Hyderabad : పారిశ్రామికవేత్త వెలమాటి జనార్ధన రావు మృతి.. ఆస్తి కోసం చంపేసిన మనవడు!-grandson killed industrialist velamati janardhana rao for property in hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad : పారిశ్రామికవేత్త వెలమాటి జనార్ధన రావు మృతి.. ఆస్తి కోసం చంపేసిన మనవడు!

Hyderabad : పారిశ్రామికవేత్త వెలమాటి జనార్ధన రావు మృతి.. ఆస్తి కోసం చంపేసిన మనవడు!

Basani Shiva Kumar HT Telugu
Published Feb 08, 2025 03:37 PM IST

Hyderabad : తెలుగు నేల మీద మొదటి తరం పారిశ్రామిక వెత్తలలో ఒకరు వెలమాటి జనార్ధన రావు. హైడ్రాలిక్స్, నుమాటిక్స్‌ని పరిచయం చేశారు. అలాంటి వ్యక్తి హత్యకు గురయ్యారు. అది కూడా మనవడి చేతిలోనే. అవును.. ఆస్తి కోసం వెలమాటి జనార్ధన రావును ఆయన మనవడు కత్తితో పొడిచి చంపేశాడు.

వెలమాటి జనార్ధన రావు
వెలమాటి జనార్ధన రావు

ఆస్తి వివాదం ప్రముఖ పారిశ్రామికవేత్త హత్యకు దారి తీసింది. ఆస్తి పంచి ఇవ్వడం లేదని తాతను సొంత మనవడే కత్తితో పొడిచి హత్య చేశాడు. అడ్డుకోబోయిన తల్లిపై కూడా దాడి చేశాడు. ఈ ఘటన గురువారం రాత్రి బేగంపేట ఏరియాలో జరిగింది. ఈ హత్య గురించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెలమాటి చంద్రశేఖర జనార్దన రావుకు పటాన్‌చెరు, బాలానగర్‌ పారిశ్రామికవాడల్లో పరిశ్రమలు ఉన్నాయి. ఆయన కుమార్తె సరోజినీదేవి. భర్తతో విభేదాలు రావడంతో తండ్రి వద్దే ఉంటుంది. ఆమె కుమారుడు కిలారు కీర్తితేజ తల్లిదండ్రులతో కాకుండా వేరుగా ఉంటున్నాడు.

ఆస్తి కోసం గొడవలు..

కొంత కాలంగా వీరి కుటుంబంలో ఆస్తి పంపకాల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. కొన్ని రోజుల కిందట జనార్దన రావు.. తన మనవడు కీర్తితేజకు రూ.4 కోట్ల వరకు డబ్బులు ఇచ్చాడు. ఆ తర్వాత తనకు ఇంకా డబ్బులు కావాలని, తనను సరిగ్గా పెంచలేదని తాతతో తరచూ గొడవ పడేవాడు. ఈ నేపథ్యంలోనే గురువారం రాత్రి 11 గంటల సమయంలో తాత జనార్దన రావు ఇంటికి కీర్తి తేజ వచ్చాడు. తనకు ఆస్తి పంచి ఇవ్వాలని గొడవ పెట్టుకున్నాడు.

కత్తితో దాడి..

గొడవకు దిగిన కీర్తి తేజను తల్లి సరోజినిదేవి వారించింది. ఇదే సమయంలో కోపంతో.. తన వెంట తెచ్చుకున్న కత్తితో తాతను పొడిచాడు. తల్లి అడ్డు రాగా ఆమెపైనా దాడి చేశాడు. కత్తిపోట్లతో గాయపడ్డ జనార్దన రావు.. అక్కడికక్కడే మృతి చెందాడు. కాసేపటికి తేరుకున్న సరోజినీదేవి.. తన కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది.

పోలీసుల అందుపులో నిందితుడు..!

కుటుంబ సభ్యులు వచ్చి సరోజిని దేవిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారమిచ్చారు. జనార్దన రావు కుమారుడు వెలమాటి గంగాధర్‌ శ్రీనివాస్‌ ఫిర్యాదు మేరకు.. పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టారు. నిందితుడు కీర్తి తేజను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. జనార్దన రావు మృతిపట్ల ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పరిశ్రమ రంగంలో ఆయన చేసిన సేవలను కొనియాడారు.

Whats_app_banner