Foxconn Investment: తెలంగాణలో 'ఫాక్స్ కాన్' మెగా పెట్టుబడి.. లక్ష మందికి ఉపాధి
Foxconn Investment in Telangana: ఫాక్స్ కాన్( Foxconn ) సంస్థ తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఫలితంగా హోన్ హై ఫాక్స్ కాన్ సంస్థ రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల పరిశ్రమను నెలకొల్పేందుకు మార్గం సుగమమైంది.
Investments in Telangana: తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు పలు యూనిట్లను ప్రారంభించాయి. మరోవైపు కీలక ఒప్పందాలు జరిగిపోతున్నాయి. తాజాగా మరో భారీ పెట్టుబడి రాష్ట్రానికి వచ్చింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఫాక్స్ కాన్ సంస్థ ముందుకొచ్చింది. ఈ మేరకు గురువారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఆ సంస్థ చైర్మన్ యంగ్ లియూ భేటీ అయ్యారు. పెట్టుబడులకు సంబంధించిన అంశాలపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకున్నారు. తాజా పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలోని లక్ష మందికి ఉపాధి కల్పిస్తామని ఫాక్స్ కాన్ సంస్థ వెల్లడించింది.
లక్ష మందికి ఉపాధి…
తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఫాక్స్ కాన్ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా Hon Hai Fox Conn సంస్థ రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల పరిశ్రమను నెలకొల్పేందుకు మార్గం సుగమమైంది. తద్వారా ఒక లక్ష ఉద్యోగాల కల్పనకు దారులు వేసింది. దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. ఎలక్ట్రానిక్స్ రంగంలో దేశంలోకి వచ్చిన అతిపెద్ద పెట్టుబడుల్లో ఇది ముఖ్యమైనది. ఒకే సంస్థ ద్వారా లక్షమందికి నేరుగా ఉద్యోగాలు లభించడం అత్యంత అరుదమైన విషయమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా అనేక దేశాల ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి రంగ ముఖ చిత్రాన్ని గుణాత్మకంగా మార్చిన గొప్ప సంస్థ ‘హోన్ హై ఫాక్స్ కాన్ ’ అని సీఎం కేసీఆర్ అన్నారు. అలాంటి గొప్ప సంస్థ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకురావటంపై సంతోషం వ్యక్తం చేశారు. ఉత్పత్తి కార్యకలాపాలకు తెలంగాణ రాష్ట్రాన్ని గమ్యస్థానంగా ఎంచుకోవడం పట్ల ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఫాక్స్ కాన్ సంస్థ భవిష్యత్తు విస్తరణ ప్రణాళికలపై కూలంకషంగా చర్చించారు. తెలంగాణ రాష్ట్రంలో ఫాక్స్ కాన్ సంస్థ కార్యకలాపాలకు అన్ని రకాల సహాయ సహకారాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని సీఎం కేసీఆర్.. ఈ సందర్భంగా చైర్మన్ యంగ్ ల్యూ కి హామీ ఇచ్చారు.
నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందించి భారీగా పెట్టుబడును రప్పించడంలో తెలంగాణ ప్రభుత్వం విజయవంతమైందన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. రాష్ట్రంలో ఫాక్స్ కాన్ ’ భారీ పెట్టుబడి పెట్టడంతోపాటు గతంలో లేని విధంగా లక్ష కు పైగా ఉద్యోగాల కల్పనకు అవకాశం రావడం గొప్ప విషయం అన్నారు. ఈ లక్ష ఉద్యోగాలను సాధ్యమైనంతవరకు స్థానిక తెలంగాణ యువతకు దక్కేలా చర్యలు చేపడుతామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వెల్లడించారు.
ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం గురించి తమ సంస్థ విస్తృతంగా అధ్యయనం చేసిందన్నారు. ఇక్కడి పారిశ్రామిక అనుకూల వాతావరణం పైన ఆయన ప్రశంసలు కురిపించారు. ఎనిమిది సంవత్సరాల్లో పారిశ్రామిక రంగంలో ముఖ్యంగా ఐటీ, అనుబంధ ఎలక్ట్రానిక్స్ రంగాల్లో సాధించిన అభివృద్ధిపై హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో తమ సంస్థ పెట్టుబడుల విషయంలో ఆశావాహ దృక్పథంతో ఉన్నామని చెప్పుకొచ్చారు. ఈ ఒప్పంద కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డితో పాటు సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
సంబంధిత కథనం