Gachibowli Gun Fire : గచ్చిబౌలి ప్రిజం పబ్ కాల్పుల కేసు-బత్తుల ప్రభాకర్ గదిలో మూడో గన్, 460 బుల్లెట్లు
Gachibowli Gun Fire : గచ్చిబౌలి ప్రిజం పబ్ కాల్పుల కేసు విచారణలో కీలక విషయాలు వెలుగుచూశాయి. నిందితుడు బత్తుల ప్రభాకర్ గదిలో మూడో గన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతడి వద్ద 460 బుల్లెట్లు గుర్తించారు.
Gachibowli Gun Fire : గచ్చిబౌలి ప్రిజం పబ్ కాల్పుల కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు బత్తుల ప్రభాకర్ అలియాస్ రాహుల్ రెడ్డిని పోలీసులు విచారిస్తున్నారు. అతడి వసతి గృహం నుంచి పోలీసులు మూడో దేశీయ తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. గచ్చిబౌలి పబ్ వద్ద హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామి రెడ్డిపై కాల్పులు జరిపిన ప్రభాకర్, ఓ మల్టీనేషనల్ సంస్థలో పనిచేస్తున్న స్నేహితుడితో కలిసి ఉంటున్నాడు.
అరెస్టు సమయంలో నిందితుడు ప్రభాకర్ నుంచి అధికారులు ఇప్పటికే రెండు తుపాకీలను స్వాధీనం చేసుకున్నారు. బీహార్ నుంచి వచ్చిన వ్యక్తి వద్ద ప్రభాకర్ ఈ ఆయుధాలు కొనుగోలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అతడి గదిలో 460 బుల్లెట్లు లభించాయి. వైజాగ్ సెంట్రల్ జైలుకు చెందిన ఓ ఖైదీపై ప్రతీకారం తీర్చుకోవడమే తన ఉద్దేశం అని దర్యాప్తులో ప్రభాకర్ చెప్పినట్లు తెలుస్తోంది.
దీంతో పాటు విచారణలో ప్రభాకర్ ఇద్దరు మహిళల పేర్లతో ఉన్న మొబైల్ ఫోన్లను ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. ఇంజినీరింగ్ కాలేజీలే లక్ష్యంగా ప్రభాకర్ దొంగతనాలకు పాల్పడుతున్నాడు. మొయినాబాద్‌లోని సంస్థలలో జరిగిన దొంగతనాలపై దర్యాప్తుతో ప్రభాకర్ చోరీలు పోలీసుల దృష్టికి వచ్చాయి.
అసలేం జరిగింది?
చిత్తూరు జిల్లాకు చెందిన బత్తుల ప్రభాకర్ అలియాస్ రాహుల్ రెడ్డిని 2020లో విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. 2022 మార్చిలో విచారణ నిమిత్తం ఏపీలోని అనకాపల్లి కోర్టుకు తీసుకెళ్లిన సమయంలో పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. అప్పటి నుంచి పరారీలో ఉన్న ప్రభాకర్.. ఇటీవల మొయినాబాద్, నార్సింగి పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీలకు పాల్పడ్డాడు. ఇంజినీరింగ్ కాలేజీల్లో చోరీలు చేసేవాడు.
ఇటీవల నార్సింగి, మొయినాబాద్ చోరీల్లో ఫింగర్ ప్రింట్స్ విశ్లేషించగా అవి బత్తుల ప్రభాకర్ వేలిముద్రలతో సరిపోలాయి. దీంతో నిందితుడి కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు...నిందితుడు చోరీ సొత్తుతో జల్సాలు చేస్తున్నట్లు గుర్తించారు. వారాంతాల్లో పబ్‌కు వెళ్తున్నట్లు సీసీ ఫుటేజీల్లో గుర్తించారు. హైదరాబాద్ ఐటీ కారిడార్‌లోని పబ్‌ల సిబ్బంది, బౌన్సర్లకు నిందితుడి ఫొటోలు ఇచ్చి సమాచారం తెలిస్తే తెలపాలని సూచించారు.
ఈ క్రమంలో శనివారం సాయంత్రం ప్రభాకర్ గచ్చిబౌలి ప్రిజం పబ్ దగ్గర కనిపించాడు. నిందితుడిని గుర్తించిన బౌన్సర్లు పోలీసులకు సమాచారం అందించారు. సైబరాబాద్ సీసీఎస్ హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామిరెడ్డి, కానిస్టేబుళ్లు ప్రదీప్‌రెడ్డి, వీరస్వామి మఫ్టీలో ప్రిజం పబ్ కు వచ్చారు.
నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా... అతడు తన వద్ద తుపాకీతో రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఒక తూటా వెంకట్రామిరెడ్డి పాదం నుంచి దూసుకెళ్లింది. వెంటనే సహచర కానిస్టేబుళ్లు స్పందించి, బౌన్సర్ల సాయంతో నిందితుడిని అడ్డుకున్నారు. అతడిని అదుపులోకి తీసుకుని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తరలించి విచారణ చేపట్టారు.