KTR Case : కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ.. అరెస్ట్ చేయొద్దని ఆదేశాలు
KTR Case : తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఉన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. కేటీఆర్‌ను ఈనెల 31 వరకు అరెస్టు చేయొద్దని ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణ సందర్భంగా ఏం జరగబోతోందనే చర్చ జరుగుతోంది.
కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. కౌంటర్ దాఖలుకు ప్రభుత్వం సమయం కోరింది. దీంతో ఉన్నత న్యాయస్థానం విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. కేటీఆర్‌ను మంగళవారం వరకు అరెస్ట్ చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఫార్ములా ఈ -కారు రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏ1గా ఉన్నారు. ఈ కేసుపై తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది.
ఈ కేసుకు సంబంధించి ప్రాథమికంగా ఏసీబీ కొన్ని కీలక అంశాలపై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. రేస్ నిర్వహణకు ప్రతిపాదనలు ఎలా సిద్ధం చేశారు? నిధుల చెల్లింపు ఎలా చేశారనే దానిపై వివరాలను సేకరిస్తోంది. ఆదేశాలు ఎక్కడ్నుంచి వచ్చాయి? ఉద్యోగుల పాత్ర ఏంటి అనే అంశాలపై లోతుగా పరిశీలిస్తోంది. అవసరమైతే ఉద్యోగుల వాంగ్ములాలను కూడా రికార్డ్ చేసే అవకాశం ఉంది. ఈ కేసులో ఉన్నవారికి నోటీసులు జారీ చేసి విచారించేందుకు రంగం కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
దానకిషోర్ వాంగ్మూలం..
ఫార్ములా ఈ -కారు రేసు కేసులో ఫిర్యాదుదారుడైన ఐఏఎస్ అధికారి దాన కిషోర్‌ను ఏసీబీ అధికారులు విచారించారు. సుమారు 7 గంటల పాటు ప్రశ్నించి ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. దానకిశోర్ నుంచి కొన్ని కీలకమైన డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఆయన చెప్పిన వివరాల ఆధారంగా ఏసీబీ అధికారులు కేసు విచారణ చేపట్టనున్నారు.
ఈడీ కేసు..
ఫార్ములా ఈ-రేసు వ్యవహారంలో ఇటీవల కీలక పరిణామం చోటు చేసుకుంది. విదేశీ సంస్థకు నిధులు బదిలీ చేయడంలో అధికార దుర్వినియోగం జరిగిందనే కోణంలో ఏసీబీ దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే.. ఈడీ రంగంలోకి దిగింది. ఏసీబీ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించింది. మాజీమంత్రి కేటీఆర్‌ను ప్రధాన నిందితుడిగా పేర్కొంది.
ఎవరెవరు ఉన్నారు..
ఈ వ్యవహారంలో.. విపత్తుల నిర్వహణ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్, హెచ్‌ఎండీఏ పూర్వ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్‌రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్‌లో ఫార్ములా ఈ-రేస్‌ల నిర్వహణ కోసం యూకేలోని ఫార్ములా-ఈ ఆర్గనైజేషన్స్(ఎఫ్‌ఈవో) సంస్థకు నగదు బదిలీ చేయడంలో ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్(ఫెమా), ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ కింద ఈడీ కేసు దర్యాప్తు చేయనుంది.