Peddpalli Train Accident:పెద్దపల్లి సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్... పలు రైళ్ళ రాకపోకలకు అంతరాయం-goods derailed near peddapalli interruption of many trains ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Peddpalli Train Accident:పెద్దపల్లి సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్... పలు రైళ్ళ రాకపోకలకు అంతరాయం

Peddpalli Train Accident:పెద్దపల్లి సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్... పలు రైళ్ళ రాకపోకలకు అంతరాయం

Peddpalli Train Accident: రామగుండం - పెద్దపల్లి స్టేషన్ల మధ్య ఉన్న రాఘవాపూర్ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. 11 బోగీలు బోల్తాపడ్డాయి. చెన్నై - డిల్లీ ప్రధాన రైలు మార్గంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో పలు రైళ్ళు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనుల్లో సిబ్బంది

Peddpalli Train Accident: గూడ్స్‌ రైలు పట్టాలు తప్పడంతో చెన్నై- ఢిల్లీ ప్రధాన రైలు మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ ఘటన పెద్దపల్లి-రామగుండం మధ్య జరిగింది.

ఘజియాబాద్ నుండి కాజీపేట వైపు ఐరన్ లోడ్ తో వెళ్తున్న గూడ్స్ పెద్దపల్లి జిల్లా రాఘవపూర్ - కన్నాల మధ్య పట్టాలు తప్పింది. 11 బోగీలు బోల్తా పడిపడంతో ట్రాక్ పూర్తిగా దెబ్బతింది. ఓవర్ లోడ్ తోనే గూడ్స్ రైలు బోల్తా పడినట్లు భావిస్తున్నారు. గూడ్స్ బోల్తా పడటంతో ఆ మార్గంలో నడిచే పలు రైలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.

పెద్దపల్లి రైల్వేస్టేషన్ లో సికింద్రాబాద్ నుండి బళ్లార్షా వైవు వెళ్లే భాగ్య నగర్ ఎక్సప్రెస్ రైలు, మధురై నుండి హాజ్రత్ నిజముద్దీన్ కు వెళ్లే సంపార్క్ క్రాంతి రైలు నిలిచిపోయాయి. కొత్తపల్లి రైల్వే స్టేషన్ లో చెన్నై నుండి ఢిల్లీ కి వెళ్లే లక్నో ఎక్సప్రెస్ రైల్ ను నిలిపివేశారు. గూడ్స్ రైలు బోల్తాతో రైల్వే అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. రైళ్ల రాకపోకలను పునరుద్ధరించే పనిలో నిమగ్నమయ్యారు. బుదవారం ఉదయం వరకు రైళ్ళు నడిచే అవకాశం ఉందని రైల్వే అధికారులు భావిస్తున్నారు.

ప్రమాదంపై ఆరా తీసిన కేంద్ర మంత్రి బండి సంజయ్

రాఘవాపూర్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పిన ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరా తీశారు. నాగ్ పూర్ ఎన్నికల ప్రచారంలో ఉన్న బండి సంజయ్..సమాచారం తెలిసిన వెంటనే దక్షిణ మధ్య రైల్వే అధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు. 11 బోగీలు, పట్టాలు మూడు రైల్వే ట్రాక్ లు దెబ్బతిన్నాయని రైల్వే అధికారులు కేంద్రమంత్రికి తెలిపారు.

పెద్దపల్లి..రామగుండం వైపు వెళ్లే రాకపోకలకు పూర్తిగా అంతరాయం ఏర్పడిందని అధికారులు వెల్లడించారు. తక్షణమే రైల్వే ట్రాక్ ను పునరుద్దరించాలని కేంద్ర మంత్రి కోరారు. పెద్దపల్లి రామగుండం మార్గంలోని ప్రయాణీకులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని బండి సంజయ్ ఆదేశించారు. బుధవారం ఉదయానికల్లా రైల్వే ట్రాక్ ను పునరుద్దరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

పునరుద్ధరణకు 24గంటలు పట్టే అవకాశం…

కన్నాల గేట్‌ వద్ద 11 వ్యాగన్లు పట్టాలపై పడిపోవడంతో కాజీపేట్‌-బల్లార్షా మధ్య ఉన్న మూడు రైల్వే లైన్స్‌ పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రమాద తీవ్రతకు పట్టాలు విరిగిపోయి చెల్లాచెదురయ్యాయి. విద్యుత్‌  పోల్స్‌ సైతం విరిగిపోయాయి. వ్యాగన్లు ఒక్కదానిపైకి ఒక్కటి ఎక్కడంతో ట్రాక్‌ పునరుద్ధరణ పనులు కష్టంగా మారాయి.

రైలు ఇంజిన్, గార్డ్‌ వ్యాగన్‌ పట్టాలు తప్పలేదు. మధ్యలో ఉన్న బోగీలుపడిపోయాయి. ట్రాక్‌ పునరుద్ధరణ పనులు రాత్రి 11 గంటల తరువాత మొదలయ్యాయి. రైలు ఇంజిన్‌వైపు ఉన్న 8 వ్యాగన్లతోసహా గూడ్స్‌ను రామగుండంకు తరలించారు. భాగ్యనగర్‌ రైలు రాఘవాపూర్‌కు చేరుకోగా, దానిని వెనుకకు మళ్లించి పెద్దపల్లి స్టేషన్‌ లో ప్రయాణికులను దింపివేశారు.

వరంగల్‌ వైపు వెళ్లే మరికొన్ని సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను రామగుండం, మంచిర్యాల రైల్వేస్టేషన్లలో నిలిపివేశారు.  రైళ్ల రాకపోకలను పునరుద్ధరించేందుకు కనీసం 24 గంటల సమయం పట్టవచ్చని చెప్పారు.

(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)