BRS Rythu Bharosa Protest : హనుమకొండలో హైటెన్షన్, మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత అరెస్ట్
BRS Rythu Bharosa Protest : బీఆర్ఎస్ నేత దాస్యం వినయ్ భాస్కర్ ను పోలీసులు అరెస్టు చేశారు. రైతు భరోసా విషయంలో కాంగ్రెస్ పార్టీ మోసపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ... కాళోజీ విగ్రహానికి వినతి పత్రం అందించేందుకు వెళ్తుండగా ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ నేతలు, పోలీసులకు వాగ్వాదం జరిగింది.
BRS Rythu Bharosa Protest : వరంగల్ లో మంత్రుల పర్యటన సందర్భంగా నగరంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. మంత్రుల పర్యటనను నిరసిస్తూ.. వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టే ప్రయత్నం చేశారు. రైతు భరోసా విషయంలో కాంగ్రెస్ పార్టీ మోసపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ కాళోజీ విగ్రహానికి వినతి పత్రం అందించేందుకు వెళ్తుండగా.. ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. మంత్రుల పర్యటనల సందర్భంగా శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందనే ఉద్దేశంతో పోలీసులు ఆయనను పార్టీ ఆఫీస్ లోనే నిర్భందించారు.
దీంతో దాస్యం వినయ్ భాస్కర్ తో పాటు ఇంకొందరు బీఆర్ఎస్ నేతలు పోలీసులతో వాదనకు దిగారు. వారిని ప్రతిఘటించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి చేయిదాటి పోయే ప్రమాదం ఉండటంతో హనుమకొండ ఏసీపీ దేవేందర్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. అక్కడి పరిస్థితి సమీక్షించి వినయ్ భాస్కర్ కు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ బీఆర్ఎస్ నేతలు ఊరుకోపోవడంతో సుబేదారి పోలీసులు దాస్యం వినయ్ భాస్కర్ తో పాటు మరికొందరిని అరెస్టు చేసి కాకతీయ యూనివర్సిటీ స్టేషన్ కు తరలించారు. దాదాపు గంటపాటు పోలీసులు, బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం, తోపులాట జరగగా.. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
డిక్లరేషన్ ప్రతులను పాతిపెట్టి బీఆర్ఎస్ నేతల నిరసన
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు డిక్లరేషన్ పేరున ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని, ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నేతలను అక్రమంగా అరెస్టులకు పాల్పడుతోందని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. ఈ మేరకు కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి ఆధ్వర్యంలో హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో రైతు డిక్లరేషన్ ప్రతులను పాతిపెట్టి నిరసన వ్యక్తం చేశారు. 2022లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానం వేదికగా రైతులకు పలు హామీలు ఇస్తూ.. రైతు డిక్లరేషన్ సభను నిర్వహించి హామీ పత్రాన్ని విడుదల చేసిందని, రైతు భరోసా అని చెప్పి రైతులకు ఏటా ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు.
పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఆ హామీని ఇంతవరకు నెరవేర్చలేదని విమర్శించారు. తాజాగా రైతు భరోసా హామీకి కోత పెడుతూ ఎకరాకి కేవలం 12 వేలు మాత్రమే ఇస్తామని ప్రకటించడం రైతులను మోసం చేయడమే అవుతుందన్నారు. ఆయన వెంట కార్పొరేటర్లు సంకు నర్సింగ్, సోదా కిరణ్, ఇండ్ల నాగేశ్వర్ రావు, మాజీ కార్పొరేటర్లు జోరిక రమేష్, ఉడతల సారంగపాణి, పార్టీ సీనియర్ నాయకులు నార్లగిరి రమేష్, బండి రజినీ కుమార్, వెంకన్న, కోటేశ్వర్ రావు, నయీముద్దీన్, నయీమ్ జుబేర్, వినయ్, రాజు, సదాంత్, రమేష్, వివేక్, వాసు, మిట్టపెల్లి రమేష్, యాదగిరి, శంకర్, సుమన్, ముర్తుజా, భిక్షపతి, తదితరులు పాల్గొన్నారు.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)
సంబంధిత కథనం