Siricilla Suicide: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి సమీపంలోని ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉండే నేత కార్మికుడు పర్కిపల్లి రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. బాత్ రూమ్ క్లీన్ చేసే యాసిడ్ తాగి ఆత్మహత్యకు యత్నించగా స్థానికులు సిరిసిల్ల ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.
సిరిసిల్లకు చెందిన చేనేత కార్మికుడు రాజుకు భార్య పద్మ, కొడుకు రాకేష్, కూతుర్లు మౌనిక, ప్రియాంక ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలే ఆత్మహత్యకు కారణమని కుటుంబ సభ్యులు పోలీసులకు పిర్యాదు చేశారు.
యాసిడ్ తాగి ఆత్మహత్య చేసుకున్న నేతన్న రాజుకు ఆరు లక్షల రూపాయల అప్పు ఉంది. ఆ అప్పు కూడా ఇద్దరు బిడ్డలు, కొడుకు ముగ్గురి పెళ్ళీలు చేయడంతోనే అప్పు అయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గత కొద్దిరోజులుగా చేతినిండా నేత పని లేకపోవడంతో సరైన ఉపాధి కానరాక చేసిన అప్పు ఎలా తీర్చాలని మనోవేదనతో ఆత్మహత్య కు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలని కన్నీటిపర్యంతమై వేడుకున్నారు.
వస్త్ర పరిశ్రమకు నిలయమైన సిరిసిల్ల లో నేత కార్మికుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతుంది. గడిచిన ఏడాది కాలంలో 30 మంది నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బతుకమ్మ చీరలను నిలిపివేసింది. దీంతో ఉపాధి కరువై చేతినిండా పని లేక చేసిన అప్పులు తీర్చే మార్గం కానరాక నేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం తమిళనాడు తరహాలో తెలంగాణ ప్రభుత్వం నేత కార్మికులకు సబ్సిడీపై ముడి సరుకులు పంపిణీ చేసి సర్కార్ కు కావాల్సిన గుడ్డను సిరిసిల్లలో నేపియ్యాలని విజ్ఞప్తి చేశారు. సంబంధిత అధికారులు మాత్రం ప్రభుత్వ పరంగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ఆర్డర్స్ ఇస్తున్నామని స్కూల్ యూనిఫామ్ మహిళా సంఘాలకు ఇచ్చే చీరలను సిరిసిల్లలో చేయించడం జరుగుతుందని తెలిపారు. నేత కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)
సంబంధిత కథనం