Ganja Chocolates: న్యూఇయర్‌ ఈవెంట్స్‌.. ఒడిశా టూ హైదరాబాద్‌ గంజా స్మగ్లింగ్, ట్రావెల్స్‌ బస్సులో రవాణా-ganja smuggling racket exposed during new year crackdown ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ganja Chocolates: న్యూఇయర్‌ ఈవెంట్స్‌.. ఒడిశా టూ హైదరాబాద్‌ గంజా స్మగ్లింగ్, ట్రావెల్స్‌ బస్సులో రవాణా

Ganja Chocolates: న్యూఇయర్‌ ఈవెంట్స్‌.. ఒడిశా టూ హైదరాబాద్‌ గంజా స్మగ్లింగ్, ట్రావెల్స్‌ బస్సులో రవాణా

Bolleddu Sarath Chandra HT Telugu
Dec 30, 2024 07:41 PM IST

Ganja Chocolates: న్యూ ఇయర్‌ వేడుకల నేపథ్యంలో ఒరిస్సా నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్న గంజాయి చాక్లెట్లను, గోవా నుంచి తరలిస్తున్న మద్యాన్ని తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిస్సా నుంచి ట్రావెల్స్‌ బస్సుల్లో గంజాయి చాక్లెట్లు, గోవా రైల్లో డ్యూటీ చెల్లించని మద్యాన్ని గుర్తించారు.

ఒడిశా నుంచి గంజాయి చాక్లెట్లు, గోవా నుంచి మద్యం రవాణా అడ్డుకున్న తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు
ఒడిశా నుంచి గంజాయి చాక్లెట్లు, గోవా నుంచి మద్యం రవాణా అడ్డుకున్న తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు

Ganja Chocolates: ఒరిస్సా నుంచి హైదరాబాద్‌ వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సులో వెయ్యి గంజాయి చాక్లెట్లను హైదరాబాద్ ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనిల్ కుమార్ అనే అనుమానితుడు తరలిస్తున్న చాక్లెట్లను కోదాడ రాంపూర్ ఎక్స్ రోడ్డు వద్ద పట్టుకున్నారు. దీనిపై సమాచారం అందుకున్న ఎక్సైజ్‌ పోలీసులు కావేరి ట్రావెల్ బస్సును కోదాడ వద్ద అడ్డుకునేందుకు వెళ్లారని ఎక్సైజ్ సీఐ శంకర్ తెలిపారు.

yearly horoscope entry point

తనిఖీల్లో భాగంగా అమ్మకానికి తరలిస్తున్న 1000 గంజాయి నింపిన చాక్లెట్లను అధికారులు గుర్తించారు. ఒరిస్సాకు చెందిన అనిల్ కుమార్ ను అక్కడికక్కడే అరెస్టు చేశారు. గంజాయి చాక్లెట్లను హైదరాబాద్ లోని కార్మికులకు రూ.30 చొప్పున విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అతనిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.ఓ ప్రైవేటు బస్సులో నిషేధిత గంజాయి చాక్లెట్లు లభ్యమైన ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలో ఆదివారం చోటుచేసుకుంది.

ఒడిశాలోని భువనేశ్వర్ నుంచి హైదరాబాద్‌ వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాకు చెందిన అనిల్ కుమార్, రజనిశ్రీ, బంకించంద్రశ్రీ, మమిత నాయక్, సంజీవని దేహురి, జాను నాయక్ అనే ఆరుగురు వెయ్యి గంజాయి సుమారు ఐదు కిలోలు బరువైన వాటిని నగరానికి తీసుకొస్తున్నారు. వీరిపై విశ్వసనీయ సమాచారం అందడంతో కోదాడలో ఎక్సైజ్ అధికారులు ఏపీ-తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన నల్లబండగూడెం వద్ద 50 మంది ప్రయాణికులతో ఉన్న బస్సును కోదాడ ఎక్సైజ్ కార్యాలయానికి తీసుకెళ్లి తనిఖీలు చేశారు.

ఆరుగురు ప్రయాణికులకు చెందిన లగేజీలో 1,000 గంజాయి చాక్లెట్లు దొరికాయి. నిందితులు బస్సు బయలుదేరిన తర్వాత దారిలో హైదరాబాద్‌ వెళుతున్న బస్సు బ్యాగులను లగేజీలో వేసినట్టు డ్రైవర్ వివరించాడు. ఏపీలోని పలాస వద్ద పోలీసులు తనిఖీ చేసినా గంజాయి చాక్లెట్లు దొరకలేదని బస్సులోని ప్రయాణికులు పోలీసులకు వివరించారు.

వాస్కోడగమా రైల్లో గోవా మద్యం…

గోవా నుంచి హైదరాబాద్ వస్తున్న వాస్కోడగమా రైల్లో రూ.2 లక్షల విలువైన 43 మద్యం బాటిళ్లను ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం అక్రమ రవాణా లక్ష్యంగా రెండు వేర్వేరు కేసుల్లో రూ.3 లక్షల విలువైన మద్యాన్ని హైదరాబాద్ ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్‌ ఎయిర్‌ పోర్ట‌, సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్లలో వేర్వేరుగా ఈ ఆపరేషన్లు చేపట్టారు.

శనివారం గోవా నుంచి సికింద్రాబాద్ వెళుతున్న వాస్కోడగామా రైలులో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రూ.2 లక్షల విలువైన 82.38 లీటర్ల 95 మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గోవా నుంచి హైదరాబాద్ కు మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు.

మరో ఘటనలో షేక్ పేటలోని ఫైజల్ ఆదిల్ అనే వ్యక్తి నుంచి ఎక్సైజ్ పోలీసులు 18 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నూతన సంవత్సర వేడుకల కోసం చెన్నైకి చెందిన మద్యాన్ని పంపిణీ చేసేందుకు ఆదిల్ ప్రయత్నించడాన్ని గుర్తించిన పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. రూ.లక్ష విలువైన మద్యాన్ని చెన్నైలోని సతీష్ అనే సప్లయర్ నుంచి ఆన్లైన్ ఆర్డర్ ద్వారా కొనుగోలు చేశారు. ఈ కేసులో నిందితుడిపై కేసు నమోదు చేశారు.

Whats_app_banner