GWMC Budget : ఉద్రిక్తతల నడుమ గ్రేటర్ వరంగల్ బడ్జెట్ - రూ..650.12 కోట్ల పద్దుకు ఆమోదం
Greater Warangal Budget 2024 :ఉద్రిక్తతల నడుమ గ్రేటర్ వరంగల్ బడ్జెట్ సమావేశం జరిగింది. బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్ల ఆందోళనల మధ్య బడ్జెట్ కు ఆమోదముద్ర పడింది.
Greater Warangal Municipal Corporation Budget: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ ఉద్రిక్తతల నడుమ ఆమోదం పొందింది. గురువారం జీడబ్ల్యూఎంసీ బడ్జెట్ సమావేశం నిర్వహించేందుకు నిర్ణయించగా, మేయర్ గుండు సుధారాణిని గద్దె దించాలనే ఉద్దేశంతో సమావేశానికి బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు బ్లాక్ రిబ్బన్లు ధరించి, హాజరయ్యారు.
కాగా కొద్దిరోజులుగా మేయర్ ను గద్దె దించాలనే డిమాండ్ తో బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, కార్పొరేటర్లను చెక్ చేసి మరీ కౌన్సిల్ హాలు లోపలికి పంపించారు. కార్పొరేటర్లను తనిఖీ చేసి సమావేశానికి పంపడం పట్ల పలువురు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
పోలీసులతో కొందరు కార్పొరేటర్లు వాగ్వాదానికి దిగారు. ఆ తరువాత మేయర్ అధ్యక్షతన బడ్జెట్ సమావేశం ప్రారంభం అవుతున్న దశలో కొందరు కార్పొరేటర్లు బడ్జెట్ పేపర్లను లాక్కున్నారు. దీంతో జీడబ్ల్యూఎంసీ కౌన్సిల్ హాలులో గందరగోళం నెలకొనగా, చివరకు మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో గ్రేటర్ బడ్జెట్ కు ఆమోదం లభించింది.
రూ.650.12 కోట్ల అంచనా బడ్జెట్…
రాజకీయ గందరగోళం అనంతరం వరంగల్ మహా నగర పాలక సంస్థకు సంబంధించిన 2024–25 సంవత్సరానికి గాను ముసాయిదా బడ్జెట్ అంచనాలను మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన పాలక వర్గం ఆమోదించింది. మొత్తంగా రూ.650 కోట్ల 12 లక్షల అంచనాలతో రూపొందించిన బడ్జెట్ కు మెజారిటీ సభ్యులు చేతులెత్తి అంగీకారం తెలపడంతో బడ్జెట్ కు ఆమోదం లభించింది. ఇందులో రూ.237 కోట్ల 2 లక్షలు సాధారణ పన్నుల ద్వారా, రూ.410 కోట్ల 10 లక్షలు వివిధ గ్రాంట్ల ద్వారా సమకూరుతుందని అంచనా వేశారు.
సమగ్ర అభివృద్ధికి సమగ్ర బడ్జెట్…
బల్దియాను సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు సమగ్ర బడ్జెట్ పెట్టినట్టు మేయర్ గుండు సుధారాణి తెలిపారు. వరంగల్ నగర ప్రజలకు ఎలాంటి పన్నుల భారం లేకుండా 2024–-25 ఆర్థిక సంవత్సరం అంచనాలు, వ్యయాలు సిద్ధం చేశామని, బల్దియా బడ్జెట్ లో వాస్తవాలకు దగ్గరగా ఉండేందుకు కొన్ని సవరణలు చేశామన్నారు.
ఈ బడ్జెట్ డివిజన్ల అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తుందని అభిప్రాయపడ్డారు. బల్దియా సొంత ఆదాయం ద్వారా వచ్చే 237 కోట్ల 2 లక్షల రూపాయలలో 80 కోట్ల రూపాయలు సిబ్బంది జీత బత్యాలు, 25 కోట్ల 80 లక్షల రూపాయలు పారిశుద్ధ్య నిర్వహణకు, 18 కోట్ల 45 లక్షల రూపాయలు విద్యుత్ చెల్లింపులకు ఖర్చవుతుందన్నారు. 23 కోట్ల 70 లక్షల రూపాయలు గ్రీన్ బడ్జెట్ కు, 25 కోట్ల 75 లక్షల రూపాయలు ఇంజినీరింగ్ విభాగానికి, 18 కోట్ల 50 లక్షల రూపాయలు సాధారణ నిర్వహణకు, 1 కోటి 20లక్షల రూపాయలు టౌన్ ప్లానింగ్ కోసం, కోటి 50 లక్షల రూపాయలు డిజాస్టర్ రెస్పాన్స్ కోసం కేటాయించినట్లు తెలిపారు.
విలీన గ్రామాల్లో, స్లమ్ ఏరియాల అభివృద్దికి, మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 14 కోట్ల 4 లక్షలు , అలాగే ప్రజా సౌకర్యాల కల్పన, పార్కుల అభివృద్ధి, జంతువధ శాలలు, వీధి వ్యాపారులు వెండింగ్ జోన్లు, ఓపెన్ జిమ్ ల ఏర్పాటుకు రూ. 5 కోట్ల 20 లక్షలు, వార్డుల వారీగా అత్యవసర అభివృద్ధి పనులు చేపట్టేందుకు 22 కోట్ల 88 లక్షల రూపాయాలు కేటాయించడం జరిగిందని పేర్కొన్నారు.
250 కోట్లతో ముంపు నివారణ పనులు
వరంగల్ నగర ముంపు నివారణ చర్యల్లో భాగంగా నాలాల అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి టీయూఎఫ్ఐడీసీ కింద నగరానికి 250 కోట్లు మంజూరు చేశారని, ఇందుకు పాలకవర్గం తరఫున ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
సీఎం రేవంత్ రెడ్డి దిశా నిర్దేశనంలో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల సహకారంతో గ్రేటర్ వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు నిరంతరం శ్రమిస్తున్నామన్నారు. అందరి సహకారంతో రానున్న రోజుల్లో వరంగల్ నగరాన్ని రాష్ట్రంలోనే ఉత్తమ నగరంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు రేవురి ప్రకాష్ రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య, గ్రేటర్ కమిషనర్ అశ్వినీ తానాజీ వాఖడే, తదితరులు పాల్గొన్నారు.