MLC Jeevan Reddy: హరీశ్ రావు.. రాజీనామా లేఖ సిద్దం చేసుకో: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి-harish rao be ready with your resignation letter says congress mlc jeevan reddy on after farmers loan waiver decision ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Mlc Jeevan Reddy: హరీశ్ రావు.. రాజీనామా లేఖ సిద్దం చేసుకో: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

MLC Jeevan Reddy: హరీశ్ రావు.. రాజీనామా లేఖ సిద్దం చేసుకో: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

HT Telugu Desk HT Telugu
Jun 22, 2024 10:48 PM IST

MLC Jeevan Reddy on Harish Rao: బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తన రాజీనామా పత్రాన్ని రెడీ చేసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సూచించారు. రైతుల రుణాలను కాంగ్రెస్ ప్రభుత్వం మాఫీ చేస్తోందని.. సవాల్‍ను హరీశ్ నిలబెట్టుకోవాలని అన్నారు.

MLC Jeevan Reddy: హరీశ్ రావు.. రాజీనామా లేఖ సిద్దం చేసుకో: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
MLC Jeevan Reddy: హరీశ్ రావు.. రాజీనామా లేఖ సిద్దం చేసుకో: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

MLC Jeevan Reddy: కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీకి చేసేందుకు నిర్ణయించింది. ఈ తరుణంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు రాజీనామా పత్రాన్ని సిద్ధం చేసుకోవాలని సూచించారు కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ టీ.జీవన్ రెడ్డి.‌ ఆగస్టు 15లోగా రైతుల పంట రుణాలు రెండు లక్షల వరకు ఏకకాలంలో మాఫీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసిందని తెలిపారు.‌ కాంగ్రెస్ రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని చేసిన సవాల్‍ను హరీశ్ నిలబెట్టుకోవాలని జీవన్ రెడ్డి అన్నారు.

రుణ మాఫీకి రూ.31వేల కోట్లు

జగిత్యాలలో డీసీసీ అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర కేబినెట్ సమావేశంలో రైతుల రుణమాఫీపై చర్చించి జూలై 15లోగా విధివిధానాలు ఖరారు చేసేలా మంత్రివర్గ ఉప సంఘాన్ని వేసిందని తెలిపారు. ఆగస్టు 15లోగా రైతులందరికీ రూ.2 లక్షల వరకు ఏకకాలంలో రుణమాఫీ చేసేందుకు రూ.31వేల కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు. రుణమాఫీతో పాటు ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని జీవన్ రెడ్డి తెలిపారు.

“దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతుల పంటల బీమా పథకాన్ని అమలు చేయబోతున్నాం. ప్రస్తుతం ఉన్న పంటల బీమా కోసం కేంద్ర ప్రభుత్వం 25 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం చెల్లిస్తే.. రైతులు 50 శాతం భరించాల్సి ఉండేది. తాజా నిర్ణయంతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 75 శాతం చెల్లించనున్నది. రైతు నయా పైసా చెల్లించకుండానే పంటల బీమా పథకం అమలు కానున్నది” అని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. వరికి మద్దతు ధరకు అదనంగా రూ.500 బోనస్ చెల్లిస్తామని తెలిపారు.

పార్టీ మార్పు అవకాశవాదమే

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నాయకులు పార్టీ మారడాన్ని తప్పుబట్టారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. నమ్మిన పార్టీని వీడడం అవకాశవాదానికి నిదర్శనమని అన్నారు. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం సుస్థిరంగా ఉందని స్పష్టం చేశారు. మరో 20 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్, బిజేపీలు మాత్రమే ఉంటాయని.. బీఆర్ఎస్ కనుమరుగు అవుతుందని జోస్యం చెప్పారు. కనుమరుగయ్యే బీఆర్ఎస్ పార్టీ గురించి తాము, ప్రజలు ఎవరూ ఆలోచించడం చేయడం లేదన్నారు.

రాష్ట్రంలో రైతు ప్రభుత్వం

తెలంగాణలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం.. రైతు ప్రభుత్వం కొనసాగుతోందని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. రైతు సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. ఆగస్ట్ 15 లోగా ఏక కాలంలో రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చెల్లించాలని మంత్రివర్గ నిర్ణయంపై రైతుల పక్షాన సీఎం రేవంత్ రెడ్డికి కృతఙ్ఞతలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతగా ప్రతీ మండలంలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు లక్ష్మణ్ కుమార్. రుణమాఫీ అమలైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన కేటీఆర్, హరీశ్ రావు రాజీనామా పత్రాలను సిద్దం చేసుకోవాలని సవాల్ విసిరారు.