TG Half Day Schools 2024 : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఈనెల 6వ తేదీ నుంచి ఒక్కపూటే బడి.. కారణం ఇదే
TG Half Day Schools 2024 : తెలంగాణలోని పలు పాఠశాలలు ఈనెల 6వ తేదీ నుంచి ఒక్కపూటే పని చేయనున్నాయి. దాదాపు 3 వారాల పాటు ఒంటిపూట బడులే ఉంటాయని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. ఈ నిర్ణయం తీసుకుంది ఎండల కారణంగానో.. వర్షాల కారణంగానో కాదు. కుల గణన కారణంగా.
తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 6వ తేదీ నుంచి కుల గణన ప్రారంభం కానుంది. ఈ కుల గణన సర్వేలో ప్రాథమిక పాఠశాలల్లో పనిచేసే ఎస్జీటీ టీచర్లు పాల్గొననున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. యూపీఎస్, ఉన్నత పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు మినహాయింపును ఇచ్చింది. సర్వేలో 35,559 మంది టీచర్లు, 3,414 మంది ప్రైమరీ స్కూల్ హెచ్‌ఎంలు పాల్గొననున్నారు.
వీరే కాకుండా 6,256 మంది మండల రిసోర్స్ పర్సన్‌లు కూడా కుల గణన సర్వేలో పాల్గొననున్నారు. మరో రెండు వేల మంది మినిస్టీరియల్ సిబ్బందితో కలిపి మొత్తం 48, 229 మంది కుల గణన సర్వేలో పాల్గొననున్నారు. ఈ సర్వే 3 వారాల పాటు కొనసాగనుంది. దీంతో ప్రాథమిక పాఠశాలలు మూడు వారాల పాటు ఒక్క పూటే పనిచేయనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పని చేస్తాయి.
ఆ తర్వాత ఉపాధ్యాయులు సర్వే కార్యక్రమాన్ని చేపట్టాలి. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పనిచేసే ఎస్జీటీ టీచర్లకు సర్వే నుంచి మినహాయింపు లభించింది. కొంత కాలంగా తెలంగాణలో కుల గణన అంశంపై చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇదే విషయంపై ప్రభుత్వం కూడా సానుకూలంగా ప్రకటనలు చేస్తూ వచ్చింది. తొలుత బీసీ కుల గణనపై నిర్ణయం కూడా తీసుకుంది. అసెంబ్లీ వేదికగా తీర్మానం కూడా చేసింది. ఈ గణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో కుల గణన ప్రక్రియ చర్చనీయాంశంగా మారింది.
కుల గణన ప్రక్రియపై బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటన విడుదల చేశారు. నవంబర్ 6వ తేదీ కుల గణన సర్వే జరుగుతుందని చెప్పారు. 85,000 మంది ఎన్యూమరేటర్లు ఉంటారని వివరించారు. ప్రతి 10 మంది ఏనుమరేటర్లకు ఒక పరిశీలకుడు ఉంటారని వెల్లడించారు. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్టాయి అధికారుల పర్యవేక్షణలో ప్రతి ఇంటి నుంచి సమగ్ర సమాచాారాన్ని సేకరిస్తారని తెలిపారు. నవంబర్ 30వ తేదీలోపు సమాచార సేకరణ పూర్తి చేసే దిశగా ప్రణాళికలు ముందుకు సాగుతున్నాయని వివరించారు. ఈ సర్వేను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఈ సర్వేలో భాగం కావాలని పిలుపునిచ్చారు.