కేసీఆర్ అద్భుతమైన పాలనకు సజీవ సాక్ష్యం.. భవిష్యత్ తరాలకు నిలువెత్తు నిదర్శనం : హరీష్-harish rao tweets that the current buildings are living proof of kcr excellent governance ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  కేసీఆర్ అద్భుతమైన పాలనకు సజీవ సాక్ష్యం.. భవిష్యత్ తరాలకు నిలువెత్తు నిదర్శనం : హరీష్

కేసీఆర్ అద్భుతమైన పాలనకు సజీవ సాక్ష్యం.. భవిష్యత్ తరాలకు నిలువెత్తు నిదర్శనం : హరీష్

మిస్ వరల్డ్ 2025 పోటీల్లో పాల్గొనడానికి వివిధ దేశాలకు చెందిన అందగత్తెలు వచ్చారు. రాష్ట్ర పర్యాటక శాఖ వారిని బృందాలుగా విభజించి.. వివిధ ప్రదేశాలకు తీసుకెళ్తోంది. ఈ నేపథ్యంలోనే సుందరీమణులు బుద్ధవనం, కమాండ్ కంట్రోల్ సెంటర్, తెలంగాణ సచివాలయాన్ని సందర్శించారు. దీనిపై హరీష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

తెలంగాణ సచివాలయం ముందు అందగత్తెలు

మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనడానికి వచ్చిన వివిధ దేశాల సుందరీమణులు.. ఇటీవల హైదరాబాద్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, తెలంగాణ నూతన సచివాలయాన్ని సందర్శించారు. అటు యాదగిరిగుట్ట, బుద్ధవనాన్ని కూడా సందర్శించారు. అక్కడ వారు ఫొటోలు దిగారు. ఈ ఫొటోలను షేర్ చేస్తూ.. సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ పరిపాలనను కొనియాడారు.

చెరిపేస్తే చెరిగేవి కావు..

'కేసీఆర్ అద్భుతమైన పాలనకు సజీవ సాక్ష్యం.. భవిష్యత్ తరాలకు నిలువెత్తు నిదర్శనం.. ఎవరు అవునన్నా, కాదన్నా.. తెలంగాణ అభివృద్ది చిహ్నాలు అవి. బీఆర్ఎస్ పాలన కీర్తి కిరీటాలు. చెరిపేస్తే చెరిగేవి కావు, దాచేస్తే దాగేవి కావు' అని హరీష్ రావు ట్వీట్ చేశారు. ఇదికాస్త వైరల్ అయ్యింది.

కేసీఆర్ ఆనవాళ్లపై రచ్చ..

ఈ మధ్య తెలంగాణ రాజకీయాల్లో 'కేసీఆర్ ఆనవాళ్లు' అనే మాట బాగా వినిపించింది. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 'మీ ఆనవాళ్లు లేకుండా చేస్తా.. నాదే జిమ్మెదారి' అని వ్యాఖ్యానించారు. ఆ కామెంట్స్‌పై బీఆర్ఎస్ నేతలు భగ్గుమన్నారు. ఇటీవల ఎల్కతుర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభలోనూ కేసీఆర్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని చూస్తున్నారు.. ఇది సాధ్యమా అని ప్రశ్నించారు.

ఎక్కడికెళ్లినా కేసీఆరే కనిపిస్తారు..

రేవంత్ రెడ్డి అప్పట్లో చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ కీలక నేతలు పలు సందర్భాల్లో స్పందించారు. పల్లెలు, పట్టణాలు.. నగరాలు.. ఎక్కడికెళ్లినా కేసీఆరే కనిపిస్తారని వ్యాఖ్యానించారు. చెట్లను చూస్తే హరితహారం, నిళ్లను చూస్తే.. మిషన్ భగీరథ, చెరువులను చూస్తే మిషన్ కాకతీయ, 24 గంటల కరెంటును చూస్తే కేసీఆర్ పడిన కష్టాలు గుర్తొస్తాయని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు.

బీఆర్ఎస్‌కు కలిసొచ్చింది..

తెలంగాణ సచివాలయం, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, యాదగిరి గుట్ట ఆలయం.. ఇవన్నీ కేసీఆర్ నిర్మించినవే అని బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలంటే.. ఇవన్నీ లేకుండా చేయాలని.. అధి సాధ్యమా అని ప్రశ్నిస్తున్నారు. ఇలా డైలాగ్‌లు పేలుతుండగానే.. వివిధ దేశాలకు చెందిన అందగత్తెలు ఆయా ప్రదేశాల్లో ఫొటోలు దిగారు. ఈ పరిణామం కారు పార్టీకి కలిసొచ్చింది.

సంబంధిత కథనం