TG Half Day Schools 2025 : విద్యార్థులకు గుడ్ న్యూస్ - ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు, ఉత్తర్వులు జారీ
తెలంగాణలో మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కాను్ననాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు స్కూళ్లు తెరిచి ఉంటాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు రానున్నాయి.

రాష్ట్రంలో ఒంటిపూట బడులపై తెలంగాణ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభమవుతాయని తెలిపింది. ఏప్రిల్ 23వ తేదీ వరకు హాఫ్ డే స్కూల్స్ ఉంటాయని వివరించింది. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులను జారీ చేసింది.
ఒంటిపూడ బడుల నేపథ్యంలో ఉదయం 8 గంటలకే స్కూళ్లు తెరుచుకుంటాయి. మధ్యాహ్నం 12. 30 గంటలకు వరకు పని చేస్తాయి. పదో తరగతి పరీక్షలు జరిగే స్కూళ్లల్లో మధ్యాహ్నం 1. 00 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు తరగతులను నిర్వహిస్తారు. ఏప్రిల్ 24 నుంచి స్కూళ్లలకు వేసవి సెలవులు రానున్నాయి.
ఈ ఏడాది ఫిబ్రవరి మొదటి నుంచే తెలుగు రాష్ట్రాల్లో భానుడు ప్రతాపం చూపుతున్నాడు. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో స్కూల్ పిల్లలు ఇబ్బంది పడకుండా కాస్త ముందుగానే ఒంటిపూట బడులు ఇచ్చే దిశగా ప్రభుత్వం కసరత్తు చేసింది. ఇందులో భాగంగా… మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది.
ఈనెల 21 నుంచి టెన్త్ పరీక్షలు:
ఇక మార్చి 21వ తేదీ నుంచి తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఏప్రిల్ 4వ తేదీ నాటికి అన్ని పరీక్షలు పూర్తవుతుాయి. ఈ ఏడాది 4.97 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. మొత్తం 2,500 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఇక ఇప్పటికే విద్యాశాఖ టెన్త్ వార్షిక షెడ్యూల్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. మార్చి 21న ఫస్ట్ లాంగ్వేజ్, 22న సెకండ్ లాంగ్వేజ్, మార్చి 24న ఇంగ్లీష్, 26న మ్యాథ్స్ పరీక్ష జరగనుంది. మార్చి 28న ఫిజిక్స్, 29న బయోలాజికల్ సైన్స్, ఏప్రిల్ 2న సోషల్ స్టడీస్ పరీక్ష జరగనుంది.
ఏపీలో కూడా ఒంటిపూట బడులు…!
ఇక ఎండల తీవ్రత పెరుగుతుండటంతో ఏపీ విద్యాశాఖ కూడా ఒంటిపూట బడులపై కసరత్తు చేసే పనిలో పడింది. గతేడాదితో పోల్చితే ఈసారి కాస్త ముందుగానే ఒంటి పూట బడులను ప్రారంభించాలని యోచిస్తోంది. గతేడాదిలో మార్చి 18వ తేదీ నుంచి ఏపీలో ఒంటి పూట బడులు ప్రారంభమయ్యాయి. అయితే ఈసారి మార్చి 15వ తేదీ నుంచే ప్రారంభించే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన ప్రణాళికను పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే సిద్ధం చేసినట్లు తెలిసింది. అధికారికంగా ఉత్తర్వులు రావాల్సి ఉంది.
సంబంధిత కథనం