TG Ration Cards: తెలంగాణలో సర్కారు గుడ్ న్యూస్, కొత్త రేషన్ కార్డుల జారీకి రెడీ అవుతున్న ప్రభుత్వం
TG Ration Cards: తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. త్వరలో కొత్త రేషన్ కార్డుల జారీకి రెడీ అవుతోంది. ఇప్పటికే కొత్త కార్డుల జారీకి లక్షలాది మంది ప్రజలు ఎదురు చూస్తున్న నేపథ్యంలో మార్పులు, చేర్పులతో పాటు కొత్త కార్డుల జారీకి ప్రభుత్వం సిద్ధం అవుతోంది.
TG Ration Cards: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రభుత్వం అందించే అన్ని రకాల సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు ప్రాతిపదికగా ఉండటంతో కొత్త కార్డుల జారీ కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. రేషన్ కార్డుల జారీపై ఇప్పటికే పలుమార్లు ప్రకటనలు వెలువడినా ఆచరణలో మాత్రం సాకారం కాలేదు.
కుటుంబాల విభజన, కొత్త సభ్యుల చేరికతో పాటు కొత్త రేషన్ కార్డుల మంజూరు విషయంలో కూడా స్పష్టత లేకపోవడంతో సంక్షేమ పథకాలు అందడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. కొత్తగా పెళ్లైన వారికి మెట్టినింట్లో కార్డుల్లో చేర్చకపోవడం వంటి సమస్యలు కూడా ఉన్నాయి.
రేషన్ కార్డుల సమస్యపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రేషన్ కార్డుల్లో కొత్త కుటుంబ సభ్యుల పేర్లను చేర్చేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో ప్రస్తుతం ఫ్యామిలీ డిజిటల్ కార్డులను జారీ చేస్తున్నారు. ప్రతి కుటుంబాన్ని యూనిట్‌గా గుర్తించేందుకు, కుటుంబ యజమానిగా మహిళల్ని గుర్తించి కార్డులను జారీ చేయాలని నిర్ణయించారు.
రేషన్ కార్డుల్లో అర్హులైన కుటుంబ సభ్యుల పేర్లను చేర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్టు పౌరసరఫరాల శాఖ చెబుతోంది. ఉన్న కార్డుల్లో కొత్త సభ్యులను చేర్చి కార్డులన్నింటిని క్రమబద్దీకరించిన తర్వాత కొత్త రేషన్ కార్డులను జారీ చేసే యోచనలో ప్రభుత్వం ఉంది.
తెలంగాణలో రేషన్ కార్డులకు పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది. రేషన్ కార్డుల్లో పేర్లను చేర్చాలని కోరుతూ ఇప్పటికే లక్షలాది కుటుంబాలు మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకున్నాయి. రాష్ట్రంలో లక్షల కుటుంబాలు మీసేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకున్నాయి.వినియోగంలో ఉన్న రేషన్ కార్డుల్లో కొత్త సభ్యులను చేర్చడానికి ప్రభుత్వం అనుమతించకపోవడంతో అవన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయి.
తెలంగాణలో అన్ని జిల్లాల్లో కలిపి దాదాపు 11.08 లక్షల దరఖా స్తులు పెండింగ్‌లో ఉన్నాయని పౌరసరఫరాల శాఖ లెక్కలు చెబుతున్నాయి. పాత దరఖాస్తులను పరిష్కరిస్తే ప్రతి నెల దాదాపు 9,890 టన్నుల బియ్యం అదనంగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీనికోసం ప్రతి నెల రూ.37.40 కోట్ల భారం పడుతుంది. పత్రి ఇంటికి డిజిటల్ ఫ్యామిలీ కార్డులను జారీ చేసి రేషన్ కార్డుల్లో ఉన్న సమాచారాన్ని వాటితో అనుసంధానించాలని యోచిసక్తున్నారు. దీనికోసం పూర్తి స్థాయిలో సాఫ్ట్‌వేర్ సిద్దం చేస్తున్నారు.
డిజిటల్ కార్డు ద్వారా రేషన్ దుకాణాల్లో ప్రతి ఇంటికి ఎంత సరుకులకు అర్హత ఉందో తెలుసుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. కార్డులను క్రమబద్దీకరణ పూర్తైన తర్వాత కొత్త కార్డుల జారీ ప్రక్రియ చేపట్టనున్నారు.