Janagama BRS Office: జనగామ బీఆర్ఎస్ ఆఫీసుకు సర్కారు నోటీసులు, గులాబీ నేతలకు వరుస షాకులు-government notices for janagama brs office for unauthorised constructions ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Janagama Brs Office: జనగామ బీఆర్ఎస్ ఆఫీసుకు సర్కారు నోటీసులు, గులాబీ నేతలకు వరుస షాకులు

Janagama BRS Office: జనగామ బీఆర్ఎస్ ఆఫీసుకు సర్కారు నోటీసులు, గులాబీ నేతలకు వరుస షాకులు

HT Telugu Desk HT Telugu
Jul 12, 2024 09:36 AM IST

Janagama BRS Office: రాష్ట్రంలో సామాన్యుల ఇళ్ల నిర్మాణానికి నిబంధనలను కఠినతరం చేసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం.. తమ పార్టీ కార్యాలయాల నిర్మాణంలో మాత్రం ఆ నిబంధనలను తుంగలో తొక్కింది.

బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాలకు నోటీసులు
బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాలకు నోటీసులు

Janagama BRS Office: ఖరీదైన ప్రాంతాల్లో కూడా గజం వంద రూపాయల చొప్పున కొనుగోలు చేయడమే కాకుండా, చాలాచోట్లా అసలు ఎలాంటి పర్మిషన్లు లేకుండానే గులాబీ పార్టీ ఆఫీసుల బిల్డింగులు లేపింది. కొన్నిచోట్లా ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి మరి ఆఫీసులు కట్టింది. ఆ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు ఈ వ్యవహారం తెర చాటునే ఉండగా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రోజుకో చోట బీఆర్ఎస్ ఆఫీసులకు నోటీసులు చేరుతున్నాయి.

గతేడాది కోకాపేటలో నిర్మించిన ఆఫీస్ విషయంలో వివాదం తలెత్తగా.. ఆ తరువాత ఉమ్మడి నల్గొండ, వరంగల్, కరీంనగర్ లోని వివిధ జిల్లాల ఆఫీసులకు నోటీసులు జారీ అయ్యాయి. తాజాగా గురువారం సాయంత్రం జనగామ పార్టీ ఆఫీస్ కు నోటీసులు అందగా, వరుస షాకులతో బీఆర్ఎస్ నేతల్లో కలవరం మొదలైంది.

ఆఫీసుల నిర్మాణానికి అగ్గువకే స్థలం

తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలోని 28 జిల్లా కేంద్రాల్లో పార్టీ ఆఫీసుల నిర్మాణానికి భూములు సేకరించింది. ప్రభుత్వ స్థలాలను గుర్తించి, గజం రూ.100 చొప్పున చెల్లిస్తూ ఆయా జిల్లాల్లో దాదాపు ఎకరం స్థలాన్ని తీసుకుంది. దీంతో రూ.వందల కోట్లు విలువ చేసే స్థలాలు కూడా గజం రూ.100 చొప్పున చెల్లించి, ఆ తరువాత బిల్డింగులు కట్టి పార్టీ కార్యకలాపాలు మొదలు పెట్టింది. కానీ నిర్మాణ సమయంలో మాత్రం చాలా చోట్ల ఎలాంటి అనుమతులు మాత్రం తీసుకోకపోవడం, ఇంకొన్ని చోట్ల స్థలాలు కబ్జా చేసినట్లు తేలడంతో ఇప్పుడు ఆ ఆఫీసులకు నోటీసులు చేరుతున్నాయి.

కోకాపేట నుంచి మొదలు…

రాష్ట్రంలో మొదట రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేటలో నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ విషయంపై వివాదం మొదలైంది. కోకాపేటలోని సర్వే నంబర్ 239, 240లోని 11 ఎకరాల భూమిని బీఆర్ఎస్ పార్టీకి కేటాయించడాన్ని సవాల్ చేస్తూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ ఎం.పద్మనాభ రెడ్డి హైకోర్టులో గతేడాది పిటిషన్ దాఖలు చేశారు.

ఆఫీస్ నిర్మాణం కోసం కోట్లు విలువ చేసే 11 ఎకరాల భూమిని నామమాత్రపు ధరకు ప్రభుత్వం కేటాయించిందని, ప్రస్తుతం ఎకరాకు రూ.50 కోట్లకు పైగా ఉన్న భూమిని ప్రభుత్వం మాత్రం రూ.3.41 కోట్లకే బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చేసిందని కోర్టుకు విన్నవించారు. సుమారు రూ.500 కోట్ల విలువైన భూమిని రూ.37 కోట్లకే ఇచ్చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టుకు వెళ్లగా.. అప్పట్లోనే ఆ విషయం సంచలనంగా మారింది. ఆ తరువాత నల్గొండ ఆఫీస్ పై వివాదం చెలరేగింది.

నల్గొండ జిల్లాలో హైదరాబాద్ మెయిన్ రోడ్డును ఆనుకుని ఆగ్రోస్ కు ఉన్న రెండెకరాల స్థలంలో ఎకరాన్ని గులాబీ పార్టీ ఆఫీస్ కోసం అగ్గువ ధరకు కట్టబెట్టారు. బహిరంగ మార్కెట్ లో ఆ స్థలం విలువ వంద కోట్ల వరకు ఉండగా, గత ప్రభుత్వం మాత్రం కేవలం రూ.3.5 లక్షలకే ఇచ్చేసింది. స్థలం ఆగ్రోస్ దే అయినప్పటికీ మున్సిపల్ పాలకవర్గ ఆమోదం తప్పనిసరిగా ఉండాలి. కానీ అదంతా ఏమీ లేకుండానే అప్పటి గులాబీ నేతలు అంతా నడిపించారు.

ఎలాంటి పర్మిషన్ లేకుండానే బిల్డింగ్ లేపి పార్టీ ఆఫీస్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మున్సిపల్ అధికారులు ఆఫీస్ కు నోటీసులు జారీ చేశారు. కానీ ఎవరూ స్పందించలేదు. దీంతోనే జులై మొదటి వారంలో నల్గొండ జిల్లా కేంద్రంలో పర్యటించిన మంత్రి కోమటిరెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ వ్యవహారంపై మండిపడ్డారు.

ఎలాంటి పర్మిషన్ లేకుండా ఆఫీస్ నిర్మించారని, దానిని వెంటనే కూల్చేయాల్సిందిగా ఆదేశించారు. కూల్చివేత అనంతరం బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నిర్మాణానికి నల్గొండ శివారు ప్రాంతంలో స్థలం కేటాయించాల్సిందిగా సూచించారు. ఈ ఘటన జులై మొదటి వారంలో జరగగా, ఆ తరువాత రోజుకో చోట బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుల అక్రమ నిర్మాణాలపై నోటీసులు జారీ అవుతున్నాయి.

పార్కు స్థలంలో హనుమకొండ ఆఫీస్

హనుమకొండ జిల్లాలో బీఆర్ఎస్ ఆఫీస్ నిర్మాణం కోసం బాలసముద్రంలోని 1066 సర్వే నెంబర్ లోని ఎకరం ప్రభుత్వ స్థలాన్ని కేటాయించారు. కానీ అధికారులు చూపిన చోట కాకుండా అప్పటి బీఆర్ఎస్ నేతలు తమకు నచ్చిన చోట పార్కు స్థలంలో బిల్డింగ్ నిర్మించుకున్నారు. దాదాపు రూ.36 కోట్లు విలువ చేసే స్థలానికి గజం వంద చొప్పున రూ.4.8 లక్షల వరకు చెల్లించి ఆఫీస్ కట్టారు.

దీంతో తాజాగా వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మున్సిపల్ అధికారులను ఆశ్రయించగా, బీఆర్ఎస్ ఆఫీస్ కు నోటీసులు జారీ అయ్యాయి. ఆ బిల్డింగును కూల్చేస్తారనే వాదనలు కూడా వినిపించాయి. ఆ తరువాత ఉమ్మడి కరీంనగర్ లోని సిరిసిల్ల మినహా వివిధ జిల్లా ఆఫీస్లు కూడా పర్మిషన్లు లేకుండా నిర్మించగా, వాటికి కూడా నోటీసులు ఇవ్వడం గమనార్హం.

జనగామలో ఎకరానికి మరో ఎకరం కబ్జా

బీఆర్ఎస్ జనగామ ఆఫీస్ నిర్మాణానికి యశ్వంతాపూర్ భూమిని తీసుకున్నారు. వరంగల్–హైదరాబాద్ నేషనల్ హైవేకు అతి సమీపంలో 82/15/1, 82/16/1, 82/17/1 అనే సర్వే నెంబర్లలోని ఎకరం స్థలాన్ని రూ.4.8 లక్షలు చెల్లించి, ఆ తరువాత పార్టీ ఆఫీస్ కట్టుకున్నారు. వాస్తవానికి మొదటి జనగామ ఆఫీస్ కోసం సిద్దిపేట రోడ్డులోని పసరమడ్ల శివారులోని 114/4 సర్వే నెంబర్ లోని ఎకరం భూమిని కేటాయించారు.

కానీ అప్పటి గులాబీ లీడర్లు మాత్రం యశ్వంతాపూర్ శివారులోని స్థలాన్ని తీసుకున్నారు. ఆ తరువాత దాదాపు ఎకరం స్థలాన్ని అదనంగా కబ్జా చేసి పార్టీ ఆఫీస్ కోసం వాడుతున్నారు. ఇదిలాఉంటే బిల్డింగ్ నిర్మాణానికి కూడా గులాబీ నేతలు ఎలాంటి పర్మిషన్లు తీసుకోలేదు. దీంతో విషయం అధికారుల దృష్టికి చేరడంతో గురువారం సాయంత్రం బీఆర్ఎస్ ఆఫీస్ కు నోటీసులు జారీ చేశారు.

సర్వే నెంబర్ 82లో కేటాయించిన దానికంటే ఎక్కువ స్థలాన్ని వాడుకుంటున్నారని, అందుకు సంబంధించిన అనుమతి పత్రాలు ఏమున్నా సమర్పించాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు. 15 రోజుల్లోగా సమాధానం ఇవ్వాల్సిందిగా సూచించారు. దీంతో బీఆర్ఎస్ లీడర్లలో కలవరం మొదలైంది. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన పార్టీ ఆఫీస్లకు నోటీసులు జారీ అవుతుండగా, అధికారులు ఇచ్చిన గడువులోగా గులాబీ లీడర్లు పర్మిషన్ పత్రాలు సమర్పిస్తారో చూడాలి.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

Whats_app_banner