Vikarabad : రేవంత్ మీద ఉన్న కోపాన్ని కలెక్టర్, అధికారుల మీద చూపుతున్నారు : హరీష్ రావు
Vikarabad : విరాకాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానిక రైతులు కలెక్టర్ ప్రతీక్ జైన్, ఇతర అధికారుల వాహనాలపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. దీంతో పోలీసులు అప్రమత్తమై ఆందోళనకారులను అడ్డుకున్నారు. ఈ ఘటనపై మాజీమంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఫార్మా సంస్థ ఏర్పాటుకు సంబంధించి భూసేకరణ కోసం.. దుద్యాల మండలం లగచర్ల గ్రామానికి చెందిన రైతులతో ప్రభుత్వం కొద్దికాలంగా సంప్రదింపులు జరుపుతోంది. ఫార్మా సంస్థ ఏర్పాటును రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఫార్మా పరిశ్రమ ఏర్పాటు కోసం అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని దుద్యాల శివారులో ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి, అదనపు కలెక్టర్ లింగనాయక్, సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ వెళ్లారు. దుద్యాల శివారులో ప్రజాభిప్రాయ సేకరణ ఏర్పాటు చేస్తే.. రైతులు మాత్రం లగచర్లలోనే ఉండిపోయారు.
దీంతో కలెక్టర్, అధికారులు రైతులు ఉన్న ప్రాంతానికి వెళ్లారు. కలెక్టర్, అధికారుల వాహనాలు గ్రామం వద్దకు చేరుకోగానే రైతులు ఒక్కసారిగా రాళ్లు, కర్రలతో దాడికి దిగారు. ఈ రాళ్లదాడిలో మూడు వాహనాలు ధ్వంసం అయ్యాయి. కలెక్టర్, అధికారులు రైతులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. వినకుండా కొందరు అధికారులపై దాడికి పాల్పడ్డారు. ఓ అధికారిని కర్రలతో కొట్టారు. కలెక్టర్ పైనా ఓ మహిళ చేయి చేసుకుంది. దీంతో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు అప్రమత్తమై రైతులను అదుపుచేసే ప్రయత్నం చేశారు.
ఈ ఘటనపై మాజీమంత్రి, బీఆర్ఎస్ ముఖ్యనేత హరీష్ రావు స్పందించారు. సీఎం రేవంత్‌పై విమర్శలు గుప్పించారు. 'గరీబి హటావో అని ఇందిరా గాంధీ పిలుపునిస్తే.. ఫార్మా సిటీ పేరుతో పచ్చని పంట పొలాల నుండి కిసాన్ హటావో అని పిలుపునిస్తున్నడు రేవంత్ రెడ్డి. రేవంత్ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా తయారైంది. ఆ రాయి ఈరోజు ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన వికారాబాద్ రైతన్నల నెత్తిన పడింది' అని హరీష్ రావు విమర్శించారు.
'రైతులు రేవంత్ మీద ఉన్న కోపాన్ని జిల్లా కలెక్టర్, ప్రభుత్వ అధికారుల మీద చూపుతున్నారు. రేవంత్ చేస్తున్న అసమర్థ పాలనకు ఐఎఎస్‌లు, ప్రభుత్వ అధికారులు ప్రజాగ్రహానికి గురవుతున్నారు. ఫార్మా సిటీ కోసం కెసీఆర్ హైద్రాబాద్‌కు దగ్గరగా, కాలుష్యం లేకుండా, జీరో వ్యర్థాలతో 15 వేల ఎకరాలు సేకరించి సిద్దం చేసిండు. పర్యావరణం, అటవీ సహా అన్ని రకాల అనుమతులు వచ్చిన దాన్ని పక్కన బెట్టి పచ్చటి పొలాల్లో ఫార్మా చిచ్చు బెడుతున్నడు' అని హరీష్ రావు వ్యాఖ్యానించారు.
'జహీరాబాద్ న్యాల్కల్ మండలంలోనూ దాదాపు ఇదే పరిస్థితి. ఫార్మసిటీ కోసం సేకరించిన భూమిని తన రియల్ ఎస్టేట్ దందా కోసం వినియోగించే కుట్రతో ఈ సమస్య మొదలైంది. నీ మీద, నీ పాలన మీద తిరగబడని వర్గం ఏదైనా ఉందా రేవంత్ రెడ్డి? ఇప్పటికైనా పిచ్చి పనులు మాని పరిపాలన మీద దృష్టి పెట్టాలని, పచ్చని పొలాల్లో ఫార్మా కంపెనీ ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని బిఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం' అని హరీష్ ట్వీట్ చేశారు.