karimnagar : తప్పుడు పత్రాలతో భూమిని కాజేసిన ఘనుడు - తీగ లాగితే డొంకంతా కదిలింది..!
తప్పుడు పత్రాలు సృష్టించి ఎకరం భూమిని కాజేసిన వారిపై కరీంనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. 8 మంది పేరిట రిజిస్ట్రేషన్ చేసిన ఘరానా మోసగాడిని అరెస్ట్… చేసి జైలుకు పంపించారు. మరో ముగ్గురి కోసం కొత్తపల్లి పోలీసులు గాలిస్తున్నారు.
భూ అక్రమ దందాలకు కరీంనగర్ అడ్డాగా మారింది. పట్టించుకునే వారు కానరాక అక్రమార్కులు కోట్లకు పడగలెత్తి ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. సీపీ అభిషేక్ మోహంతి ప్రత్యేక చొరవ చూపడంతో అక్రమార్కుల ఆటలుసాగక ఒక్కొక్కరుగా కటకటాల పాలవుతున్నారు. తాజాగా రేకుర్తిలో ఎకరం భూమిని కబ్జా చేసి తప్పుడు ధృవీకరణ పత్రాలు సృష్టించి 8 మంది పేరిట రిజిస్ట్రేషన్ చేసిన ఘరానా మోసగాడిని అరెస్టు చేసి జైల్ కు పంపించారు. నలుగురిలో ప్రధాన నిందితుడు అరెస్టు కాగా మిగతా ముగ్గురి కోసం కొత్తపల్లి పోలీసులు గాలిస్తున్నారు.
కొత్తపల్లి ఎస్ఐ సాంబమూర్తి తెలిపిన వివరాల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ సమీపంలోని రేకుర్తి లో సర్వే నెంబర్ 74 లో 1.01 ఎకరాల భూమి హైదరాబాద్ లోని నాంపల్లికి చెందిన షేక్ హసన్ 1992 లో కరీంనగర్ కు చెందిన అబ్దల్లా బిన్ ముసల్లం వారసుల వద్ద కొనుగోలు చేశాడు. ఆ భూమిని షేక్ హసన్ తన తల్లి షేక్ అలిమా పేరిట సెల్ డీడ్ నెం. 727/1992 ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు.
అప్పటి నుంచి భూమి వారి స్వాధీనంలో ఉంది. అందులో ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. ఇటీవల బాధితుడి తల్లి షేక్ అలీమా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సందర్భంగా భూమిని తన పేరిట మార్పిడి చేసుకుందామని ఆన్ లైన్ సెంటర్ కి వెళ్ళి ఈసీ తీయగా సర్వే నెం.74 లో కరీంనగర్ కమాన్ రోడ్ కి చెందిన షేక్ అబ్దుల్ అజిజ్ తన కుమారుడైన షేక్ అబ్దుల్లా రోషన్ పేరు పై ఎనిమిది డాక్యుమెంట్ల ద్వారా 2024 జనవరి 29న రిజిస్ట్రేషన్ అయినట్లు తేలింది.
తప్పుడు పత్రాలతో....
షేక్ అబ్దుల్ అజిజ్ 1.01ఎకరాల భూమిని తప్పుడు పత్రాలతో 8 విభాగాలుగా విభజించాడు. మున్సిపల్ కార్యాలయం నుండి సెల్ఫ్ అస్సిస్మెంట్ లో ఎనిమిది దొంగ ఇంటి నెంబర్లు తీసుకొని, సదరు ఇంటి నెంటర్లకు పన్ను చెల్లించి అట్టి రసీదు ఆధారంతో మొఖా పై ఎలాంటి కట్టడాలు లేకున్నా, ఒక్కొక్క డాక్యుమెంట్ లో 100 గజాల స్థలంలో రేకుల షెడ్లు ఉన్నట్లు తప్పుడు ఫోటోలు చూయించి భూమిని కాజేశాడు. అందుకు రాంరెడ్డి, గణపతి సాక్షులుగా పెట్టి షేక్ అబ్దుల్ అజిజ్ తన కొడుకు పేరిట ఏడు గిఫ్ట్ డీడ్, ఒకటి సేల్ డీడ్ దస్తావేజులు చేయించాడు. బాధితుడు కొత్తపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టడంతో తీగ లాగితే డొంకంతా కదిలినట్లు అక్రమ దందా వెలుగులోకి వచ్చిందని ఎస్ఐ తెలిపారు.
నలుగురిపై కేసు నమోదు ఒకరు అరెస్ట్...
తప్పుడు ధ్రువపత్రాలతో భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న ఘటనలో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. షేక్ అబ్దుల్ అజిజ్ ఆయన కుమారుడు షేక్ అబ్దుల్లా రోషన్, సాక్షులుగా సంతకాలు చేసిన రాంరెడ్డి, గణపతి లపై 467, 468, 471, 420, 120-b R/W 34 ఐపీసీ సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసినట్లు ప్రకటించారు.
ఇందులో ప్రధాన నిందితుడైన కరీంనగర్ కమాన్ రోడ్ కి చెందిన షేక్ అబ్దుల్ అజిజ్(69) ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చారు. మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించగా కరీంనగర్ జైలుకు తరలించారు. మిగతా వారిని త్వరలోనే పట్టుకుంటామని ఎస్ఐ సాంబమూర్తి తెలిపారు.
సీపీ అభిషేక్ మోహంతి గత ఏడాది కాలంగా భూ అక్రమ దందాలపై ప్రత్యేక దృష్టి సారించడంతో ఇప్పటికే కరీంనగర్ లో 50 కి పైగా కేసులు నమోదు అయ్యాయి. వంద మందికి పైగా పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టై జైల్ కు వెళ్ళిన వారిలో తహసిల్దార్ తో పాటు పలువురు కార్పొరేటర్లు, రాజకీయ నాయకులు ఉన్నారు.
రిపోర్టింగ్: కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం
టాపిక్