Pakhal Lake : ఎకో సెన్సిటివ్ జోన్‌గా పాకాల అటవీ ప్రాంతం.. లాభాలు, నష్టాలు ఏంటీ?
Pakhal Lake : వరంగల్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రం పాకాలకు సంబంధించి.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాంతాన్ని ఎకో సెన్సిటివ్ జోన్‌గా ప్రకటించింది. అసలు ఎకో సెన్సిటివ్ జోన్ అంటే ఏంటీ.. దీని వల్ల కలిగే లాభాలు, నష్టాలు ఏంటో ఓసారి చూద్దాం.
చుట్టు దట్టమైన అడవి. మధ్యలో వెండి రంగులో మెరిసే సరస్సు. విభిన్న జాతుల పక్షుల కిలకిలరావాలు. ఇవీ పాకాల ప్రత్యేకతలు. ఎప్పుడో కాకతీయుల కాలంలో నిర్మించిన సరస్సు.. ఇప్పటికీ ఎంతోమంది రైతులకు సాగునీరు అందిస్తోంది. వేలాది ఎకరాలకు ప్రాణం పోస్తోంది. కానీ.. కొందరి స్వార్థం కారణంగా.. ఈ ప్రాంతానికి ఉన్న ప్రత్యేకతలు కనుమరుగు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది.
ఎకో సెన్సిటివ్ జోన్‌గా ప్రకటన..
పాకాల చుట్టూ ఉన్న ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం ఎకో సెన్సిటివ్ జోన్‌గా ప్రకటించింది. ఈ మేరకు ఇటీవలే నోటిఫికేషన్‌ను జారీ చేసింది. వరంగల్, ములుగు, మహబూబాబాద్ జిల్లాల పరిధిలో పాకాల అడవులు విస్తరించి ఉన్నాయి. ఈ అడవులను పరిరక్షించేందుకు.. కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ.. తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి ఆధ్వర్యంలో పర్యవేక్షణ కమిటీని నియమించింది.
కమిటీలో ఎవరెవరుంటారు..
ఈ కమిటీలో తెలంగాణ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్, పర్యావరణ శాఖ కార్యదర్శి, అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, వ్యవసాయ శాఖ కార్యదర్శి, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉంటారు. పర్యావరణ పరిరక్షణ కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి సభ్యులు, యూనివర్సిటీకి చెందిన జీవావరణ శాస్త్ర అధ్యాపకులు, జిల్లా కలెక్టర్, జీవ వైవిధ్య బోర్డు సభ్యులు, అటవీశాఖ డీఎఫ్ఓ, పర్యావరణ శాఖ డైరెక్టర్ కూడా ఈ కమిటీలో ఉంటారు.
ఏం చేస్తారు..
సెన్సిటివ్ ఎకో జోన్‌గా ప్రకటించడంతో.. అధికారుల పర్యవేక్షణ పెరుగుతుంది.క్వారీయింగ్‌లను బంద్ చేయిస్తారు. ఇక్కడి వాగుల్లో ఇసుకను తీసేందుకు అనుమతించరు. అడవిని అభివృద్ధి చేసేందుకు ఎకో టూరిజం సర్క్యూట్‌ను ఏర్పాటు చేస్తారు. కొత్తగా పరిశ్రమలు, డ్యామ్‌ల నిర్మాణానికి కూడా అనుమతి ఇవ్వరు. కొండలు, గుట్టల వద్ద రాళ్లు కొట్టడాన్ని అనుమతించరు.
ఇప్పుడేం జరుగుతోంది..
పాకాల అటవీ ప్రాంతంలో చాలా గ్రామాలు, గూడెలు ఉన్నాయి. ఇప్పటికే వందలాది ఎకరాల్లో చెట్లను నరికేసి పంటలు సాగుచేస్తున్నారు. వీరికి అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు సహకరించారనే ఆరోపణలు ఉన్నాయి. చెట్ల నరికివేత ఇప్పటికీ కొనసాగుతోందని అంటున్నారు. ఇక పాకాల అటవీ ప్రాంతంలో వాగులు ఉన్నాయి. గుట్టుచప్పుడు కాకుండా ఇసుకను తోడేస్తున్నారు. అలాగే జంతువుల వేట కూడా జరుగుతోందనే ఆరోపణలు ఉన్నాయి.
పర్యాటకంగా అభివృద్ధి..
పర్యాటకులను ఆకట్టుకునేందుకు రూ.56 లక్షలతో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నారు. బట్టర్ ఫ్లై గార్డెన్, బోటింగ్, నైట్ క్యాంపింగ్, ట్రెక్కింగ్, వన్యప్రాణులను వీక్షించేందుకు సఫారీని సిద్ధం చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు.
పాకాల ఎక్కడుంది..
పాకాల సరస్సు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి 190 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వరంగల్ రైల్వే స్టేషన్‌కు 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పాకాల సమీపంలో ఉన్న పట్టణం నర్సంపేట. కానీ.. ఈ సరస్సు ఖానాపురం మండల పరిధిలోకి వస్తుంది. నర్సంపేట నుంచి పాకాల 10 కిలోమీటర్ల ఉంటుంది. నర్సంపేట నుంచి కొత్తగూడ వెళ్లే మార్గంలో పాకాల అడవి ఉంది. ఇక్కడి ఆందాలను ఆస్వాదించడానికి హైదరాబాద్ నుంచి కూడా పర్యాటకులు వస్తుంటారు.