LB Nagar Tragedy : కూలీలను పొట్టనబెట్టుకున్న నిర్లక్ష్యం.. జీహెచ్ఎంసీ సీరియస్.. అనుమతులు రద్దు
LB Nagar Tragedy : ఎల్పీ నగర్‌లో తీవ్ర విషాదం జరిగింది. భవన నిర్మాణ సమయంలో ముగ్గురు కూలీలు మృతిచెందారు. ఈ ఘటనపై జీహెంచ్ఎంసీ సీరియస్ అయ్యింది. చర్యలకు దిగింది. భవనాన్ని నిర్మించేవారి నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని అధికారులు చెబుతున్నారు.
భవన నిర్మాణదారుల నిర్లక్ష్యం ముగ్గురు కూలీలను పొట్టనబెట్టుకుంది. మట్టి కూలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. హైదరాబాద్ ఎల్బీనగర్ కూడలి సమీపంలో జరిగిన విషాద ఘటనలో మరొకరు తీవ్రగాయలతో బటపడ్డారు. ఈ ఘటనపై జీహెచ్ఎంసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. భవన నిర్మాణ యజమానులకు నోటీసులు ఇచ్చింది. నిర్మాణ అనుమతులను రద్దు చేసింది.
ఏం జరిగింది..
ఎల్బీ నగర్ కూడలి సమీపంలో.. 1000 చదరపు గజాల స్థలంలో రమేష్, విజయ్ అనే ఇద్దరు వ్యక్తులు వాణిజ్య భవనాన్ని నిర్మిస్తున్నారు. సెల్లార్ల నిర్మాణం కోసం దాదాపు 25 అడుగుల మేర మట్టి తవ్వించారు. ఈ పనులను పర్యవేక్షిస్తున్న మేస్త్రీ బిక్షపతి.. పిల్లర్ల కోసం ఏర్పాటు చేసిన ఐరెన్ బెడ్‌లో కాంక్రీట్ పోసేందుకు కూలీల కోసం వెతికారు. ఇందుకోసం పెద్ద అంబర్‌పేట్‌లో నివాసం ఉంటున్న అలకుంట్ల వీరయ్యను సంప్రదించారు.
ముగ్గురు కలిసి..
వీరయ్య తన కుమారుడు రాము, అల్లుడు శ్రీనివాస్‌తో నిర్మాణం జరుగుతున్న ప్రదేశానికి వెళ్లారు. పని చేస్తుండగా.. కొద్దిగా మట్టి జారిపడింది. దీంతో ఇక్కడ పనిచేయడం ప్రమాదకరం అని నిర్వాహకులకు వీరయ్య చెప్పారు. అయినా నిర్వాహకులు వినలేదు. అలాగే పనులు చేయించారు. అదే సమయంలో ఒక్కసారిగా భారీగా మట్టికూలి పనులు చేస్తున్న వీరయ్య, రాము, శ్రీనివాస్‌పై పడింది. బిక్షపతి అనే వ్యక్తి వారికి కొద్ది దూరంలో ఉండటంతో.. ప్రమాదం నుంచి బయటపడ్డారు.
10 అడుగుల మేర..
ఈ ఘటన జరిగిన వెంటనే అక్కడున్న వారు డయల్ 100 కి ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. తొలుత బిక్షపతిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత దాదాపు 10 అడుగుల మేర ప్రొక్లెయిన్‌తో మట్టి తీశారు. అప్పుడు వీరయ్య, రాము మృతదేహాలు లభ్యమయ్యాయి. శ్రీనివాస్ డెడ్ బాడీ కనిపించలేదు. మళ్లీ మట్టి తీయగా.. లభ్యమైంది.
ఇటీవలే తల్లి.. ఇప్పుడు కుమారుడు..
ముగ్గురు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో మృతిచెందిన శ్రీనివాస్ తల్లి ఇటీవలే చనిపోయింది. దీంతో అతను మేనమామ వీరయ్య వద్ద ఉంటున్నాడు. అతను కూడా మృతిచెందడంతో.. బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అయితే.. ఈ నిర్మాణాన్ని చేపట్టిన వ్యక్తులు ఘటనా స్థలానికి రాలేదు. ముగ్గురు చనిపోయినా రాకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మృతిచెందిన వారి కుటుంబ సభ్యులను ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పరామర్శించారు. రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.