GWMC : పన్ను వసూళ్లపై జీడబ్ల్యూఎంసీ ఫోకస్.. ట్యాక్స్ కట్టనోళ్లకు రెడ్ నోటీసులు.. ప్రాపర్టీలు స్వాధీనం-greater warangal municipal corporation officials focus on tax collection ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Gwmc : పన్ను వసూళ్లపై జీడబ్ల్యూఎంసీ ఫోకస్.. ట్యాక్స్ కట్టనోళ్లకు రెడ్ నోటీసులు.. ప్రాపర్టీలు స్వాధీనం

GWMC : పన్ను వసూళ్లపై జీడబ్ల్యూఎంసీ ఫోకస్.. ట్యాక్స్ కట్టనోళ్లకు రెడ్ నోటీసులు.. ప్రాపర్టీలు స్వాధీనం

HT Telugu Desk HT Telugu

GWMC : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పన్ను వసూళ్లపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఆర్థిక సంవత్సరం ముగుస్తుండటం, పన్ను వసూళ్లు సగం కూడా పూర్తి కాకపోవడంతో.. క్షేత్రస్థాయి సిబ్బందికి టార్గెట్ పెట్టి మరీ ట్యాక్స్ కలెక్షన్ చేయిస్తున్నారు. పల చోట్ల ప్రాపర్టీలు స్వాధీనం చేసుకుంటున్నారు.

ఫర్నీచర్ స్వాధినం చేసుకుంటున్న అధికారులు

జీడబ్ల్యూఎంసీ అధికారులు బడా బకాయిదారులపై కొరడా ఝులిపిస్తున్నారు. ప్రత్యేకంగా యాక్షన్ ప్లాన్ రెడీ చేసి పన్నులు వసూలు చేస్తున్నారు. రెడ్ నోటీసులు జారీ చేయడంతో పాటు ఏండ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న మొండిబకాయిదారుల ప్రాపర్టీస్ స్వాధీనం చేసుకుంటున్నారు. ఇప్పటికే కొన్నిచోట్ల ఫర్నిచర్, ఇతర సామగ్రి స్వాధీనం చేసుకోగా.. పన్ను వసూళ్ల లక్ష్యం పూర్తి చేయాలన్న ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు క్షేత్రస్థాయి సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ ట్యాక్స్ కలెక్షన్ చేస్తున్నారు.

సగం కూడా కాలే..

గ్రేటర్ వరంగల్ పరిధిలో దాదాపు 2.25 లక్షల ఇళ్లు ఉండగా.. 11 లక్షల వరకు జనాభా ఉంది. గ్రేటర్ సిటీ పరిధిలో షాపులు, కాంప్లెంక్సులు, హాస్పిటల్స్, ఇతర అపార్ట్‌మెంట్స్ అన్నీ కలిపి 30 వేలకుపైగా అసెస్మెంట్స్ ఉన్నాయి. వరంగల్ ట్రై సిటీ పరిధి నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 117.26 కోట్ల వరకు పన్నులు వసూలు చేయాల్సి ఉంది. కానీ అందులో ఇంతవరకు 51.91 కోట్ల వరకు మాత్రమే పన్నులు వసూలు చేశారు.

సిబ్బందికి వార్నింగ్..

నిర్దేశిత లక్ష్యం 50 శాతం కూడా పూర్తి కాలేదనే విషయం స్పష్టమవుతోంది. దీంతో గ్రేటర్ కమిషనర్ అశ్వినీ తానాజీ వాకడే క్షేత్రస్థాయి సిబ్బందికి ప్రత్యేకంగా టార్గెట్లు పెట్టారు. ఒక్కో అధికారి ప్రతి రోజు 100 వసూళ్లు పూర్తి చేయాలని లక్ష్యం పెట్టారు. టార్గెట్ రీచ్ కాకపోతే సీరియస్ యాక్షన్ ఉంటుందని కూడా హెచ్చరించారు. దీంతో క్షేత్రస్థాయి సిబ్బంది ఉరుకులు పరుగులు పెడుతున్నారు.

రెడ్ నోటీసులు..

కమిషనర్ ఆదేశాల మేరకు ఆర్ఐలు, బిల్ కలెక్టర్లు పన్నుల వసూళ్లపై దృష్టి పెట్టారు. క్షేత్రస్థాయిలో జీపుల ద్వారా ప్రచారం నిర్వహించడంతో పాటు దీర్ఘకాలం నుంచి పన్ను చెల్లించని వారి లిస్ట్ తయారు చేశారు. వారందరికీ రెడ్ నోటీసులు జారీ చేస్తున్నారు. నోటీసులకు కూడా రెస్పాండ్ అవని వారిపై తగిన యాక్షన్ తీసుకునేందుకు రెడీ అవుతున్నారు.

ప్రాపర్టీస్ స్వాధీనం..

మొండి బకాయిదారులకు మెసేజ్‌లు పంపించడం, పెద్ద మొత్తంలో బకాయి ఉన్న సంస్థలు, పరిశ్రమల వద్దకు మున్సిపల్ అధికారులు ఒక టీమ్‌గా వెళ్లి వసూళ్లు చేయడంపై ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగానే పన్నులు కట్టని షాపులకు సంబంధించిన ప్రాపర్టీస్ స్వాధీనం చేసుకునే పనిలో పడ్డారు. నగరంలోని కాజీపేట రైల్వే స్టేషన్ సమీపంలో కేఆర్ రెడ్డి బిర్యానీ సెంటర్ రెండు సంవత్సరాలుగా పన్ను కట్టలేదు. దీంతో దాదాపు పది రోజుల కిందట అక్కడి ఫర్నిచర్ స్వాధీనం చేసుకున్నారు.

బడా బకాయిదారులపై నిర్లక్ష్యం!

పన్ను వసూలులో క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. కొంతమంది బడా బకాయిదారులను వదిలేస్తున్నారనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ట్యాక్స్ కలెక్షన్‌లో పెద్ద మొత్తంలో ఏరియర్స్ పెరిగిపోతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కమిషనర్ ఆశ్వినీ తానాజీ వాకడే పన్ను వసూళ్లపై స్పెషల్ ఫోకస్ పెట్టగా.. ఈ నెలాఖరుకల్లా టార్గెట్ రీచ్ కావాలని క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించారు. ఈ నెల రోజుల్లోగా సగానికిపైగా పేరుకుపోయి ఉన్న మొండిబకాయిలను వసూలు చేసేందుకు ఆఫీసర్లు తీసుకుంటున్న చర్యలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.