Karimnagar BJP: గొడవకు కారణమైన వ్యక్తి హనుమాన్ భక్తుడే, శోభయాత్రలో ఉద్రిక్తత, అసత్య ప్రచారంపై బీజేపీ ఫిర్యాదు..
Karimnagar BJP: కరీంనగర్ లో హనుమాన్ దీక్ష స్వాముల శోభయాత్రలో చోటు చేసుకున్న ఘటనలో ప్రమేయం ఉన్న వ్యక్తికి, బిజెపికి ఏలాంటి సంబంధం లేదని ఆ పార్టీ నాయకులు ప్రకటించారు.
Karimnagar BJP: కరీంనగర్ లో హనుమాన్ దీక్ష స్వాముల శోభయాత్రలో చోటు చేసుకున్న ఘటనలో ప్రమేయం ఉన్న వ్యక్తికి, బిజెపికి ఏలాంటి సంబంధం లేదని ఆ పార్టీ నాయకులు ప్రకటించారు. శోభాయాత్రలో కత్తితో హల్ చల్ చేసిన వ్యక్తి బిజెపి కార్యకర్త కాదని, ఈ విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని బిజెపి నేతలు కరీంనగర్ ఏసిపి కి పిర్యాదు చేశారు.
శనివారం రాత్రి హనుమాన్ దీక్ష స్వాముల శోభాయాత్ర లోకి కత్తితో దూసుకొచ్చి ఉత్కంఠ ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసిన వ్యక్తి సిహెచ్. జయదేవ్ హిందువేనని, అతను హనుమాన్ చాలీసా చదివే వీడియోను పోలీసులు రిలీజ్ చేశారు.
అతను బwజేపి కార్యకర్త అని బిజేపి కావాలనే కరీంనగర్ లో గొడవ సృష్టించి ఇతరులపై కి నెట్టే ప్రయత్నం చేసిందని సోషల్ మీడియాలో కొందరు ప్రచారం చేయడం జరిగింది. దీంతో బిజేపి జిల్లా మాజీ అధ్యక్షుడు భాస సత్యనారాయణ, పార్లమెంటు కన్వీనర్ బోయిన్పల్లి ప్రవీణ్ రావు, నాయకులు ఉప్పరపల్లి శ్రీనివాస్, నాగసముద్రం ప్రవీణ్, ఎన్నం ప్రకాష్, రవి తదితరులు ఏసీపీని కలిసి సమస్యను విన్నవించి ఫిర్యాదు చేశారు.
ముఖ్యంగా హనుమాన్ దీక్షపరుల శోభయాత్రలో ఉద్దేశపూర్వకంగా అలజడులు సృష్టించాలని ప్రయత్నాలు చేశారన్నారు. కత్తి తిప్పడం లాంటి ఘటనతో శోభయాత్రలో ఉద్రిక్తత పరిస్థితులు వచ్చాయని తెలిపారు. అనవసర వివాదాన్ని సృష్టించిన అరాచక శక్తులకు బిజెపికి, హనుమాన్ దీక్ష నిర్వాహకులకు ఎలాంటి సంబంధం లేదని, కొన్ని ఫేక్ మీడియా సంస్థలు, సోషల్ మీడియా గ్రూపులు పనికట్టుకొని ఈ విషయంలో బిజెపి పై బురద జల్లడానికి ప్రయత్నం చేస్తు, బద్నాంచేయడానికి ప్రయత్నం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
తప్పుడు ప్రచారం చేస్తున్న ఫేక్ మీడియా సంస్థలపై, సోషల్ మీడియా గ్రూపులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని , క్రిమినల్ కేసులు నమోదు చేయాలని బిజెపి నేతలు ఏసీపి ని కోరారు. సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారాన్ని సర్కులేట్ చేస్తున్న తెలుగు స్క్రైబ్ పోస్ట్ కాపీని ఫిర్యాదు వెంట జతపరిచారు.
ప్రజలు సంయమనం పాటించాలి
ప్రజలు సోషల్ మీడియాలో వచ్చే వార్తలు నమ్మి ఉద్వేగానికి గురి కావద్దని ఏసీపీ నరేందర్ కోరారు. కొందరు తప్పుడు ప్రచారంతో ప్రజలను రెచ్చగొడుతున్నారని అలాంటి వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు సంయమనం పాటించి శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న కృషికి సహకరించాలని కోరారు.
హనుమాన్ దీక్షా స్వాముల శోభాయాత్రలో అలజడి సృష్టించిన జయదేవ్ హనుమాన్ భక్తుడేనని ఏసీపీ తెలిపారు. అతని ఆడియోతో కూడిన వీడియో విడుదల చేసి నగరంలో ఉత్కంఠ ఉద్రిక్త పరిస్థితులకు తావు లేకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.
(రిపోర్టింగ్ కేవీ.రెడ్డి, కరీంనగర్, హెచ్‌టి తెలుగు)
సంబంధిత కథనం