Jagtial : కళ్లు చెమర్చే ఘటన.. వృద్ధురాలిని బయటకు నెట్టేసిన ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది
Jagtial : జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను ఇటీవల సరెండర్ చేసినా సిబ్బంది నిర్లక్ష్యం వీడడంలేదు. అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చే వారిపట్ల కఠినంగా ప్రవర్తించి పరువు తీస్తున్నారు. పేషెంట్లకు సక్రమంగా వైద్యం అందాలంటే.. వైద్య సిబ్బందికి చికిత్స చేయాల్సిన అవసరం ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఆసుపత్రిలో చేరిన పేషెంట్‌కు సపర్యాలు చేస్తూ.. అస్వస్థతకు గురైన వృద్దురాలిను వైద్య సిబ్బంది బయటకు నెట్టేశారు. అస్వస్థతకు గురైన వృద్ధురాలుకు మానవతా ధృక్పథంతో వైద్యం చేయాల్సింది పోయి.. బయటకు పంపడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆసుపత్రిలో పనిచేసే వారు మనుషులా రాక్షసులుగా అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోగుల కంటే ముందు వైద్య సిబ్బందికి చికిత్స చేయాలని జనం కోరుతున్నారు.
ఏం జరిగింది..
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామానికి చెందిన రాజనర్సు అనారోగ్యానికి గురయ్యారు. వారం రోజుల కిందట జగిత్యాలలోని పెద్దాసుపత్రికి తీసుకొచ్చారు. వైద్యం పొందుతున్న అతనికి అటెండెంట్‌గా ఆయన భార్య మల్లవ్వ వచ్చింది. మల్లవ్వ చేతికి గాయం అయ్యింది. అయినా భర్త ఆరోగ్యం బాగుపడాలని పరితపించి సపరిచర్యలు చేస్తోంది.
రెండు రోజులుగా హైబీపీతో బాధ పడుతున్న మల్లవ్వ సొమ్మసిల్లి పడిపోయింది. తన భర్తకు ఆసుపత్రిలో అలాట్ చేసిన బెడ్‌పై పడుకుంది. మల్లవ్వను గమనించిన ఆసుపత్రి సిబ్బంది.. ఆమెను వీల్ ఛైర్‌పై ఆసుపత్రి నుండి బయటకు తీసుకొచ్చి రోడ్డు పక్కన దింపి వెల్లిపోయారు. అనారోగ్యానికి గురైన తన భార్యను దవాఖాన సిబ్బంది బయటకు తీసుకెల్తున్న విషయాన్ని గమనించిన రాజనర్సు.. ఆసుపత్రి నుంచి బయటకు వచ్చి రోడ్డు పక్కన పడుకుని ఉన్న తన భార్య వద్దకు చేరుకున్నాడు. మల్లవ్వతో పాటు ఉన్న రాజనర్సును గమనించిన స్థానికులు.. జగిత్యాల టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మల్లవ్వ, రాజనర్సులను ఆసుపత్రి లోపలికి తరలించారు.
గతంలోనూ..
జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి ఘటనలు సర్వసాధరణంగా మారిపోయాయన్న ఆరోపణలు ఉన్నాయి. గతంలో కూడా ఓ వృద్ధుడిని పాత బస్ స్టేషన్‌లో దింపి పోయారు. స్థానికులు గమనించి ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. తిరిగి ఆసుపత్రికి తరలించారు. అలాగే ఓ గర్భీణి కడుపులో గుడ్డలు మరిచిపోయిన ఘటన కూడా వెలుగులోకి రావడం అప్పట్లో సంచలనంగా మారింది. తాజాగా భర్తకు అటెండెంట్‌గా ఉన్న మల్లవ్వ విషయంలోనూ ఆసుపత్రి సిబ్బంది వ్యవహరించిన తీరు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
చర్యలు తీసుకున్నా..
జగిత్యాల ఆసుపత్రి యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను సరెండర్ చేస్తూ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ ఆసుపత్రి యంత్రాంగం వైఖరిలో మార్పు రాకపోవడం విస్మయం కల్గిస్తోంది. వృద్ధ దంపతుల విషయంలో వ్యవహరించిన తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా సర్కారు ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల సిబ్బంది వ్యవహరిస్తున్న తీరును గమనించి.. అధికారులు వారిని క్రమశిక్షణలో పెట్టేందుకు ప్రత్యేకంగా చికిత్స చేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
(రిపోర్టింగ్-కె.వి రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)