GWMC Budget 2025 : గ్రేటర్ వరంగల్ బడ్జెట్ రూ.1071.48 కోట్లు - భారీ పద్దుకు ఆమోదం..!-greater warangal municipal corporation approves rs 1071 crore budget ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Gwmc Budget 2025 : గ్రేటర్ వరంగల్ బడ్జెట్ రూ.1071.48 కోట్లు - భారీ పద్దుకు ఆమోదం..!

GWMC Budget 2025 : గ్రేటర్ వరంగల్ బడ్జెట్ రూ.1071.48 కోట్లు - భారీ పద్దుకు ఆమోదం..!

HT Telugu Desk HT Telugu

Greater Warangal Budget 2025: వరంగల్ మహా నగర పాలక సంస్థకు సంబంధించిన 2025–26 సంవత్సరానికిగాను బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన పాలక వర్గం ఈ అంచనాలను ఆమోదించింది. ఈసారి రూ.1071.48 కోట్లతో కూడిన భారీ పద్దును తీసుకువచ్చారు.

వరంగల్ నగర బడ్జెట్ - జీడబ్ల్యూఎంసీ కౌన్సిల్ ఆమోదం

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) 2025–26 ఆర్థిక సంవత్సరానికి భారీ బడ్జెట్ ను ప్రతిపాదించింది. గతేడాది రూ.650.12 కోట్లతో గ్రేటర్ బడ్జెట్ పెట్టగా.. ఈసారి అంచనాలు భారీగా పెంచేసి రూ.1071.41 కోట్లతో ముసాయిదా బడ్జెట్ ప్రవేశ పెట్టారు. దీంతో గ్రేటర్ మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో జీడబ్ల్యూఎంసీ పాలక వర్గం ఆమోదం తెలిపింది.

ఇందులో రూ.337 కోట్ల 38 లక్షలు సాధారణ పన్నుల ద్వారా, రూ.728 కోట్ల 10 లక్షలు వివిధ గ్రాంట్ల ద్వారా, రూ 600 కోట్లు డిపాజిట్లు, అడ్వాన్సుల ద్వారా సమకూరుతాయని అంచనా వేశారు. ఈ బడ్జెట్ సమావేశంలో రాష్ట్ర అటవీ పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పరకాల, వర్ధన్నపేట, వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్ రెడ్డి, కేఆర్ నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

దేనికి ఎంత..?

బల్దియా సొంత ఆదాయం ద్వారా వచ్చే 337 కోట్ల 38 లక్షల రూపాయలలో 100 కోట్ల రూపాయలు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది జీతభత్యాలు, 29 కోట్ల 92 లక్షల రూపాయలు పారిశుద్ధ్య నిర్వహణకు వినియోగించనున్నారు. మరో 34 కోట్ల 30 లక్షల రూపాయలు విద్యుత్తు చెల్లింపులు, 33 కోట్ల 74 లక్షల రూపాయలు గ్రీన్ బడ్జెట్, 41 కోట్ల 5 లక్షల రూపాయలు ఇంజనీరింగ్ విభాగానికి కేటాయించారు. 21 కోట్ల 15 లక్షల రూపాయలు సాధారణ నిర్వహణకు, కోటి 40 లక్షల రూపాయలు టౌన్ ప్లానింగ్ కోసం, కోటి 50 లక్షల రూపాయలు డిజాస్టర్ రెస్పాన్స్ కొరకు కేటాయించారు.

విలీన గ్రామాలు, బలహీనవర్గాలు నివసించే ప్రాంతాల్లోని స్లమ్ ఏరియాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు రూ.24 కోట్ల 77 లక్షలు, అలాగే ప్రజా సౌకర్యాల కల్పన, పార్కుల అభివృద్ధి, జంతువధ శాలలు, వీధి వ్యాపారులు, వెండింగ్ జోన్లు, ఓపెన్ జిమ్ ల ఏర్పాటుకు రూ. 10 కోట్ల 40 లక్షలు, వార్డుల వారీగా అత్యవసర అభివృద్ధి పనులు చేపట్టేందుకు రూ.39 కోట్ల 15 లక్షలు కేటాయించారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న రూ.187 కోట్ల స్టాంప్ డ్యూటీ ఫండ్స్ ను ముఖ్యమంత్రి మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు. కాగా ఆ బడ్జెట్ పారిశుద్ధ్య కార్మికులు, ఎలక్ట్రికల్ వర్కర్ల జీతభత్యాలు పెంచడానికి స్లమ్ ఏరియాల అభివృద్ధికి 1/3 బడ్జెట్ కేటాయించేందుకు తోడ్పడిందన్నారు.

గ్రేటర్ పై స్పెషల్ ఫోకస్: మంత్రి సురేఖ

గ్రేటర్ వరంగల్ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారని, రాష్ట్ర రెండో రాజధానిగా డెవలప్ చేస్తున్నారని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ అన్నారు. ఈ అభివృద్ధిలో మనమంతా భాగస్వాములు కావాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ నగరాన్ని అన్నివిధాలా సుందరంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో టెల్ పార్క్ , విమానాశ్రయం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, స్ట్రోమ్ వాటర్ డ్రైన్, ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాజకీయాలకతీతంగా వరంగల్ నగరాభివృద్ధికి అందరు సమష్టిగా కృషి చేయాలని కోరారు.

నగర అభివృద్ధికి కృషి: మేయర్

సీఎం రేవంత్ రెడ్డి దిశా నిర్దేశంలో జిల్లా ఇంచార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేల సహకారంతో గ్రేటర్ వరంగల్ నగర అభివృద్ధికి కృషి చేస్తున్నామని మేయర్ గుండు సుధారాణి తెలిపారు. అందరి సహకారంతో నగరాన్ని రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తామని స్పష్టం చేశారు. వరంగల్ మహానగర పాలకవర్గం కొలువుదీరిన తర్వాత నాలుగోసారి బడ్జెట్ ప్రవేశ పెడుతున్నామని, నగర ప్రజలకు ఎలాంటి పన్నుల భారం లేకుండా ఈ ఏడాది అంచనాలు సిద్ధం చేసినట్లు తెలిపారు. బల్దియా బడ్జెట్ లో వాస్తవాలకు దగ్గరగా ఉండేందుకు కొన్ని సవరణలు చేశామని, ఈ బడ్జెట్ డివిజన్ల అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తుందని పేర్కొన్నారు.

గ్రేటర్ వరంగల్ పాలకవర్గం ప్రవేశ పెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలకు ఆమోదయోగ్యం గా ఉందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. గ్రేటర్ వరంగల్ పరిధిలో వర్ధన్నపేట నియోజకవర్గానికి చెందిన 13 విలీన గ్రామాలున్నాయని, వాటిని అభివృద్ధి పరిచేలా నిధులు కేటాయించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ కు ధీటుగా వరంగల్ ను అభివృద్ధి చేయాలనే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారన్నారు. అభివృద్ధిలో కార్పొరేషన్కు సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. బల్దియాలో అభివృద్ధి జరగాలంటే వివిధ పన్నుల ద్వారా ఆదాయ వనరులను సమకూర్చుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య , గ్రేటర్ కమిషనర్ అశ్వినీ తానాజీ వాకడే, డిప్యూటీ మేయర్ రిజ్వాన షమీమ్ మసూద్, కార్పొరేటర్లు, బల్దియా వివిధ వింగ్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి).

HT Telugu Desk