GHMC DumpingYard: అర్ధరాత్రి ప్యారానగర్ లో GHMC అధికారుల హైడ్రామా.. డంపింగ్ యార్డ్ నిర్మాణ పనులు ప్రారంభం
GHMC DumpingYard: సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలోని ప్యారా నగర్ లో అర్ధ రాత్రి హై డ్రామా చోటు చేసుకుంది. ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ డంప్ యార్డ్ పెట్టాలని గత కొంతకాలంగా ప్లాన్ చేయటంతో, దగ్గర్లో ఉన్న ప్యారా నగర్, నల్లవల్లి గ్రామస్తులు దీనికి అడ్డుకుంటూ వస్తున్నారు.

GHMC DumpingYard: సంగారెడ్డి జిల్లా నల్లవల్లి గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్యారానగర్‌లో డంపింగ్ యార్డ్ వలన తమ జీవితాలు అస్తవ్యస్థం అవుతాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేసారు. మంగళవారం అర్ధరాత్రి జిహెచ్‌ఎంసి అధికారులు పెద్ద ఎత్తున వాహనాలతో, చెత్త తీసుకొని వచ్చి అక్కడ డంపింగ్ యార్డ్ పనులు మొదలు పెట్టారు. విషయం తెలుసుకున్న, స్థానికంగా రెండు గ్రామాల నుండి పెద్ద ఎత్త్తున ప్రజలు అక్కడికి చేరుకొని వారి ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించారు.
45 మంది అరెస్ట్…
గ్రామస్తులు అడ్డుకోవడంతో అధికారులు పెద్ద ఎత్తున పోలీసులను మోహరించి, రెండు గ్రామాల నుండి JAC గా ఏర్పడింది 45 మంది నాయకులను అదుపులోకి తీసుకొని వేరు వేరు పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సంఘటన తో, గ్రామాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. ప్రజల ఎలాగైనా అధికారుల ప్రయత్నాన్ని అడ్డుకుంటామని ప్రకటించగా, అధికారులు ఎలాగైనా తాము డంప్ యార్డ్ నిర్మాణం మొదలు పెడతామని ప్రకటించడంతో తీవ్ర ఉద్రిక్థతలకు దారి తీసింది. భారీ ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి, GHMC అధికారులు తమ పనులు కొనసాగిస్తున్నారు.
తీవ్రంగా వ్యతిరేకిస్తున్న స్థానికులు…
ఈ రెండు గ్రామాల ప్రజలు డంపింగ్ యార్డ్ కి వ్యతిరేకంగా ధర్నాలు రాస్తారోకోలు నిర్వహించారు. అధికారులను, ప్రజాప్రతినిధులను కలిసి తమ గ్రామాల వద్ద ఎట్టి పరిస్థితుల్లోనూ డంపింగ్ యార్డ్ పెట్టవద్దని విజ్ఞప్తి చేశారు. తమ గ్రామాల దగ్గర డంప్ యార్డ్ పెడితే, తాము అక్కడ నివసించలేమని, తమ గ్రామాల్లో ఉన్న భూముల రేట్లు పడిపోతాయని వారు ఆవేదన వ్యక్తం చేసారు.
గుమ్మడిదల చుట్టుపక్కల, మంచి మంటలు పండే భూములు ఉన్నాయని, ఆ భూమలన్నీ కూడా పొగ దుమ్ము పట్టిపోతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అదే విధంగా, గ్రామాలకు GHMC కి చెందిన భారీ వాహనాలు తరచుగా రావటం వలన ప్రమాదాలు జరిగి, వారి ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని అధికారులకు పలుమార్లు గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.
GHMC అధికారులు మాత్రమే ఎలాగైనా ఇక్కడే డంప్ యార్డ్ పెట్టాలనే, మొండి పట్టుదలతో ఉండటంతో గ్రామస్తులు ధర్నాలకు రాస్తారోకోలకు దిగుతున్నారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. గతంలో నల్లవల్లిలో డంప్‌యార్డ్‌ను వ్యతిరేకిస్తూ పోరాటం చేసిన ముఖ్య నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. వీరిని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. అరెస్టు అయిన వారిలో అఖిలపక్ష నాయకులు కూడా ఉన్నారు.
రాత్రికి రాత్రే భాగ్యనగరం నుండి వందల సంఖ్యలో చెత్తతో నిండిన జిహెచ్ఎంసీ వాహనాలు నల్లవల్లిలోని డంప్‌యార్డ్‌కు చేరుకున్నాయి. అక్కడ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డంప్‌యార్డ్ వద్ద చెత్తను అన్‌లోడ్ చేస్తున్నారు. మండలంలోని పలు గ్రామాల కూడళ్ల వద్ద కూడా పోలీసులు భారీగా మోహరించారు. డంప్‌యార్డ్ వద్దకు ప్రజలు చేరుకోకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.
గతంలో డంపింగ్ యార్డ్ వద్దని పోరాడిన మండల ప్రజలు, నేడు అరెస్టుల నేపథ్యంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో గుమ్మడిదల మండలంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇటీవలే గుమ్మడిదల మండలాన్ని మున్సిపాలిటీగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో చెత్త డంపింగ్ సమస్య తీవ్రతరం కావడం గమనార్హం.