TGRTC New Buses: తెలంగాణ రోడ్డు రవాణా సంస్థకు మరో వెయ్యి కొత్త బస్సులు, కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్, రుణసేకరణకు యత్నాలు
TGRTC New Buses: తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకంతో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ తీవ్రంగా ఉంటోంది. ఆక్యుపెన్సీ రేటు కూడా గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో కొత్తగా మరో వెయ్యి బస్సుల్ని కొనుగోలు చేసేందుకు ఆర్టీసీ సిద్ధం అవుతోంది.
TGRTC New Buses: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థల బస్సుల కొరత త్వరలో తీరనుంది. పాత బస్సులతో ఆర్టీసీ ఇన్నాళ్లు నెట్టుకొస్తోంది. ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని ప్రవేశపెట్టిన తర్వాత బస్సులపై భారం మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ కొత్త బస్సుల కొనుగోలుకు రెడీ అవుతోంది.
తెలంగాణలో ప్రస్తుతం ప్రయాణికుల రద్దీకి చాలినన్ని ఆర్టీసీ బస్సులు లేవు. సగటున రోజుకు 95 శాతం నుంచి 115 శాతం వరకు ఆక్యుపెన్సీ రేషియో నమోదు అవుతోంది. ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించిన తర్వాత రద్దీ గణనీయంగా పెరిగింది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులు నడపడం ఇబ్బం దిగా మారింది. ఆర్టీసీలో కాలం చెల్లిన బస్సులు కూడా పెద్దసంఖ్యలో ఉన్నాయి.
వీలైనంత త్వరగా తెలంగాణలో కొత్త బస్సుల కొనుగోలుకు ప్రయత్నిస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇబ్బందులతోనే నెట్టుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో బస్సుల సంఖ్య పెంచాలంటూ నియోజక వర్గ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీల నుంచి ఆర్టీసీకి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు పెద్ద ఎత్తున వినతులు వచ్చాయి.
ప్రస్తుత అవసరాల దృష్ట్యా తెలంగాణలో 1244, కొత్త బస్సుల అవసరం ఉందని ఆర్టీసీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. కొత్తగా కొనుగోలు చేసే వాటిలో 500 బస్సులను కాలం చెల్లిన బస్సుల స్థానంలో ప్రవేశపెడతారు. మిగిలిన 500 బస్సులను రద్దీకి అనుగుణంగా నడుపుతారు. 'మహాలక్ష్మి' ప్రయాణికుల కోసం ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్ బస్సులు 350 వరకు కొను గోలు చేయనున్నారు.
వెయ్యి బస్సుల కొనుగోలుకు రూ.350-400 కోట్ల వరకు ఖర్చవుతుందని ఆర్టీసీ అంచనాలు రూపొందించింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వ సహకారం కోరుతోంది. మరోవైపు మహాలక్ష్మి' పథకం అమలు కోసం నెలకు రూ.300 కోట్లకు పైగా ప్రభుత్వం చెల్లిస్తోంది. దీంతో బస్సుల కొనుగోలు విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లభించలేదు. దీంతో ఆర్టీసీ ఉన్నతాధికారులు బ్యాంకు రుణాలను సమీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు.
గతంలో ఆర్టీసీ న నష్టాల్లో ఉండటంతో అప్పులు కూడా పుట్టేవి కాదు. ప్రస్తుతం తెలంగాణలో మెజార్టీ డిపోలు లాభాల్లోకి వచ్చాయి. మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ నష్టాల నుంచి బయటపడుతోంది. ఉచిత ప్రయాణాలతో ఆర్టీసీ కోల్పోయే డబ్బును ప్రభుత్వం చెల్లిస్తోంది. దీంతో 97 బస్ డిపోల్లో 72 లాభాల్లో నడుస్తున్నాయి. ఫలితంగా రుణ సమీకరణ సులువని తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ భావిస్తోంది.