Warangal Drugs: బాలికలకు డ్రగ్స్ అలవాటు చేస్తూ చీకటి దందా, వరంగల్ నగరంలో బయటపడిన కిలాడీ లేడీ భాగోతం
Warangal Drugs: స్కూల్ లో చదువుతున్న బాలికలను టార్గెట్ చేసి, గంజాయి, ఇతర డ్రగ్స్ కు అలవాటు చేస్తున్న ఓ కిలాడీ లేడీ బాగోతం బయటపడింది. వరంగల్ నగరంలోని స్కూల్ పిల్లలను దొంగచాటుగా తీసుకెళ్లడం, ఆ తరువాత మత్తుకు బానిసగా మారుస్తుండగా, ఓ బాలిక మిస్సింగ్ వ్యవహారంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

Warangal Drugs: పిల్లలను మత్తుకు బానిసగా మారుస్తున్న ఆ కిలాడీ లేడీ కొంతమందితో ముఠాగా ఏర్పడి ఈ బాగోతానికి పాల్పడుతుండగా వరంగల్ మిల్స్ కాలనీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
హనుమకొండ జిల్లా దామెర మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ మహిళ వరంగల్ మిల్స్ కాలనీ సమీపంలో ఉంటోంది. గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు బానిసైన ఆమె, తనతోపాటు డ్రగ్స్ కు అలవాటు పడిన మరో అమ్మాయి, నలుగురు యువకులతో కలిసి ఓ ముఠాగా ఏర్పడింది. దీంతో వారంతా గంజాయి, ఇతర మత్తు పదార్థాలు తీసుకోవడంతో పాటు మరికొందరినీ వాటికి అలవాటు చేయడం మొదలుపెట్టారు.
స్కూల్ పిల్లలే టార్గెట్
వరంగల్‌కు చెందిన వీరంతా ఒక ముఠాగా ఏర్పడిన వాళ్లంతా పాఠశాల బాలికలను లక్ష్యంగా చేసుకున్నారు. అనంతరం గంజాయి చాక్లెట్లు తీసుకొచ్చి మెల్లిగా పాఠశాల బాలికలకు అలవాటు చేయడం మొదలు పెట్టారు. తమ ప్లాన్ లో భాగంగా ఆ కిలాడీ లేడీ వరంగల్ నగరంలోని సంపన్నుల కాలనీలు, కార్పొరేట్ పాఠశాలల వద్ద రెక్కీ నిర్వహించేది.
పాఠశాలకు వెళ్లి వచ్చే సమయంలో ముందుగా తాము ఎంపిక చేసుకున్న బాలికలతో మాటలు కలిపి, వారికి దగ్గరయ్యేది. ఆ తరువాత బాలికలను మెల్లిగా గంజాయి చాక్లెట్లు, ఇతర మత్తు పదార్థాలకు అలవాటు చేసేది. ఆ తరువాత వారిని కిడ్నాప్ చేసి, బాలికలకు మత్తు పదార్థాలు ఇచ్చి, అప్పటికే తన గ్యాంగ్ కు టచ్ లో ఉన్న కస్టమర్లకు అప్పగించడం చేస్తోంది.
ఆ తరువాత బాలికలు స్పృహలోకి రాగానే వారిని ఎక్కడి నుంచి తీసుకెళ్లారో.. తిరిగి అక్కడే వదిలేసేది. ఇలా ఆ కిలాడీ లేడీ తన గ్యాంగ్ తో కలిసి ఏడాదిన్నరగా బాలికలను ట్రాప్ చేసి, చీకటి దందా చేస్తున్నట్టు తెలిసింది.
బాలిక మిస్సింగ్ తో వెలుగులోకి..
ఏడాదిన్నర కాలంగా సదరు మహిళ బాలికలను ట్రాప్ చేసి, డ్రగ్స్ కు బానిసలుగా మారుస్తుండగా.. అనూహ్యంగా ఓ బాలిక కిడ్నాప్ కావడం, తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో అసలు గుట్టు బయట పడింది. వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బాలిక రెండు రోజుల కిందట కనిపించ కుండా పోయింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికి చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆ తరువాత బాలిక మగతగా ఇంటికి చేరగా.. తల్లిదండ్రులు బాలికను విచారించారు. దీంతో తనను ఓ మహిళ కిడ్నాప్ చేసి తీసుకెళ్లిందని, ఆ తరువాత తనకేం జరిగిందో తెలియదని చెప్పింది. తాను స్పృహలోకి వచ్చాక వదిలేసి వెళ్లారని ఏడ్చుకుంటూ వివరించింది. దీంతో విషయాన్ని తల్లిదండ్రులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.
బాలిక బాలిక చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. అసలు తతంగం బయటపడింది. దీంతో మిల్స్ కాలనీ పోలీసులు సదరు కిలాడీ లేడీని గురువారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఆమె చెప్పిన వివరాల ప్రకారం మరో ఇద్దరిని కూడా విచారణ జరుపుతున్నట్టు సమాచారం. కాగా దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)
సంబంధిత కథనం