TG Police Suicide : పోలీసుల మరణ మృదంగం.. ప్రభుత్వానికి పట్టింపు లేదా? : హరీష్ రావు
TG Police Suicide : తెలంగాణలో పోలీసులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ ఘటనలు పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారాయి. వీటిపై మాజీమంత్రి హరీష్ రావు స్పందించారు. పోలీసుల మరణ మృదంగం పట్ల ప్రభుత్వానికి పట్టింపు లేదా? అని ప్రశ్నించారు. సూసైడ్ చేసుకోవద్దని పోలీసులకు సూచించారు.
ములుగు జిల్లాలో ఎస్సై, సిద్దిపేటలో కానిస్టేబుల్ కుటుంబం, కామారెడ్డిలో ఎస్సై , కానిస్టేబుల్, ఈ రోజు సిరిసిల్లలో కానిస్టేబుల్ కుటుంబం, మెదక్ కుల్చారంలో హెడ్ కానిస్టేబుల్.. వీరంతా స్వల్ప కాలంలో ఆత్మహత్యలకు పాల్పడ్డ పోలీసులు అని మాజీమంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన పోలీసులే.. వరుసగా ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. శాంతి భద్రతలను పరిరక్షించవలసిన రక్షకుల జీవితాలకే రక్షణ కరువైందని విచారం వ్యక్తం చేశారు.
పోలీసులపై ప్రభావం..
'పని ఒత్తిళ్లు, పెండింగ్ హామీలను తీర్చడంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి పోలీసులపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నది. ఈ ఆత్మహత్యలపై నిజానిజాలు వెలుగులోకి రావడానికి శాఖాపరమైన దర్యాప్తు చేయాలని తెలంగాణ డీజీపీని కోరుతున్నాను. పోలీసుల్లో ఆత్మహత్యల ఆలోచనలు రాకుండా సైకాలజిస్టులతో కౌన్సెలింగ్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను' అని హరీష్ ట్వీట్ చేశారు.
మిత్రులారా..
'పోలీస్ మిత్రులారా.. సమస్యలు ఏవైనప్పటికీ ఆత్మహత్యలు పరిష్కారం కాదు. ఎంతో కష్టపడి ఈ ఉద్యోగాలు సాధించారు. మీ కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకండి. విలువైన జీవితాలను కోల్పోకండి. ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన మీరు.. ఆత్మస్థైర్యంతో విధులు నిర్వహిస్తేనే సమాజానికి భద్రత' అని హరీష్ రావు వ్యాఖ్యానించారు.
కొల్చారంలో..
మెదక్ జిల్లా కొల్చారంలో తీవ్ర విషాదం జరిగింది. పోలీస్ హెడ్‌క్వార్టర్స్ ఆవరణలో చెట్టుకు ఉరి వేసుకుని హెడ్ కానిస్టేబుల్ సాయి ఆత్మహత్య చేసుకున్నారు. ఉదయాన్నే గమనించిన తోటి సిబ్బంది.. ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. సాయికుమార్ మృతికి కొత్త కారణాలు వెలుగులోకి వస్తున్నాయి. నర్సాపూర్‌లో టిఫిన్ సెంటర్ నడిపే మహిళతో వివాహేతర సంబంధమే కారణమనే అనుమానాలున్నాయి.
సిద్ధిపేటలో..
సిద్ధిపేట జిల్లాలోనూ ఓ పోలీస్ కానిస్టేబుల్ సూసైడ్ అటెంప్ట్ చేశారు. భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం చేశాడు. పురుగు మందు తాగి ఉరి వేసుకున్న కానిస్టేబుల్ బాలకృష్ణ మృతి చెందాడు. భార్య, ఇద్దరు పిల్లలను ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు విషమిచ్చిన తర్వాత బాలకృష్ణ ఉరేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందుల వల్లే ఆత్మహత్య అని అనుమానిస్తున్నారు.