TGPSC Merit Order: మెరిట్‌ అభ్యర్థులకు మేలు చేసేలా టీజీపీఎస్సీ రిక్రూట్‌మెంట్, ఏప్రిల్‌ కల్లా గ్రూప్‌ 1, 2, 3 నియామకాలు-group 3 recruitment on the horizon after group 1 2 by tgpsc ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tgpsc Merit Order: మెరిట్‌ అభ్యర్థులకు మేలు చేసేలా టీజీపీఎస్సీ రిక్రూట్‌మెంట్, ఏప్రిల్‌ కల్లా గ్రూప్‌ 1, 2, 3 నియామకాలు

TGPSC Merit Order: మెరిట్‌ అభ్యర్థులకు మేలు చేసేలా టీజీపీఎస్సీ రిక్రూట్‌మెంట్, ఏప్రిల్‌ కల్లా గ్రూప్‌ 1, 2, 3 నియామకాలు

Bolleddu Sarath Chandra HT Telugu
Dec 06, 2024 01:07 PM IST

TGPSC Merit Order: తెలంగాణలో ఉద్యోగ నియామకాలపై పబ్లిక్‌ సర్వీస్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. మెరిట్ అభ్యర్థులకు నష్టపోకుండా, కింద స్థాయి పోస్టుల్లో చేరిన వారు ఎంపికైన తర్వాత పోస్టుల్ని వదులుకోకుండా ఉండేందుకు చర్యలు చేపట్టింది. ప్రాధాన్యత క్రమంలో పోస్టుల్ని భర్తీ చేయనుంది.

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్

TGPSC Merit Order: తెలంగాణలో ఉద్యోగా నియామకాలపై పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగార్ధులకు మేలు చేసేలా రిక్రూట్‌మెంట్‌ చేపట్టనుంది. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలనే ఉద్దేశంతో ఏళ్ల తరబడి శిక్షణ పొందుతున్న వారికి మేలు చేసేలా ఉద్యోగ నియామక ప్రక్రియను కొనసాగించనుంది. ఇందులో భాగంగా మొదట గ్రూప్-1, 2 ఉద్యోగాలను భర్తీ చేసిన తర్వాతే.. గ్రూప్-3 ఫలితాలు వెల్లడించాలని నిర్ణయించారు.

yearly horoscope entry point

తెలంగాణలో ఉద్యోగ నియామకాల్లో ప్రాధాన్యత క్రమంలో ఉద్యోగాలను భర్తీ చేయాలని కమిషన్‌ నిర్ణ‍యించింది. దిగువ స్థాయి ఉద్యోగాలను ముందు భర్తీ చేస్తే ఉద్యోగాలు పొందిన వారిలో తర్వాత మెరుగైన ఉద్యోగాలకు అర్హత పొందితే కింది పోస్టులను వదులుకుంటున్నారు. దీనివల్ల అయా పోస్టులు ఏళ్ల తరబడి ఖాళీగా ఉండిపోతున్నాయి. ఇలా రకరకాల కారణాలతో కింద స్థాయి ఉద్యోగాల్లో ఎక్కువ ఖాళీలు ఉంటున్నా వాటిని భర్తీ చేయడానికి చాలా సమయం పడుతోంది. ఈ పరిస్థితిని నివారించడానికి కమిషన్‌ కీలక నిర్ణయం తీసుకుంది.

తెలంగాణలో పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ నిర్వహించే గ్రూప్స్ పరీక్షల ఫలితాల విడుదల చేయడంతో గ్రూప్‌ వన్ స్థాయి నుంచి గ్రూప్‌ 3 వరకు ప్రాధాన్య క్రమాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. తెలంగాణ గ్రూప్-1 పరీక్షలు అక్టోబరు 21 నుంచి 27 వరకు జరిగాయి. ఫలితాలు వెలువడాల్సి ఉంది. గతంలో గ్రూప్‌ 1ప్రిలిమ్స్‌ పరీక్షలు జరిగినా పేపర్‌ లీక్‌ కావడంతో ఆ పరీక్షలు రద్దు అయ్యాయి. వాటిని ఈ ఏడాది తిరిగి నిర్వహించారు.

మరోవైపు గ్రూప్-3 పరీక్షలు నవంబరు 17, 18 తేదీల్లో పూర్తి అయ్యాయి. గ్రూప్-2 పరీక్షలు జరగాల్సి ఉంది. డిసెంబర్ల‌ 15, 16 తేదీల్లో గ్రూప్‌ 2 పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగాల భర్తీ విషయంలో మెరిట్ అభ్యర్థులకు న్యాయం జరిగేలా, కింది స్థాయి పోస్టుల్లో ఖాళీలు ఏర్పడకుండా కమిషన్‌ చర్యలు చేపడుతోంది.

ఇందులో భాగంగా మొదట గ్రూప్-1 ఫలి తాలను విడుదల చేస్తారు. గ్రూప్‌ 1 ఇంటర్వ్యూలు పూర్తయ్యాక . గ్రూప్-2 ఫలితాలు విడుదల చేసి పోస్టుల భర్తీ చేపడతారు. ఈ రెండు పూర్తయ్యాక గ్రూప్-3 ఫలితాలు విడుదల చేయాలని నిర్ణయించింది.

ఫిబ్రవరిలో గ్రూప్-1 ఫలితాలు

గ్రూప్‌ 1 పరీక్షల మూల్యాంకనాన్ని కమిషన్ వేగవంతం చేసింది. ఫిబ్రవరిలోగా ప్రధాన పరీక్షల ఫలితాలు వెలువరించేందుకు ప్రయత్నిస్తోంది. సర్టిఫికెట్‌ వెరిఫికేషన్ తర్వాత మార్చి నాటికి గ్రూప్-1 నియామక ప్రక్రియ ముగించాలని భావిస్తోంది. ఆ తర్వాత గ్రూప్-2 ఫలితాలు విడుదల చేసి పోస్టులను భర్తీ చేస్తారు. ఆ తర్వాత గ్రూప్-3 ఫలితాలు రానున్నాయి.

తెలంగాణలో గ్రూప్-3 క్యాడర్‌లో 1388 పోస్టుల భర్తీ కోసం నవంబరు 17, 18 తేదీల్లో టీజీపీఎస్సీ పరీక్షలు నిర్వహించింది. 2025 ఏప్రిల్‌ కల్లా అన్ని విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేయాలని కమిషన్ భావిస్తోంది.

తెలంగాణ పబ్లిక్‌సర్వీస్‌ కమిషన్‌లో ఉద్యోగ నియామకాలు వేగం పుంజుకోవడంతో దళారులు ఉద్యోగాలు వచ్చేలా సహాయం చేస్తామని ప్రలోభపెడితే వెంటనే ఫిర్యాదు చేయాలని టీజీపీఎస్సీ సూచించింది. తప్పుడు హామీలు ఇచ్చేవారిపై అప్రమత్తంగా ఉండాలని, అక్రమాలకు పాల్పడే వారిపై విజిలెన్స్ శాఖకు 99667 00338 నంబరులో ఫిర్యాదు చేయాలని, కమిషన్ కార్యదర్శి నవీన్ నికోలస్ సూచించారు.

Whats_app_banner