Gutha Amith Reddy : రాష్ట్ర డెయిరీ డెవలప్మెంట్ ఛైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి నియామకం, రెండేళ్ల పాటు పదవిలో-gutha amith reddy appointed as state dairy development chairman for two years ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Gutha Amith Reddy : రాష్ట్ర డెయిరీ డెవలప్మెంట్ ఛైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి నియామకం, రెండేళ్ల పాటు పదవిలో

Gutha Amith Reddy : రాష్ట్ర డెయిరీ డెవలప్మెంట్ ఛైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి నియామకం, రెండేళ్ల పాటు పదవిలో

HT Telugu Desk HT Telugu
Aug 20, 2024 09:20 PM IST

Gutha Amith Reddy : శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డికి రాష్ట్రస్థాయి పదవి దక్కింది. గుత్తా అమిత్ రెడ్డని రాష్ట్ర డెయిరీ డెవలప్మెంట్ ఛైర్మన్ గా ప్రభుత్వం నియమించింది. రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.

రాష్ట్ర డెయిరీ డెవలప్మెంట్ ఛైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి నియామకం, రెండేళ్ల పాటు పదవిలో
రాష్ట్ర డెయిరీ డెవలప్మెంట్ ఛైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి నియామకం, రెండేళ్ల పాటు పదవిలో

Gutha Amith Reddy : నల్లగొండ జిల్లాకు రాష్ట్రస్థాయి కార్పొరేషన్ పదవి దక్కింది. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డిని తెలంగాణ డెయిరీ డెవలప్మెంట్ ఛైర్మన్ గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండు నెలల కిందటే ముగిసిన పార్లమెంట్ ఎన్నికల సమయం వరకు బీఆర్ఎస్ లో కొనసాగిన అమిత్ రెడ్డి తనకు ఎంపీ అభ్యర్థిత్వం దక్కలేదని, జిల్లా నాయకత్వం మోకాలడ్డిందని బీఆర్ఎస్ కు బైబై చెప్పి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు సీఎం ప్రత్యేక సలహాదారుగా ఉన్న వేం నరేందర్ రెడ్డికి గుత్తా కుటుంబానికి బంధుత్వం ఉంది. అదే మాదిరిగా సీఎం రేవంత్ రెడ్డి తోను గుత్తా ఫ్యామిలీకి బంధుత్వం ఉంది. ఈ కారణంగానే గుత్తా అమిత్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ గూడును వీడి కాంగ్రెస్ గూటికి చేరారు.

బీఆర్ఎస్ లో భవిష్యత్తు లేదని

వాస్తవానికి గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ నుంచే బీఆర్ఎస్ లో చేరారు. అప్పటికే ఆయన రెండు పర్యాయాలు కాంగ్రెస్ నుంచి ఎంపీగా విజయం సాధించి ఉన్నారు. 2014 పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన సుఖేందర్ రెడ్డి ఆ తర్వాత కొన్నాళ్లకే నాటి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి పదవి ఆశించిన సుఖేందర్ రెడ్డికి ఆ పదవి దక్కలేదు. తెలంగాణ రైతు సమన్వయ సమితి తొలి ఛైర్మన్ గా బీఆర్ఎస్ ఆయనకు అవకాశం కల్పించింది . ఆ తర్వాత కొన్నాళ్లకే శాసనమండలి సభ్యునిగా ఎమ్మెల్యే కోటాలో ఎన్నుకొని ఛైర్మన్ ను కూడా చేసింది . 2018లో తిరిగి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అప్పటికే పదవీకాలం పూర్తయిన సుఖేందర్ రెడ్డిని మళ్లీ ఎమ్మెల్సీగా నియమించి, మండల ఛైర్మన్ పదవిలో రెండోసారి కొనసాగించింది.

మరోవైపు సుఖేందర్ రెడ్డి తన తనయుడు అమిత్ రెడ్డిని రాజకీయ వారసునిగా తెరమీదకు తీసుకు వచ్చారు. మునుగోడు అసెంబ్లీ స్థానం నుంచి రాజకీయ అరంగేట్రం చేయించాలని చూశారు. మునుగోడు ఉప ఎన్నికల సమయంలోనే ఈ ప్రయత్నాలు జరిగినా, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వైపే మొగ్గు చూపారు. ఆ ఎన్నికల్లో ప్రభాకర్ రెడ్డి విజయం కూడా సాధించారు. ఆ తర్వాత జరిగిన 2023 శాసనసభ ఎన్నికల్లో సైతం తన తనయుడికి టికెట్ వస్తుందేమోనని ఆశించినా అంతటా సిట్టింగ్ ఎమ్మెల్యేలకే బీఆర్ఎస్ నాయకత్వం టికెట్లు ఇవ్వడంతో లోక్‌సభ ఎన్నికల కోసం ఎదురుచూశారు. కేవలం రాజకీయ అరంగేట్రం కోసమే గుత్తా అమిత్ తమ ఫౌండేషన్ ద్వారా వివిధ సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు.

అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని 12 అసెంబ్లీ స్థానాల్లో కేవలం ఒక సూర్యాపేటలో మాత్రమే బీఆర్ఎస్ విజయం సాధించి 11 చోట్ల అపజయం పాలయ్యింది. ఎన్నికలకు ముందుగానే దేవరకొండ , నాగార్జునసాగర్, హుజూర్ నగర్, కోదాడ , నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గాల్లో గుత్తా సుఖేందర్ రెడ్డి వర్గీయులు , ఆయన దగ్గరి అనుచరులు అనుకున్న వారంతా గులాబీ గూటిని వీడి కాంగ్రెస్ కండవాలు కప్పుకున్నారు. అంతా పార్టీ మారుతున్నా సుఖేందర్ రెడ్డి ఏమాత్రం వారిని ఆపలేదని విమర్శలు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటమిలో సుఖేందర్ రెడ్డి పాత్ర కూడా ఉందని ఆయా నియోజకవర్గాల్లో ఓటమిపాలైన అభ్యర్థులంతా అధినాయకత్వానికి ఫిర్యాదు చేశారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన మూడు నెలల్లోనే లోక్‌సభ ఎన్నికలు ముందుకు వచ్చాయి.

టికెట్ కోసం విశ్వప్రయత్నాలు

లోక్‌సభ ఎన్నికల్లో నల్లగొండ నుంచి కానీ, లేదంటే భువనగిరి నుంచి కానీ తన టికెట్ కావాలని గుత్తా అమిత్ ఆశించారు. ఈ మేరకు మండలి ఛైర్మన్ గా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి సైతం తన తనయుడికి టికెట్ ఇప్పించుకునేందుకు ప్రయత్నించారు. కానీ జిల్లాలో ఓటమిపాలైన మాజీ ఎమ్మెల్యేలంతా అమిత్ కు టికెట్ రాకుండా అడ్డుకున్నారన్న భావనకు సుఖేందర్ రెడ్డి వర్గం వచ్చింది. దీంతో ఎన్నికలకు ముందుగానే బేషరతుగా గుత్తా అమిత్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అమిత్ ను కాంగ్రెస్ లోకి తీసుకోవడంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ప్రయత్నించారు. జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో సయోధ్య చేసుకున్న అమిత్ ఎంపీ ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరారు. అప్పటి నుంచి ఆయన తనకు ఏదైనా పదవి వస్తుందని ఆశించారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన అమెరికా పర్యటనలో సైతం సీఎం బృందంలో అమిత్ కూడా ఉన్నారు.

గుత్తా కుటుంబానికి మొదటి నుంచి తొలి పదవులన్నీ డెయిరీ నుంచి అందివచ్చినవే. సుఖేందర్ రెడ్డి సైతం గతంలో రాష్ట్ర డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసి ఉన్నారు. ఇప్పుడు తాజాగా తెలంగాణ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు ఆయన తనయుడు గుత్తా అమిత్ రెడ్డికి ఛైర్మన్ పదవి దక్కడం యాదృచ్ఛికమేమీ కాదు. గతంలో మదర్ డెయిరీకి గుత్తా సుఖేందర్ రెడ్డి సుదీర్ఘకాలం, ఆ తర్వాత ఆయన సోదరుడు గుత్తా జితేందర్ రెడ్డి మరికొంత కాలం ఛైర్మన్లుగా పని చేశారు. ఇప్పుడు రాష్ట్ర డెయిరీ డెవలప్మెంట్ ఛైర్మన్‌గా గుత్తా అమిత్ నియమితులు కావడంపై సుఖేందర్ రెడ్డి వర్గం ఆనందంలో ఉంది . కాగా ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి తొలి నుంచి పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు నామినేటెడ్ పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. కానీ వారందరినీ కాదని, ముందుగా ఎంపీ ఎన్నికల ముందే పార్టీలో చేరిన గుత్తా అమిత్ కు రాష్ట్రస్థాయి ఛైర్మన్ పదవి దక్కడ విశేషం.

మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుడిగా నియమితులయ్యారు. కేబినెట్ హోదాలో ప్రభుత్వ సలహాదారుడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

( రిపోర్టింగ్ : క్రాంతిపద్మ, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి నల్గొండ ప్రతినిధి )

సంబంధిత కథనం

టాపిక్