TG Indiramma Housing Scheme : ఇండ్ల నిర్మాణాలు వేగంగా.. లబ్ధిదారులకు మరింత మేలు జరిగేలా ప్రభుత్వం చర్యలు!-government steps to speed up construction of indiramma houses ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Indiramma Housing Scheme : ఇండ్ల నిర్మాణాలు వేగంగా.. లబ్ధిదారులకు మరింత మేలు జరిగేలా ప్రభుత్వం చర్యలు!

TG Indiramma Housing Scheme : ఇండ్ల నిర్మాణాలు వేగంగా.. లబ్ధిదారులకు మరింత మేలు జరిగేలా ప్రభుత్వం చర్యలు!

Basani Shiva Kumar HT Telugu
Published Feb 17, 2025 09:39 AM IST

TG Indiramma Housing Scheme : రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లను వీలైనంత వేగంగా నిర్మించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నీ సమకూర్చాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో మేస్త్రీలకు శిక్షణ ఇప్పిస్తోంది.

ఇందిరమ్మ ఇల్లు
ఇందిరమ్మ ఇల్లు

తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ పథకంలో లబ్ధిదారులకు వీలైనంత ఎక్కువ మేలు జరిగేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఇసుక, సిమెంట్, స్టీల్ వంటి సామాగ్రిని తక్కువ ధరకు ఇప్పించేలా చర్యలు తీసుకుంది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా లబ్ధిదారులకు మరింత మేలు జరగనుంది.

ఆరు రోజులు శిక్షణ..

ఇందిరమ్మ ఇళ్లు కట్టడానికి మేస్త్రీలకు ట్రైనింగ్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ మాదాపూర్ లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్‌ (న్యాక్)లో శిక్షణ ఇప్పిస్తోంది. మొదటి దశలో 250 మందికి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఒక్కో బ్యాచ్‌కు ఆరు రోజుల పాటు.. మొత్తం వెయ్యి మందికి శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. శనివారం నుంచే శిక్షణ ప్రారంభమైంది.

గ్రామాలకు మేస్త్రీలు..

ఇక్కడ శిక్షణ తీసుకున్న మేస్త్రీలను గ్రామాలకు పంపనున్నారు. వారికి పనులు ఇప్పించేలా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా 50 గజాల నుంచి 100 గజాల స్థలంలో 450 ఎస్ఎఫ్‌టీలో రూ. 5 లక్షల్లో ఇల్లు ఎలా నిర్మించాలో వీరికి శిక్షణ ఇస్తున్నారు. నిర్మాణ రంగంలో అనుభవం ఉన్న వారితో ఈ అంశంపై అవగాహన కల్పిస్తున్నారు.

న్యాక్ ద్వారా జిల్లాల్లో శిక్షణ..

ఇది పూర్తయిన తర్వాత.. వచ్చేనెలలో అన్ని ఉమ్మడి జిల్లాల్లో న్యాక్ ద్వారా ట్రైనింగ్ ఇప్పిస్తామని.. అధికారులు చెబుతున్నారు. మరోవైపు మండలాల వారీగా సిమెంట్ ఇటుకల తోపాటు.. సెంట్రింగ్ సరఫరా చేసేందుకు ఆసక్తి చూపే వారిని గుర్తించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. వీరికి సెర్ప్, మెప్మా ద్వారా తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పించనున్నారు. ఆ రుణాలతో ఇటుకలు తయారు చేసించి.. సరఫరా చేయించనున్నారు.

కొరత లేకుండా చర్యలు..

ఇటుకలు, సెంట్రింగ్, మేస్త్రీల కొరత లేకుండా చూడటానికి ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. కొరత ఉంటే ఇండ్లు నిర్మించడం ఆలస్యం అవుతుందని.. త్వరగా పూర్తి చేయడానికి ఈ చర్యలు చేపట్టినట్టు అధికారులు వివరిస్తున్నారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా క్షేత్రస్థాయిలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే.. ఎన్నికల కోడ్ ఉన్న జిల్లాల్లో ప్రక్రియ ఆలస్యం కానుంది. కోడ్ లేని జిల్లాల్లో నిర్మాణాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.

Basani Shiva Kumar

eMail
Whats_app_banner