Loan App Trap : ప్రాణం తీసిన లోన్ యాప్-గోదావరిఖనిలో యువకుడు ఆత్మహత్య
Loan App Trap : లోన్ యాప్ వలలో చిక్కుకుని మరో యువకుడు బలైయ్యాడు. లోన్ యాప్, స్థానికంగా అప్పు ఇచ్చిన వ్యక్తుల వేధింపులు తట్టుకోలేక గోదావరిఖనిలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
Loan App Trap : లోన్ యాప్ పెద్దపల్లి జిల్లాలో యువకుడి ప్రాణాలు తీసింది. తీసుకున్న అప్పు వేధింపులకు గురికావడంతో గోదావరిఖనిలోని విద్యానగర్ కు చెందిన గాలిపల్లి జయవర్థన్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుతో యువకుడు ప్రాణాలు కోల్పోవడంతో కన్నవారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు,
లోన్ యాప్(Loan Apps) తోపాటు ఇతరుల వద్ద అప్పులు తీసుకుని అధిక వడ్డీలకు(High Interest Rates) అప్పులు ఇచ్చే జయవర్ధన్ ఆత్మహత్యతో పారిశ్రామిక ప్రాంతంలో కలకలం సృష్టిస్తుంది. జయవర్ధన్ లోన్ యాప్ ద్వారా 20 వేల రూపాయలు, మరో లోన్ యాప్ ద్వారా 10 వేల రూపాయలు తీసుకున్నారు. వాటికి తోడు హనుమాన్ నగర్ కు మరో వ్యక్తి వద్ద లక్ష రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. వాటిని తనకు తెలిసిన వారికి అధిక వడ్డీకి అప్పులు ఇచ్చాడు. అందులో కొంత చెల్లించారు. మిగతా డబ్బుల కోసం అప్పు ఇచ్చిన వారు ప్రతిరోజు ఫోన్ లో వేధించడంతో(Loan App Threats) పాటు ఇంటికొచ్చి నిలదీయడంతో అవమానం భరించలేక ఇంట్లో ఎవరులేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని జయవర్ధన్ తండ్రి తిరుపతి తెలిపారు. లోన్ యాప్ అని పెట్టి అప్పులిచ్చి యువకుడి ప్రాణాలు తీశారని యువకుడి తండ్రి తిరుపతి ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అప్పు తెచ్చిన ముప్పు
లోన్ యాప్ (Loan App Deaths)అప్పులతో గోదావరిఖనిలో గత మూడేళ్లలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. లోన్ యాప్ ద్వారా అప్పులు తీసుకుని 2021లో ఆర్ఎఫ్సీఎల్ కాంట్రాక్ట్ వర్కర్ శ్రీకాంత్, 2022లో సింగరేణి ఎంప్లాయిస్ ప్రశాంత్ ఆత్మహత్య చేసుకున్నారు. అప్పులు ఇచ్చి యువకులు ప్రాణాలు తీస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లోన్ యాప్ లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. జయవర్ధన్ లోన్ యాప్ తోపాటు ప్రైవేట్ ఫైనాన్స్ లో అప్పులు తీసుకుని అధిక వడ్డీకి అప్పులు ఇస్తాడని స్థానికులు తెలిపారు. అధిక వడ్డీకి అప్పులు తీసుకున్నవారు సకాలంలో చెల్లించకపోవడంతో జయవర్ధన్ తెచ్చుకున్న అప్పుపెరిగి ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నట్లు బావిస్తున్నారు.
HT Correspondent K.V.REDDY, Karimnagar