TG Govt Schemes : భూమిలేని వారికి శుభవార్త.. ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం.. 5 ముఖ్యమైన అంశాలు
TG Govt Schemes : తెలంగాణలో భూమిలేని పేదలకు దన్నుగా నిలవాలని రేవంత్ సర్కారు యోచిస్తోంది. వారికి సాయం చేయాలని వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది. తాజాగా రాష్ట్రంలో వ్యవసాయ కూలీల వివరాలు సేకరిస్తోంది. ఆ వివరాలు వచ్చాక విధివిధానాలు రూపొందించి, పథకం అమలు చేయనుంది.
తెలంగాణలో భూమి లేని నిరుపేదలు ఎంతోమంది ఉన్నారు. వారికి సాయం చేయాలని రేవంత్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. భూమిలేని పేదలకు ఏటా రూ.12 వేలు ఇవ్వాలని సంకల్పించింది. అందుకోసం ప్రయత్నాలను మొదలుపెట్టింది. భూమి లేని వ్యవసాయ కూలీల సమగ్ర వివరాల సేకరణపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అర్హుల కోసం గణాంకాల సేకరణ చేపట్టింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ద్వారా వారి వివరాలను సేకరిస్తోంది. దీనికి సంబంధించిన ముఖ్యమైన 5 అంశాలు ఇలా ఉన్నాయి.
5 ముఖ్యాంశాలు..
1.భూమిలేని పేదలకు రూ.12 వేలు సాయం చేసేందుకు.. జాతీయ ఉపాధి హామీ పథకం లబ్ధిదారుల జాబితాను ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకుంది. రాష్ట్రంలో 55 లక్షల మందికి ఉపాధి హామీ జాబ్‌కార్డులు ఉన్నాయి. వీరిలో ఎంతమంది పనుల్లో పాల్గొంటున్నారనే సమాచారాన్ని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సేకరిస్తోంది.
2.2022 నాటి గణాంకాల ప్రకారం.. మొత్తం కూలీల్లో 26 వేల మంది మాత్రమే వంద రోజుల పాటు పనుల్లో పాల్గొన్నారు. 60 నుంచి 70 రోజులు పాల్గొన్నవారు 2.50 లక్షల మంది ఉన్నారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో పరిశీలనలో తేలింది.
3.కొన్ని రోజులే పనుల్లో పాల్గొన్నవారు 17 లక్షల మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కూలీల పనిదినాలు, చెల్లింపులు పొందిన వారి సమాచారం కావాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖను రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ కోరింది.
4.ఆ జాబితా అందిన వెంటనే రాష్ట్ర అధికారులు దాన్ని వ్యవసాయ, రెవెన్యూ శాఖలకు పంపిస్తారు. ఆ జాబితాలో ఉన్నవారిలో ఎవరికైనా భూమి ఉందా? రైతుబంధు లేదా పీఎం కిసాన్ సాయం పొందుతున్నారా? పట్టాదారు పాసుపుస్తకాలు ఉన్నాయా అనే వివరాలను క్షేత్రస్థాయిలో సేకరిస్తారు.
5.అనంతరం భూమిలేని నిరుపేద వ్యవసాయ కూలీల జాబితాను సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తారు. మొత్తమ్మీద రాష్ట్రంలో సుమారు 17 లక్షల మంది భూమి లేని వ్యవసాయ కూలీలు ఉన్నారని ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలిసింది. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకొని అమలు చేసే అవకాశం ఉంది. ఈ పథకం ద్వారా భూమిలేని పేదలకు ఎంతో మేలు జరగనుంది.