TG Prisons Department : పూలతో సువాసన గల అగరుబత్తులు - శ్రీకారం చుట్టిన జైళ్ల శాఖ-fragrant incense with flowers is being made by the prisons department from karimnagar ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Prisons Department : పూలతో సువాసన గల అగరుబత్తులు - శ్రీకారం చుట్టిన జైళ్ల శాఖ

TG Prisons Department : పూలతో సువాసన గల అగరుబత్తులు - శ్రీకారం చుట్టిన జైళ్ల శాఖ

HT Telugu Desk HT Telugu
Jan 29, 2025 11:46 AM IST

కరీంనగర్ జైలులో వాడిన పూలతో అగరు బత్తులు తయారీ చేస్తున్నారు. రసాయనాలు వాడకుండా సహజసిద్ధంగా తయారు చేస్తుండడంతో చాలా మంది విక్రయిస్తున్నారు. దీంతో పని చేస్తున్న ఖైదీలకు ఉపాధి ఉండటంతో పాటు జైలుకు ఆదాయం కూడా సమకూరుతోంది.

పూలతో సువాసన గల అగరుబత్తులు - .ఖైదీలతో తయారు చేయిస్తున్న జైళ్ళ శాఖ
పూలతో సువాసన గల అగరుబత్తులు - .ఖైదీలతో తయారు చేయిస్తున్న జైళ్ళ శాఖ

పూజలకు ఉపయోగించి పూలు, వాడిపోయి పనికిరాని పూలు సువాసనలు వెదజల్లే అగరుబత్తులుగా మారుతున్నాయి. పుష్పాలతో అగరుబత్తీలు తయారు చేసే సరికొత్త ఒరవడికి జైళ్ల శాఖ శ్రీకారం చుట్టింది. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో వాడిన పూలతో అగరబత్తులు తయారు చేయాలని జైళ్ల శాఖ సంకల్పించి ప్రయోగాత్మకంగా కరీంనగర్ జిల్లా జైలులో ప్రారంభించారు.

yearly horoscope entry point

ఏం వాడుతున్నారంటే..?

జైలులో తయారు చేస్తున్న అగరు బత్తుల తయారీకి వాడిన పూలు, ఇతర పదార్థాలు వాడుతున్నారు. అత్తుక్కోవడానికి యారయార పౌడర్, మండడానికి రాళం పొడి (కర్పూరం పొడి), చెక్కపొడి, పూలను ఎండబెటి పౌడర్ కలుపుతున్నారు. ఖైదీలతో మ్యానువల్ మిషన్ ద్వారా రోజుకు 2500 నుంచి 3000 వరకు అగరుబత్తులు తయారు చేయిస్తున్నారు. భవిష్యత్తులో ఆర్డర్లు పెరిగితే ఆటోమేషన్ మిషన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు చేయాలని జైళ్ల శాఖ భావిస్తుంది. జైలుతో తయారు చేసే ప్యాకెట్ లో 65 నుంచి 70 అగరుబత్తులు ఉంటుండగా, ప్యాకెట్ ధర రూ.50 ఉంటుంది.

రసాయనాలు లేకుండా....

జైళ్లశాఖ ఆధ్వర్యంలో ఉత్పత్తి అవుతున్న వస్తువులలో రసాయనాలు వాడకుండా సహజసిద్ధంగా తయారు చేస్తుండడంతో చాలా మంది వాడుతున్నారు. అగరుబత్తులు కూడా రసాయనాలు, ఇతరత్రా ఏమీ కలపకుండా ఆలయాల్లో పూజకు వినియోగించిన పూలను సేకరించి వాటితో తయారు చేస్తున్నారు. వాడిన పూలను ఎండబెట్టి, పొడి చేసి వాటితో సహజమైన పదార్థాలు కలిపి అగరబత్తులు తయారు చేస్తున్నారు. ఆలయాల నుంచి పూల సేకరణకు దేవాదాయశాఖ నుంచి అనుమతి తీసుకోనున్నట్లు తెలిసింది.

ఇటీవల కరీంనగర్ జైలు సందర్శనకు వచ్చిన జైళ్లశాఖ డీజీ సౌమ్యమిశ్రా అగరుబత్తుల తయారీ కేంద్రాన్ని పరిశీలించి హర్షం వ్యక్తం చేశారు. కలెక్టర్ పమేలా సత్పతికి జైలులో తయారైన అగరుబత్తులు అందజేశారు. వీటిని మార్కెట్ లో ప్రవేశపెట్టడంతో పాటు ఇతర జైళ్లలోనూ అగరుబత్తుల తయారీ కేంద్రాలు ప్రారంభిస్తామని, వీటికి మంచి డిమాండ్ ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఖైదీలకు ఉపాధి - జైలుకు ఆదాయం…

ఇప్పటికే విద్యాసంస్థలకు బెంచీలు, డెస్క్ లు, షాంపులు, సబ్బులు, ఫినాయిల్, ఇంట్లో ఉపయోగపడే వస్తు సామగ్రి, తదితర వస్తువులను జైళ్ల శాఖ ఖైదీలతో తయారు చేయిస్తుంది. కరీంనగర్ తో పాటు అన్ని జైళ్లలో వస్తువుల తయారీతో పాటు పెట్రోల్ బంక్ నిర్వహిస్తూ ఖైదీలకు ఉపాధి చూపించడంతో పాటు ఆదాయం సమకూర్చుకుంటుంది. మార్కెట్లో లభించే వస్తువులతో పోల్చితే తక్కువ ధర ఉండడం, నాణ్యత పాటించడంతో జైళ్లలో తయారైన వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది.

రాష్ట్రంలోనే మొదటగా కరీంనగర్ జైలులో వాడిన పూలతో అగరు బత్తులు తయారీ జరుగుతుందని జైలు సూపరింటెండెంట్ శ్రీనివాస్ తెలిపారు. స్థానిక ఆలయాల్లో పూజలకు ఉపయోగించిన వాడిపోయిన పూలను సేకరించి ఎండబెట్టి, సహజ సిద్ధమైన పదార్థాలు కలుపుతూ అగర్ బత్తులు తయారు చేస్తుండడంతో ఆధరణ లభిస్తుందని సంతోషం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని ప్రయోగాలు చేసి ఖైదీలకు ఉపాధి కల్పించడంతోపాటు ఆదాయాన్ని పెంచుకొని ప్రణాళికతో ముందుకు పోతున్నట్లు తెలిపారు.

రిపోర్టింగ్ : కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.

Whats_app_banner

సంబంధిత కథనం