Miss World 2025 : తెలంగాణలో మిస్‌ వరల్డ్‌ పోటీలు.. పోచంపల్లి చీర కట్టనున్న విదేశీ వనితలు.. ఈసారీ ప్రత్యేకతలివే!-government makes arrangements to hold miss world 2025 pageant in telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Miss World 2025 : తెలంగాణలో మిస్‌ వరల్డ్‌ పోటీలు.. పోచంపల్లి చీర కట్టనున్న విదేశీ వనితలు.. ఈసారీ ప్రత్యేకతలివే!

Miss World 2025 : తెలంగాణలో మిస్‌ వరల్డ్‌ పోటీలు.. పోచంపల్లి చీర కట్టనున్న విదేశీ వనితలు.. ఈసారీ ప్రత్యేకతలివే!

Miss World 2025 : తెలంగాణలో మిస్‌ వరల్డ్‌ పోటీలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మే 10న హైదరాబాద్‌లో పోటీలు ప్రారంభం కానున్నాయి. వివిధ దేశాల అందగత్తెలు చార్మినార్‌లో షాపింగ్‌.. చౌమొహల్లాలో డిన్నర్‌ చేయనున్నారు. రాష్ట్రావతరణ దినోత్సవంలో మిస్‌ వరల్డ్‌–2025 పాల్గొననున్నారు.

మిస్‌ వరల్డ్‌–2025

వివిధ దేశాలకు చెందిన అందగత్తెలు పాల్గొనే అద్భుతమైన వేడుక మిస్‌ వరల్డ్‌ 2025. ఈ పోటీలకు తెలంగాణ సిద్ధమవుతోంది. మే 7 నుంచి 31 వరకు జరిగే ఈ వేడుకల కోసం గచ్చిబౌలి స్టేడియం, గచ్చిబౌలి ఐఎస్బీ, టీ–హబ్, శిల్పకళావేదిక.. ఇలా పలు ప్రాంతాలను సిద్ధం చేస్తున్నారు. ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక పోటీలు కావడంతో.. హైదరాబాద్ పేరు ప్రఖ్యాతులు మరింత విశ్వవ్యాప్తం అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది.

మూడోసారి..

దేశంలో ఇప్పటివరకు రెండుసార్లు మిస్ వరల్డ్ పోటీలు జరిగాయి. 1996లో తొలిసారిగా బెంగళూరులో జరిగాయి. ఆ తర్వాత గతేడాదే 71వ ఎడిషన్‌ పోటీలకు ముంబై వేదికైంది. ఇక 72వ ఎడిషన్‌ మన భాగ్యనగరంలో జరగనుంది. ఇతర దేశాల్లో పోటీలు జరిగినప్పుడు ఏర్పాట్లు భారీగానే ఉన్నా.. ఎక్కువ జనసందోహం ఉండేది కాదు. కానీ గతేడాది ముంబైలో జరిగినప్పుడు అందాలను చూడటానికి జనం తరలివచ్చారు. మిస్‌ వరల్డ్‌ నిర్వాహకులకు ఇది క్రేజీగా కనిపించింది. దీంతో మరోసారి భారత్‌లోనే నిర్వహిస్తే బాగుంటుందని భావించారు.

స్మితా సభర్వాల్‌ సక్సెస్..

మరోసారి భారత్‌లోనే నిర్వహించాలని నిర్వాహకులు భావిస్తున్నట్టు తెలుసుకున్న తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. నిర్వాహకులతో మాట్లాడి ఒప్పించే బాధ్యతను పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సభర్వాల్‌కు అప్పగించింది. నిర్వాహకులను ఒప్పించడంలో స్మిత సఫలీకృతం అయ్యారు. దీంతో హైదరాబాద్‌కు అరుదైన అవకాశం దక్కింది. ఈసారి 140 దేశాల సుందరీమణులు ఈ పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు చెబుతున్నారు.

హైదరాబాద్‌కు రాక..

మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే సుందరీమణులు మే 6, 7 తేదీల్లో హైదరాబాద్ చేరుకుంటారు. 10న గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో ప్రారంభ వేడుక జరుగుతుంది. తెలంగాణ జానపద, గిరిజన నృత్యాభినయ ఇతివృత్తంతో ఇది ఉంటుంది. గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియం, టీ–హబ్, శిల్పకళావేదిక, ఐఎస్బీ క్యాంపస్, హైటెక్స్‌ వేదికల్లో వివిధ అంశాల్లో పోటీలు జరుగుతాయి. వాటిని మిస్‌ వరల్డ్‌ నిర్వాహకులే ఎంచుకున్నారు.

పర్యాటక ప్రాంతాలకు..

ఈ పోటీలు జరిగే సమయంలో సుందరీమణులు రాష్ట్రంలోని వివిధ పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తారు. ఆ సందర్భంలో వారందరితో పోచంపల్లి చీరలు కట్టించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వమే వారిని తీసుకెళుతుంది. 40 మందిని ఒక బృందంగా ఏర్పాటు చేసి, ఒక్కో బృందాన్ని ఒక్కోచోటకు తీసుకెళ్తారు. 12న ఓ బృందం నాగార్జునసాగర్‌లోని బుద్ధవనం సందర్శిస్తుంది.

చార్మినార్ వద్ద షాపింగ్..

మే 13న సాయంత్రం ఆరు నుంచి ఏడు వరకు ఓ బృందం చార్మినార్, లాడ్‌బజార్‌లలో హెరిటేజ్‌ వాక్‌ నిర్వహిస్తుంది. అక్కడ షాపింగ్‌ చేస్తారు. 13న చౌమొహల్లా ప్యాలెస్‌లో ప్రత్యక్ష సంగీత విభావరి నడుమ పోటీదారులు విందులో పాల్గొంటారు. 14న అమెరికా–కరేబియన్‌ ప్రాంతాల పోటీదారులు వరంగల్‌లోని కాళోజీ కళాక్షేత్రాన్ని సందర్శిస్తారు. ఉదయం 11 నుంచి 2 వరకు అక్కడ స్థానికులు, విద్యార్థులతో మాట్లాడతారు. సాయంత్రం 5 నుంచి 7 వరకు యునెస్కో గుర్తింపు పొందిన ప్రఖ్యాత రామప్ప దేవాలయాన్ని సందర్శిస్తారు.

యాదగిరిగుట్టకు..

యూరప్‌నకు చెందిన పోటీదారుల బృందం 15న మధ్యాహ్నం 12 నుంచి 2 వరకు యాదగిరిగుట్ట దేవాలయాన్ని సందర్శిస్తుంది. యూరప్‌నకు చెందిన రెండో బృందం 15న సాయంత్రం యునైటెడ్‌ నేషన్స్‌ వరల్డ్‌ టూరిజం ఆర్గనైజేషన్‌ గుర్తించిన పోచంపల్లి గ్రామాన్ని సందర్శించి.. అక్కడి చేనేత వస్త్ర తయారీ కేంద్రాలను పరిశీలిస్తారు. 16న ఆఫ్రికా, మిడిలీస్ట్‌ దేశాలకు చెందిన పోటీదారులు మెడికల్‌ టూర్‌లలో భాగంగా.. హైదరాబాద్‌లోని అపోలో, ఏఐజీ, యశోదా ఆసుపత్రులను సందర్శిస్తారు.

19న హుస్సేన్‌సాగర్‌కు..

స్పోర్ట్స్‌ ఫైనల్‌ కార్యక్రమం మే 17న ఉదయం ఏడున్నర నుంచి పదిన్నర వరకు గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో జరుగుతుంది. అదేరోజు సాయంత్రం నగర శివారులోని ఎకో టూరిజం పార్కులో జరిగే కల్చరల్, ఫుడ్, ఆర్ట్‌ ఫెస్టివల్‌లో పాల్గొంటారు. హైదరాబాద్ పోలీసింగ్‌ తీరును పరిశీలించేందుకు 19న పోటీదారులు పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను సందర్శిస్తారు. 19న హుస్సేన్‌సాగర్‌ తీరం, అంబేడ్కర్‌ విగ్రహం, సచివాలయం ప్రాంతాలను సందర్శిస్తారు.

24న ఫ్యాషన్‌ ఫినాలే ..

మే 20, 21వ తేదీల్లో టీహబ్‌లో మిస్‌ వరల్డ్‌ కరేబియన్, మిస్‌ వరల్డ్‌ ఆఫ్రికా, మిస్‌ వరల్డ్‌ ఏషియా, ఓషియానియాల మధ్య కాంటినెంటల్‌ ఫినాలే ఉంటుంది. 21న సాయంత్రం 6 నుంచి రాత్రి 8 వరకు శిల్పారామంలో ఆర్ట్స్‌ క్రాఫ్ట్స్ వర్క్‌షాప్‌లో పాల్గొంటారు. 22న శిల్పకళావేదికలో టాలెంట్‌ ఫినాలే జరుగుతుంది. గచ్చిబౌలిలోని ఐఎస్బీలో 23న హెడ్‌ టూ హెడ్‌ ఛాలెంజ్‌ ఫినాలే జరుగుతుంది. 24న హైటెక్స్‌లో మోడల్‌ అండ్‌ ఫ్యాషన్‌ ఫినాలే జరుగనుంది. హైటెక్స్‌లోనే 25న నగలు వజ్రాభరణాల ఫ్యాషన్‌ షో జరుగుతుంది.

31న గ్రాండ్ ఫినాలె..

మే 26న బ్రిటిష్‌ రెసిడెన్సీ, తాజ్‌ ఫలక్‌నుమాలలో పర్పస్‌ ఈవెంట్‌ గలా డిన్నర్‌ ఉంటుంది. మే 31న గ్రాండ్‌ ఫినాలె ఉంటుంది. సాయంత్రం ఐదున్నర నుంచి రాత్రి ఒంటిగంట వరకు కొనసాగుతుంది. ఈసారి పరేడ్‌ మైదానంలో జరిగే రాష్ట్రావతరణ దినోత్సవంలో ప్రపంచ సుందరి సందడి చేయనుంది. మే 31న జరిగే తుదిపోరులో ఏ దేశానికి చెందిన సుందరి విజేతగా నిలుస్తుందో ఆమె.. జూన్‌ 2న జరిగే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొననుంది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ విజ్ఞప్తికి మిస్‌ వరల్డ్‌ నిర్వాహకులు అంగీకరించారు.

Basani Shiva Kumar

TwittereMail
బాసాని శివకుమార్ హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్‌లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీజీ పూర్తి చేశారు. గతంలో ఈనాడు, ఈటీవీ భారత్, టీవీ9 తెలుగు, టైమ్స్ ఆఫ్ ఇండియా సమయంలో పని చేశారు. 2025లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం