GHMC : మీ కాలనీలో కుక్కల బెడద ఉందా..? ఈ టోల్ ఫ్రీ నంబర్లకు కాల్ చేసేయండి..!
Stray dog Menace in Hyderabad : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కుక్కల బెడద ఎక్కువైపోయింది. చిన్నా పెద్ద అని తేడా లేకుండా దాడి చేస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో కుక్కల బెడదను నియంత్రించేందుకు జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది.
Stray Dog Menace in Hyderabad : భాగ్యనగరంలో వీధి కుక్కల బెడద ఎక్కువైంది. గుంపులు, గుంపులుగా స్వైరవిహారం చేస్తున్న కుక్కలు… చిన్నా పెద్ద అని తేడా లేకుండా దాడి చేస్తున్నాయి. ఈ ఘటనల్లో చిన్నారులు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు.
కుక్కల బెడదను నియంత్రించాలంటూ స్థానికంగా ఉండే ప్రజల నుంచి భారీగా ఫిర్యాదులు వస్తున్నాయి. తమ కాలనీలలో ఉన్న కుక్కలను నియంత్రించాలని…వాటిని సంరక్షణ కేంద్రాలకు తరలించాలంటూ విజ్ఞఫ్తులు చేస్తున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
కాలనీల్లో కుక్కల బెడద ఉంటే ఫిర్యాదు చేసేందుకు జీహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నంబర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒక్క కాల్ చేసి ఫిర్యాదు చేస్తే డాగ్ క్యాచింగ్ టీంలు అక్కడికి వస్తాయని తెలిపింది. వీధి శునకాలను పట్టుకొని సంరక్షణ కేంద్రాలకు తరలించి స్టెరిలైజేషన్ చేస్తామని తెలిపింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
కాలనీల్లో ఉండే ప్రజలు ఫిర్యాదు చేయాలనుకుంటే 040-21111111, 040-23225397 టోల్ ఫ్రీ నంబర్లకు కాల్ చేయాల్సి ఉంటుంది. అక్కడికి నేరుగా డాగ్ క్యాచింగ్ టీంలు చేరుకుంటాయి. వీధి కుక్కలను సంరక్షణ కేంద్రాలకు తరలిస్తాయి.
కుక్క కరిచిన వెంటనే ఏం చేయాలి?
కుక్క కరిచిన వెంటనే సబ్బుతో ఆ గాయాన్ని శుభ్రంగా కడగాలి. చాలామంది గాయాలకు పసుపు పెట్టి ఊరుకుంటారు. అక్కడ మురికి, బ్యాక్టీరియా చేరి సమస్య పెరిగిపోతుంది. కాబట్టి వెంటనే సబ్బుతో గాయాన్ని కడగాలి. ఆల్కహాల్ వంటివి పోసే వారి సంఖ్య ఎక్కువే. అలాంటి పనులు చేయకూడదు.
కుక్క కాటు వల్ల రక్తస్రావం అధికంగా ఉంటే శుభ్రమైన వస్త్రంతో కట్టుకట్టి రక్తం అధికంగా పోకుండా కాపాడుకోవాలి. వెంటనే వైద్యుల వద్దకు వెళ్లాలి. టెటానిస్ ఇంజక్షన్ తీసుకోవడం చాలా ముఖ్యం.
కుక్క కరిచిన తరువాత రాబిస్ వ్యాక్సిన్ ఐదుసార్లు తీసుకోవాల్సి ఉంటుంది. కుక్క కరిచిన మొదటి రోజు, మూడవ రోజు, ఏడవ రోజు, 14వ రోజు, 31వరోజు... ఈ రాబిస్ వ్యాక్సిన్ ను తీసుకోవాలి. అన్ని ప్రభుత్వ కేంద్రాలలో ఇవి అందుబాటులో ఉంటాయి.
కుక్కకాటును తేలికగా మాత్రం తీసుకోవద్దు. చిన్న పంటిగాటు పడినా కూడా తగిన చికిత్స తీసుకోవడం అవసరం. కుక్క కాటు కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. కాబట్టి కుక్కకాటుకు గురికాకుండా జాగ్రత్తగా ఉండండి.
ఎక్కడ చూసినా చెత్త కుప్పలే - కేటీఆర్
హైదరాబాద్ నగరంలో ఎక్కడా చూసినా చెత్త కుప్పలే దర్శనమిస్తున్నాయంట బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. సుమారు 1000 స్వచ్ఛ ఆటోలు పనిచేయడం లేదన్నారు. బస్తీలు, కాలనీల్లో వ్యర్థాలు పేరుకుపోవడంతో దోమలు విజృంభిస్తున్నాయని చెప్పారు. డెంగీ, మలేరియా, అతిసారం వంటి సీజనల్ వ్యాధులతో ప్రజలు అవస్థలుపడుతున్నారని పేర్కొన్నారు.
“చెత్త తరలింపు కేవలం కాగితాల్లో మాత్రమే కనిపిస్తున్నది. మేయర్, అధికారుల ఆకస్మిక పర్యటనలు లేకపోవడంతో పారిశుధ్య నిర్వహణ గాడితప్పుతున్నది. పర్యవేక్షించాల్సిన పార్ట్-టైం మున్సిపల్ మంత్రేమో ఎమ్మెల్యేల కొనుగోళ్లు, ఢిల్లీ చక్కర్లలో బిజీగా ఉన్నారు. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలి. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలి. పౌరుల ఆరోగ్యాలు కాపాడాలి” అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.