హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. గచ్చిబౌలి, నానక్‌రాంగూడ, మణికొండ, నార్సింగి ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. టోలిచౌకి, రాజేంద్రనగర్, షేక్‌పేట్, శంషాబాద్ ఏరియాల్లోనూ ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో.. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ స్పష్టం చేసింది. భారీ వర్షం కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోయింది. దీని వల్ల వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రానున్న కొన్ని గంటల్లోనూ వర్షం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోనూ వాన పడింది. వికారాబాద్, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, మెదక్, రంగారెడ్డి, యాదాద్రిలలో వర్షాలు కురిశాయి.
ఏప్రిల్ 16 నుండి ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏప్రిల్ 17 నుండి 20 వరకు హైదరాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల నుండి 40 డిగ్రీల వరకు ఉండే అవకాశం ఉంది. రాబోయే వారం రోజుల్లో రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌ను కూడా దాటే అవకాశం ఉంది.
ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే సమయంలో బయటకు వెళ్లకపోవడం మంచిది. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఇంట్లో ఉంటేనే మేలు. తగినంత నీరు తాగాలి. వదులుగా ఉండే, లేత రంగు దుస్తులు ధరించాలి. బయటకు వెళ్లాల్సి వస్తే తలకు టోపీ లేదా గొడుగును తీసుకెళ్లాలి. వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
తీవ్రమైన ఎండలు, వడగాలులు, వడదెబ్బ వంటి కారణాలతో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తుల కుటుంబాలకు ఆదుకోవడానికి.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రూ. 4 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించడానికి వీలుగా ఉత్తర్వులు జారీ చేసింది. వడదెబ్బ కారణంగా ఎవరైనా మరణిస్తే.. గతంలో రూ.50 వేలు సాయం చేసేవారు. ఆ ఎక్స్‌గ్రేషియాను రూ.50 వేల నుంచి రూ.4 లక్షలకు పెంచింది రేవంత్ సర్కార్.
సంబంధిత కథనం