్శించలేదు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం, 42శాతం రిజర్వేషన్ కల్పించేందుకు చట్ట బద్దత కోసం కేంద్రాన్ని పట్టుబట్టాల్సిన రేవంత్ రెడ్డి, తెలివిగా దాన్ని పక్క దోవ పట్టించారు” అని మాజీ మంత్రి హరీశ్ రావ్ ట్వీట్ చేశారు.
Thu, 09 Oct 202511:25 AM IST
ఓర్వలేకపోతున్నారు - ఆర్ కృష్ణయ్య
“రాష్ట్ర ప్రభుత్వం తొందరపాటు చర్యల వల్లే బీసీలకు అన్యాయం జరిగింది. బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు .బీసీలకు పదవులు వస్తుంటే ఓర్వలేకపోతున్నారు. బీసీల నోటి కాడ ముద్దను లాక్కున్నారు. ప్రభుత్వ స్పందన చూసి తెలంగాణ బంద్‌కు పిలుపునిస్తాం” అని బీసీ నేత ఆర్.కృష్ణయ్య వ్యాఖ్యానించారు.
Thu, 09 Oct 202511:09 AM IST
ఎన్నికలకు బ్రేక్
ఎన్నికల నోటిఫికేషన్ విడుదలపై స్టే కూడా న్యాయస్థానం స్టే విధించింది. ఇక రెండు వారాల్లో కౌంటర్ వేయాలని పిటిషనర్లను ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడినట్లు అయింది. హైకోర్టు ఆర్డర్ పరిశీలించిన తర్వాత నిర్ణయం రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారికంగా నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.
Thu, 09 Oct 202510:48 AM IST
హైకోర్టు స్టే
బీసీ రిజర్వేషన్లపై జీవోపై తెలంగాణ హైకోర్టులో ఇవాళ కూడా విచారణ జరిగింది. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం ఎన్నికల నోటిఫికేషన్‌పై స్టే విధించింది.4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
Thu, 09 Oct 202509:41 AM IST
జనగణన శాస్త్రీయంగా నిర్వహించాం - ఏజీ వాదనలు
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సర్వేలో 57.6 శాతం బీసీ జనాభా ఉందని తేలిందని ఏజీ వాదనలు వినిపించారు. “బీసీ జనగణన శాస్త్రీయంగా నిర్వహించాం. బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. రాష్ట్రపతి బిల్లుకు ఆమోదం తెలపలేదు కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బిల్లు ఆమోదం పొందినట్టే” అని వాదనలు వినిపించారు.
Thu, 09 Oct 202509:40 AM IST
ఏజీ వాదనలు
రాష్ట్ర అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. ప్రభుత్వ సూచనలను హైకోర్టుకి తెలియచేస్తున్నారు. ఒకవేళ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపి ఉంటే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసి ఉండేదని చెప్పారు. గవర్నర్ గడువులోగా ఆమోదించకపోతే చట్టంగా భావించాల్సి ఉంటుందని… ప్రత్యేకంగా నోటిఫై చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
Thu, 09 Oct 202509:30 AM IST
కొనసాగుతున్న వాదనలు
ఇవాళ కూడా ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపిస్తున్నారు. అంతేకాకుండా ఈ కేసులో ఇంప్లీడ్ అయిన వారి వాదనలను కూడా ఇవాళ న్యాయస్థానం విననుంది.
Thu, 09 Oct 202509:27 AM IST
స్టే ఇస్తే రిజర్వేషన్లు మార్పు…!
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో 9 అమలును నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తే పంచాయతీ ఎన్నికల నిర్వహణకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంటుంది. అంతేకాదు బీసీలకు ప్రస్తుతం ఉన్న 25 శాతం రిజర్వేషన్లనే అమలు చేయాల్సి ఉంటుంది. ఆయా స్థానాలకు ఇప్పటికే నిర్ణయించిన రిజర్వేషన్లను మార్చాల్సి ఉంటుంది.
Thu, 09 Oct 202509:27 AM IST
నామినేషన్ల ప్రక్రియ షురూ
ఇవాళ్టి నుంచి రాష్ట్రంలో నామినేషన్ల ప్రక్రియ షురూ అయింది. తద్వారా ఎన్నికల ప్రక్రియ మొదలైనట్లేనని, ఇందులో కోర్టులు జోక్యం చేసుకోరాదని వాదించే అవకాశం ఉంది. కానీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయినా ఈ పిటిషన్‌లోని అంశాలపై విచారించవచ్చంటూ గత వారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం కూడా చర్చనీయాంశమవుతోంది.
Thu, 09 Oct 202509:24 AM IST
హైకోర్టులో విచారణ ప్రారంభం
బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. బుధవారం ఇరువైపు వాదనలు విన్న కోర్టు.. ఇవాళ్టికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇవాళ కూడా న్యాయస్థానం వాదనలు వింటోంది. కోర్టు తీర్పుపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.