CM Power Sector Review: సిఎం సమీక్షకు జెన్‌కో, ట్రాన్స్‌కో సిఎండి గైర్హాజరు..
CM Power Sector Review: తెలంగాణలో విద్యుత్ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షిస్తున్నారు. సమీక్షకు హాజరు కావాలని సిఎండిని ఆదేశించినా సమావేశానికి గైర్హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది.
CM Power Sector Review: తెలంగాణలో విద్యుత్ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్న సమీక్షకు జెన్‌కో, ట్రాన్స్‌కో సిఎండి ప్రభాకర్ రావు గైర్హాజరయ్యారు. తెలంగాణలో విద్యుత్ శాఖకు రూ.85వేల కోట్ల రుపాయల అప్పులు ఉన్నట్లు గురువారం జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి దృష్టికి అధికారులు తీసుకువెళ్లారు. దీంతో విద్యుత్ శాఖకు సంబంధించిన పూర్తి వివరాలతో శుక్రవారం సమావేశానికి రావాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు.
శుక్రవారం సమావేశానికి సిఎండి ప్రభాకర్ రావు గైర్హాజరయ్యారు.తాను సమవేశానికి రావడం లేదని అధికారులకు సమాచారం అందించారు. రెండు రోజుల క్రితమే తెలంగాణ జెన్ కో, ట్రాన్స్ కో సీఎండీ పదవులకు ప్రభాకర్ రావు రాజీనామా చేశారు. గురువారం టీఎస్ ఎన్పీడీసీఎల్ సీఎండీ అన్నమనేని గోపాలరావు కూడా తన పదవికి రాజీనామా చేశారు. ఇంధనశాఖపై ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న సమీక్షకు కీలకమైన అధికారులు డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది.
ఇప్పటికే రాష్ట్రంలో కరెంట్ విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య యుద్ధం నడుస్తోంది. సిఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన తొలి కేబినెట్ మీటింగ్ లో కరెంట్ పై తీవ్ర చర్చ జరగింది. విద్యుత్ కొనుగోళ్లలో భారీగా అక్రమాలు జరిగాయిన అనుమానిస్తున్నారు. శుక్రవారం కీలక అధికారులతో రివ్యూ జరగాల్సి ఉండగా ఈ భేటీకి ప్రభాకర్ రావు డుమ్మా కొట్టారు.
తెలంగాణలో 24 గంటల కరెంట్ విషయంలో ఎన్నికల ముందు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మాటల యుద్ధం జరుగుతోంది. కాంగ్రెస్ వస్తే చీకటి రాజ్యమే వస్తుందని, ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన క్షణం నుంచే కరెంట్ కోతలు ఉంటాయంటూ బీఆర్ఎస్ ప్రచారం చేయగా.. అలాంటిదేమీ ఉండదంటూ కాంగ్రెస్ కూడా ధీటుగా సమాధానం చెబుతూ వచ్చింది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో విద్యుత్తు సంక్షోభం తెచ్చేలా కుట్ర జరిగిందని సీఎం అభిప్రాయపడ్డారు. విద్యుత్తు శాఖలో ఇప్పటివరకు 85 వేల కోట్ల అప్పులు ఉన్నట్లు అధికారులు సీఎంకు వివరించగా.. దీనిపై పూర్తిస్థాయి వివరణ కోసం 2014 నుంచి ఇప్పటివరకు శాఖకు సంబంధించిన పూర్తి వివరాలతో హాజరు కావాల్సిందిగా ఆదేశించారు.సిఎం సమీక్షకు హాజరు కాకపోవడంతో ఎలా వ్యవహరిస్తారనేది ఆసక్తికరంగా మారింది.