rythu runa mafi: రుణమాఫీ కాలేదా..? రేపటి నుంచే సర్వే.. తాజా అప్‌డేట్ ఇదే..-guidelines for telangana wide survey on rythu runa mafi ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Rythu Runa Mafi: రుణమాఫీ కాలేదా..? రేపటి నుంచే సర్వే.. తాజా అప్‌డేట్ ఇదే..

rythu runa mafi: రుణమాఫీ కాలేదా..? రేపటి నుంచే సర్వే.. తాజా అప్‌డేట్ ఇదే..

Basani Shiva Kumar HT Telugu
Aug 26, 2024 01:12 PM IST

rythu runa mafi: అర్హులైనా రుణ మాఫీ కానీ రైతుల వివరాలు నమోదు చేసేందుకు సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 27వ తేదీ (మంగళవారం) నుంచి ఈ సర్వే జరగనుంది. దీని కోసం రైతుభరోసా పంట రుణ మాఫీ యాప్‌ను రూపొందించారు.

రైతు రుణ మాఫీ సర్వే
రైతు రుణ మాఫీ సర్వే

తాము అర్హులమైనా రుణ మాఫీ జరగలేదని.. వేలాది మంది రైతులు తెలంగాణ వ్యాప్తంగా రోడ్డెక్కారు. అటు ప్రతిపక్ష పార్టీలు కూడా నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. దీంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం నుంచి సర్వే చేయాలని నిర్ణయించింది. ఏదైనా కారణాల వల్ల రుణమాఫీ వర్తించని రైతుల వివరాల నమోదు చర్యలు చేపట్టింది. రైతుభరోసా పంట రుణమాఫీ యాప్‌ రూపొందించింది. దీన్ని అన్ని జిల్లాల వ్యవసాయాధికారులు, డివిజన్, మండల అధికారులు పంపించింది.

రైతుల దగ్గరకే వెళ్లాలి..

రుణమాఫీ వర్తించని రైతుల దగ్గరకు వెళ్లి కారణం తెలుసుకొని.. యాప్‌లో నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. వివరాలు నమోదు తర్వాత రైతుల నుంచి ధ్రువీకరణపత్రం, స్థానిక పంచాయతీ కార్యదర్శి సంతకం తీసుకోవాలని స్పష్టం చేసింది. ప్రయోగాత్మకంగా కొందరి రైతుల వివరాలను నమోదు చేసి పరీక్షించాలని ప్రభుత్వ సూచించింది. ఇదే సమయంలో రూ.2 లక్షలు దాటిన వారికి అదనపు మొత్తాలను వసూలు చేసేందుకు బ్యాంకులకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది.

వివిధ కారణాలతో..

మూడు విడతల్లో రూ.లక్ష, రూ.లక్షన్నర, రూ. రెండు లక్షల లోపు రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. ఈ మూడు విడతల్లోనూ చాలా మంది రైతులకు వివిధ కారణాలతో రుణమాఫీ కాలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ రుణ మాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం మాటతప్పిందని.. ఎదురుదాడికి దిగుతోంది. గత ప్రభుత్వ హయాంలో కన్నా ఈసారి రుణమాఫీలో లబ్ధిపొందిన రైతులు, ప్రభుత్వం చెల్లించిన మొత్తంలో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. ఈ గణాంకాలను ముందు పెట్టుకుని బీఆర్ఎస్ విమర్శలకు దిగడం, కాంగ్రెస్ నాయకత్వం ప్రతివిమర్శలు చేయడంతో రుణమాఫీ వ్యవహారం రాజకీయ టర్న్ తీసుకుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

బ్యాంకర్ల తప్పిదాలు..

బ్యాంకర్లు చేసిన తప్పిదాలకూ రైతులు మూల్యం చెల్లిస్తున్నారు. ప్రభుత్వం విధించిన కటాఫ్ డేట్ 2018 డిసెంబరు 12కు ముందు రుణాలు తీసుకున్న రైతులు ఆ తర్వాత ఏటా రుణాన్ని రెన్యువల్ చేసుకుంటూ వస్తున్నారు. రెన్యువల్ చేసిన తేదీ నుంచి దానికి కొత్త రుణంగానే పరిగణించాలి. సదరు రుణానికి సంబంధించి కొత్త ఖాతా నెంబర్ ఉంటుంది. కానీ, గ్రామీణ ప్రాంతాల్లోని బ్యాంకర్లు, 2018 డిసెంబరు 12కు ముందు తీసుకున్న రైతుల రుణాలను వారు ఏటా రెన్యువల్ చేసుకుంటూ వస్తున్నా.. కొత్త తేదీలు ఇవ్వకపోవడంతో వారంతా పాత జాబితాలోనే మిగిలిపోయి, ప్రభుత్వం చేసిన రుణమాఫీకి అర్హత పొందలేకపోయారు. ఇలా గ్రామీణ ప్రాంతాల్లో వేలాది మంది రైతులు అనర్హులు అయ్యారు.

మాట నిలబెట్టుకున్నాం..

రైతు రుణమాఫీ విషయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. నాడు తెలంగాణ ఇస్తామని కరీంనగర్ గడ్డపై నుంచి సోనియాగాంధీ హామీనిచ్చారని గుర్తు చేశారు. ఆ విధంగానే 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని సీఎం రేవంత్ గుర్తు చేశారు. రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిసి కూడా ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని చెప్పారు. 4 కోట్ల ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదని చెప్పారు.