Congress vs BRS : ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు.. అయినా తగ్గేది లేదు : హరీష్‌రావు
Congress vs BRS : లగచర్ల ఘటన తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. ఈ కేసులో అరెస్టు అయిన బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి.. హరీష్ రావు జైల్లో కలిశారు. ఈ సందర్భంగా జైలు బయట మాట్లాడిన హరీష్.. కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా.. పోరాటం ఆగబోదని స్పష్టం చేశారు.
వికారాబాద్ జిల్లా లగచర్లలో అధికారులపై దాడి జరిగింది. ఈ కేసులో బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. కొడంగల్ కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. తాజాగా.. మాజీమంత్రి హరీష్ రావు నరేందర్ రెడ్డిని జైల్లో కలిశారు. ఈ సందర్భంగా హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.
'నరేందర్‌రెడ్డిని కుట్రపూరితంగా అరెస్ట్ చేశారు. ప్రభుత్వంపై ప్రజలు తిరగబడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దిగజారి వ్యవహరిస్తోంది. ప్రజల తిరుగుబాటును.. ప్రతిపక్షాల కుట్రగా చిత్రీకరిస్తున్నారు. లగచర్ల రైతులు భూములు ఇవ్వబోమని పోరాటం చేశారు. రైతులకు పట్నం నరేందర్‌రెడ్డి మద్దతు ఇచ్చారు. రాష్ట్రంలో ఏం జరిగినా బీఆర్ఎస్ కుట్ర ఉందంటున్నారు. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా.. ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటాం. గిరిజన రైతులను వెంటనే విడుదల చేయాలి' అని హరీష్ రావు డిమాండ్ చేశారు.
తెలంగాణ తాజా రాజకీయ పరిణామాలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఘాటుగా స్పందించారు. ఆయన గాంధీ భవన్‌లో మాట్లాడారు. 'కేటీఆర్ గురించి మాట్లాడాలంటే చాలా మాట్లాడవచ్చు. ప్రభుత్వ వైఫల్యం ఏంటో కేటీఆర్ చెప్పాలి. నిరుద్యగులకు ఉద్యోగాలు ఇవ్వడమే ప్రభుత్వ వైఫల్యమా? ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టడం ప్రభుత్వ వైఫల్యమా? రైతు రుణమాఫీ చేయడం ప్రభుత్వ వైఫల్యమా?' అని భట్టి ప్రశ్నించారు.
'ప్రజలకు మంచి చేయడం ప్రభుత్వ వైఫల్యమా? మీరు అధికారం కొల్పోయినప్పుడల్లా అమాయక ప్రజలను రెచ్చగొడుతున్నారు. ఫార్మా క్లస్టర్స్ విస్తరించే పనిని వ్యతిరేకించడం బుద్ధి తక్కువ పని. మేం కక్ష రాజకీయాలకు వ్యతిరేకం. బీఆర్ఎస్ ప్రతిపక్షంగా తన పాత్ర పోషించిందా? ఉన్న ప్రభుత్వాన్ని కూల్చడంపైనే బీఆర్ఎస్ దృష్టి పెట్టింది' అని భట్టి ఆరోపించారు.
'స్కీములు పెరగాడానికే కులగణన చేస్తున్నాం. కుల గణన చేస్తామని మాట ఇచ్చాం. ఇచ్చిన మాటను చేసి చూపిస్తున్నాం. రాష్ట్ర అభివృద్ధికి కుల గణన ఎంతగానో ఉపయోగపడుతుంది. దేశానికి తెలంగాణ రోల్ మోడల్ కాబోతుంది. అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొనే ప్రశ్నలు తయారు చేశాం. కుల గణన విప్లవాత్మక నిర్ణయం' అని భట్టి వ్యాఖ్యానించారు.
ఉన్నతస్థాయి విచారణ..
లగచర్ల ఘటనలో ఉన్నతస్థాయి విచారణ జరుగుతోంది. అడిషనల్ డీజీ మహేష్ భగవత్ నేతృత్వంలో విచారణ చేస్తున్నారు. నరేందర్ రెడ్డి సెల్‌ఫోన్‌ను పోలీసులు ఓపెన్ చేశారు. దాడి వెనుక కుట్రపై విచారణ జరుపుతున్నారు.