Cheating Teacher: చిట్టీల పేరుతో ప్రభుత్వ ఉద్యోగి ఘరానా మోసం, బాధితుల ఫిర్యాదుతో కటకటాల వెనక్కి..
Cheating Teacher: పిల్లలకు పాఠాలు బోధించి, విద్యార్థులను భావిభారత పౌరులుగా సన్మార్గంలో నడిపించాల్సిన ఓ ప్రభుత్వ టీచర్ జనాలను చీటింగ్ చేయడం మొదలు పెట్టింది.
Cheating Teacher: ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా చిట్టీల వ్యాపారం నడిపించడమే కాకుండా, జనాలను ఇబ్బందులకు గురి చేస్తూ ఆర్థికంగా మోసం చేస్తున్న టీచర్ చివరకు జైలు పాలైంది. ఆమె తీరుపై విసిగిపోయిన బాధితులు చివరకు పోలీసులను ఆశ్రయించడంతో ఆమె బండారం బయటపడింది.
బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. అక్రమ చిట్టీల వ్యాపారంతో మోసాలకు పాల్పడుతున్న టీచర్, ఆమె అసిస్టెంట్‌ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. హనుమకొండ జిల్లా హసన్ పర్తి సీఐ జవ్వాజీ సురేష్ తెలిపిన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
వరంగల్ నగరంలోని రాంనగర్ ప్రాంతానికి చెందిన కామ మాధవి ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా ప్రస్తుతం హనుమకొండ జిల్లా దామెర స్కూల్ లో పని చేస్తోంది. ఆమె తన విధి నిర్వహణలో భాగంగా 2011 నుంచి 2021 వరకు హసన్ పర్తి మండలం మడిపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పని చేసింది.
ఆమె పని చేస్తున్న కాలంలోనే ఇదే పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న దుగ్గొండి మండలం తొగర్రాయి గ్రామానికి చెందిన అమ్మ కృష్ణతో లక్ష్మీ సాయి చిట్స్ అనే తన సంస్థలో చిట్టీ వేయించింది. అంతే కాకుండా ఆమె వద్ద చిట్టీ వేస్తే ఒక నెల (చివరి నెల) డబ్బులు కట్టనవసరం లేదని, మంచి లాభంతో చిట్టి డబ్బులు ఇస్తానని నమ్మ బలికింది.
దీంతో కృష్ణ ప్రతి నెల రూ.12,500 చొప్పున మొత్తం 22 నెలల పాటు రూ.2.75 లక్షలు ఆన్ లైన్ పేమెంట్ ద్వారా మాధవి, ఆమె అసిస్టెంట్ వెంకట్ కు చెల్లించాడు. చిట్టీ కమిట్ మెంట్ ప్రకారం జూన్ 2023 నాటికి రూ.3.95 లక్షలు తిరిగి ఇవ్వాల్సి ఉంది. కానీ కృష్ణకు ఇవ్వాల్సిన డబ్బులు ఇంతవరకు తిరిగి చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేసింది.
దీంతో తాను మోసపోయినట్లు తెలుసుకున్న కృష్ణ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు మాధవితో పాటు ఆమె అసిస్టెంట్ వెంకట్ ను పలుమార్లు నిలదీశాడు. అయినా వారి నుంచి సరైన సమాధానం లేకపోవడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో బాధితుడు కృష్ణ చివరకు పోలీసులు ఆశ్రయించాడు. తనను మోసం చేసిన మాధవితో పాటు అసిస్టెంట్ వెంకట్ పై చట్ట పరమైన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని హసన్ పర్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు చిట్టీ పేరుతో మోసానికి పాల్పడిన కామ మాధవి, ఆమె అసిస్టెంట్ వెంకట్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు హసన్ పర్తి సీఐ జవ్వాజి సురేష్ వివరించారు. కాగా అక్రమంగా చిట్టీ వ్యాపారం నిర్వహించడం నేరమని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఐ సురేష్ అన్నారు. అక్రమంగా చిట్టీలు, వడ్డీ వ్యాపారం పేరున మోసాలకు పాల్పడిన ఘటనలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకు రావాలని ఆయన సూచించారు.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)
సంబంధిత కథనం