Karimnagar Crime: ఆలయాల్లో అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్, బంగారు వెండి ఆభరణాలు స్వాధీనం
Karimnagar Crime: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలు ఆలయాల్లో చోరీలకు పాల్పడుతూ పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ముఠా పట్టుబడింది. అంతర్ జిల్లా దొంగల ముఠాకు చెందిన ఇద్దరిని సిరిసిల్ల పోలీసులు అరెస్టు చేశారు.
Karimnagar Crime: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలు ఆలయాల్లో చోరీలకు పాల్పడుతూ పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ముఠా పట్టుబడింది. అంతర్ జిల్లా దొంగల ముఠాకు చెందిన ఇద్దరిని సిరిసిల్ల పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి ఎనిమిది తులాల బంగారం రెండు తులాల వెండితో పాటు ఒక ద్విచక్ర వాహనం, ఇనుప రాడ్, రెండు మొబైల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సమక్షంలో సిరిసిల్లలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అరెస్టు అయిన దొంగలను చూపించి, స్వాధీనం చేసుకున్న సొత్తును ప్రదర్శించారు.
వేములవాడ మండలం అగ్రహారం కు చెందిన అల్లెపు పరుశురాం, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం అంకుషాపూర్ కు చెందిన శివరాత్రి సంపత్ ప్రస్తుతం ఫాజుల్ నగర్ లో ఉంటూ వ్యవసాయ బావుల్లో పూడిక తీసే పని చేసుకుని జీవించేవారు.
సంపత్ పరుశురాం కలిసి ఎలాగైనా దొంగతనాలు చేసి డబ్బు సంపాదించుకోవాలని నిర్ణయించుకుని గత మే నెలలో ముస్తాబద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో గల పెద్దమ్మ గుడి తలుపులు పగలగొట్టి అమ్మవారి బంగారు పుస్తెలు, వెండి మట్టెలు దొంగలించారు. మరుసటి రోజు ఇల్లంతకుంట మండలంలోని పెద్ద లింగాపూర్ గ్రామ శివారులో గల గొర్ల షెడ్డు నుండి రెండు గొర్లను దొంగిలించారు.
చందుర్తి డ్యామ్ వద్ద గల దుర్గమ్మ ఆలయం, హుస్నాబాద్ మండలం మాలపల్లి గ్రామంలో బైక్, కొడిమ్యాల మండలం తిప్పయ్యపల్లి గ్రామంలో పెద్దమ్మ ఆలయం, బోయిన్పల్లి మండలం జగ్గారావుపల్లిలో గల పెద్దమ్మ ఆలయం, వేములవాడ రూరల్ మండలం వట్టెంలా గ్రామంలోని పెద్దమ్మ ఆలయం, టెక్స్టైల్ పార్కులోని పెద్దమ్మ ఆలయం,ఇల్లంతకుంట వంతడుపుల గ్రామంలోని ఎల్లమ్మ ఆలయం, బోయిన్పల్లి మండలం మల్లాపూర్ వద్ద సీతారామ ఆంజనేయ స్వామి ఆలయం, వేములవాడ చెక్కపల్లిలోని పెద్దమ్మ ఆలయం, కరీంనగర్ రోడ్ లో గల ఓద్యారం గుట్టపై గల రామాలయం, అల్గునూర్ లోని ఎల్లమ్మ ఆలయం, వట్టెంలా గ్రామంలో గల ఎల్లమ్మ ఆలయం, నల్లగొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడ్డారు. సిరిసిల్ల డీఎస్పీ ఆధ్వర్యంలో రూరల్ సి.ఐ మోగిలి, ఎస్.ఐ శ్రీకాంత్ స్పెషల్ టీమ్ ఏర్పటు చేసి దర్యాప్తు చేపట్టగా పొత్తూరు బ్రిడ్జి వద్ద ఇద్దరు పట్టుబడ్డారని ఎస్పీ తెలిపారు.
నాలుగు జిల్లాల్లో 17 కేసులు..
ఇద్దరు దొంగలు కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, సిద్దిపేట జిల్లాల్లో 17 చోరీలకు పాల్పడగా 17 కేసులు నమోదు అయినట్లు ఎస్పీ తెలిపారు. నిందుతులపై రాజన్న సిరిసిల్ల జిల్లాలో 12 కేసులు, జగిత్యాల జిల్లాలో 2 కేసులు, కరీంనగర్ లో 2 కేసులు, సిద్దిపేట జిల్లాలో ఒక కేసులు ఉన్నాయని ప్రకటించారు. ఇనుప రాడ్ తో తాళాలు పగుల గొట్టి చోరీలకు పాల్పడ్డారని చెప్పారు.
వరుసగా ఆలయాల్లో చోరీలకు పాల్పడే అంతర్ రాష్ట్ర దొంగలను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన రూరల్ సి.ఐ మోగిలి, ఎస్.ఐ శ్రీకాంత్, హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ, కానిస్టేబుల్స్ మధు ,చంద్రశేఖర్ లను ఎస్పీ అభినందించారు.
(రిపోర్టింగ్:కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)