Harish Rao : వారిని విడుదల చేస్తేనే నేను బయటకొస్తా.. పోలీస్ స్టేషన్‌లోనే హరీష్ రావు
Harish Rao : పెండిగ్ బిల్లులు క్లియర్ చేయాలని డిమాండ్ చేస్తూ.. తెలంగాణ వ్యాప్తంగా మాజీ సర్పంచులు పోరుబాటకు పిలుపునిచ్చారు. వారందరు హైదరాబాద్‌కు వస్తున్నారన్న సమాచారంతో పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. మాజీ సర్పంచులను అరెస్టు చేయడంపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పెండింగ్ బిల్లులు చెల్లించాలని మాజీ సర్పంచులు కొన్నాళ్లుగా ఆందోళన చేస్తున్నారు. కానీ.. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో తాజాగా వారు పోరుబాటకు పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. కొందరు సర్పంచులు సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రం ఇవ్వడానికి హైదరాబాద్ వచ్చారు. సీఎం నివాసం సమీపంలో వారిని పోలీసులు అరెస్టు చేసి.. బొల్లారం పీఎస్‌కు తరలించారు.
ఈ విషయం తెలుసుకున్న మాజీమంత్రి హరీష్ రావు.. పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. సర్పంచులకు మద్దతుగా నిలిచారు. మాజీ సర్పంచుల అరెస్టును ఖండిస్తూ రోడ్డుపై ఆందోళన చేస్తున్న మాజీ మంత్రి హరీష్ రావు, శాసన మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనా చారిని పోలీసులు అరెస్టు చేసి.. బొల్లారం పీఎస్‌కు తరలించారు. అరెస్టు చేసిన సర్పంచులను వెంటనే విడుదల చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టు చేసిన మాజీ సర్పంచులను విడుదల చేసేదాకా.. పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వెళ్లేది లేదని.. హరీష్ రావు భీష్మించుకు కూర్చున్నారు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న మాజీ సర్పంచుల పట్ల కర్కషంగా వ్యవహరించడంపై హరీష్ రావు ఫైర్ అయ్యారు. పోరు తెలంగాణ ఇప్పుడు అరెస్టుల తెలంగాణ, నిర్భంద తెలంగాణ అయ్యిందని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఇష్యూపై కేటీఆర్ కూడా స్పందించారు. 'రాష్ట్ర వ్యాప్తంగా మాజీ సర్పంచులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పెండింగ్ బిల్లులు ఇవ్వాలని ఏడాది కాలంగా అడిగినా ఇవ్వకపోవడం సిగ్గుచేటు. రాష్ట్రంలో నిత్యం అరెస్టుల పర్వమే కొనసాగుతోంది. పోలీసులతో సమస్యలను అణగదొక్కాలని చూస్తుంది ప్రభుత్వం. రాష్ట్రంలోని సమస్యలు గాలికి వదిలి ముఖ్యమంత్రి, మంత్రులు ఊరేగుతున్నారు' అని కేటీఆర్ విమర్శించారు.
'సర్పంచుల కుంటుంబాలు రోడ్డున పడే దాకా ప్రభుత్వం స్పందించదా. శాంతియుత నిరసనకు పిలుపునిచ్చిన సర్పంచులను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు. పల్లె ప్రగతి పేరిట మేము చేపట్టిన కార్యక్రమాననికి తూట్లు పొడిచి నిధులు విడుదల చేయకుండా ఆపుతున్నారు. అరెస్ట్ చేసిన సర్పంచులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం' అని కేటీఆర్ ట్వీట్ చేశారు.