Foxconn Investment : రాష్ట్రంలో పెట్టుబడులకి కట్టుబడి ఉన్నాం.. కేసీఆర్ కి ఫాక్స్ కాన్ ఛైర్మన్ లేఖ-foxconn committed to set up plant in telangana ceo liu tells cm kcr ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Foxconn Committed To Set Up Plant In Telangana Ceo Liu Tells Cm Kcr

Foxconn Investment : రాష్ట్రంలో పెట్టుబడులకి కట్టుబడి ఉన్నాం.. కేసీఆర్ కి ఫాక్స్ కాన్ ఛైర్మన్ లేఖ

HT Telugu Desk HT Telugu
Mar 06, 2023 03:38 PM IST

Foxconn Investment : రాష్ట్రంలో పెట్టుబడులపై ఫాక్స్ కాన్ సంస్థ సందిగ్ధంలో ఉందని జరుగుతన్న ప్రచారాన్ని.. ఆ సంస్థ ఛైర్మన్ యంగ్ లియూ తోసిపుచ్చారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు కట్టుబడి ఉన్నామని.. కొంగర కలాన్ లో ఏర్పాటు చేస్తోన్న ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్ ను తొందరగా నిర్వహణలోకి తెచ్చేందుకు ప్రభుత్వ సహకారం కావాలని స్పష్టం చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు.

సీఎం కేసీఆర్ కు ఫాక్స్ కాన్ ఛైర్మన్ లేఖ
సీఎం కేసీఆర్ కు ఫాక్స్ కాన్ ఛైర్మన్ లేఖ

Foxconn Investment : తెలంగాణ రాష్ట్రంలో ఫాక్స్ కాన్ ఉత్పత్తి తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు తాము కట్టుబడి ఉన్నామని సంస్థ ఛైర్మన్ యంగ్ లియూ స్పష్టం చేశారు. హైదరాబాద్ సమీపంలోని కొంగరకలాన్ లో మ్యానుఫాక్చరింగ్ యూనిట్ ను నెలకొల్పుతామని... తయారీ కేంద్రాన్ని వీలైనంత తొందరగా నిర్వహణలోకి తెచ్చేందుకు ప్రభుత్వ సహకారం కోరుతున్నామని అన్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ కు లేఖ రాసిన సంస్థ ఛైర్మన్ యంగ్ లియూ... తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ చేస్తున్న కృషి, ఆయ‌న విజ‌న్‌ త‌న‌కు ఎంతో ప్రేర‌ణ ఇచ్చింద‌ని పేర్కొన్నారు. ప్రపంచ ప్రఖ్యాత ఫాక్స్‌కాన్ కంపెనీ తెలంగాణలో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలా ? వద్దా ? అనే సందిగ్ధంలో ఉందని పేర్కొంటూ జరుగుతున్న ప్రచారాన్ని లేఖ ద్వారా తోసిపుచ్చారు... సంస్థ ఛైర్మన్ యంగ్ లియూ. రాష్ట్రంలో సంస్థ పెట్టుబడుల విషయంలో నిబద్ధతతో ఉన్నామని స్పష్టం చేశారు.

ట్రెండింగ్ వార్తలు

మార్చి రెండో తేదీన ఫాక్స్‌కాన్ చైర్మెన్ యంగ్ లియూ.. ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్‌తో భేటీ అయిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో యంగ్ లియూ ఇవాళ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. హైద‌రాబాద్‌లో త‌మ బృందం పర్యటించినప్పుడు తెలంగాణ ప్ర‌భుత్వం ఇచ్చిన ఆతిథ్యానికి ఆయ‌న ధన్యవాదాలు తెలిపారు. హైద‌రాబాద్‌లో బ‌స చేసిన స‌మ‌యం అద్భుతంగా సాగింద‌న్నారు. సీఎం కేసీఆర్ ఆతిథ్యం తనను బాగా ఆకట్టుకుందని సంతోషం వ్యక్తం చేశారు. తన పుట్టిన రోజున శుభాకాంక్షలు తెలుపుతూ కేసీఆర్ స్వయంగా గ్రీటింగ్ కార్డు పంపడం అమితానందాన్ని కలిగించిందని తెలిపారు. భారత్ లో తనకు ఇప్పుడు కొత్త స్నేహితుడు ఉన్నారని... భవిష్యత్తులో కేసీఆర్ తో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా... ముఖ్యమంత్రి కేసీఆర్ ని తైవాన్ కి ఆహ్వానించారు ఫాక్స్ కాన్ ఛైర్మన్ యంగ్ లియూ. తన అతిథిగా.. తమ దేశానికి రావాల్సిందిగా కోరారు. తైపీలో కేసీఆర్ కు ఆతిథ్యం ఇవ్వడాన్ని గౌరవంగా భావిస్తున్నానని లేఖలో పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు తైవాన్ కు చెందిన ఫాక్స్ కాన్ కంపెనీకి... రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా ఫాక్స్ కాన్ సంస్థ రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల పరిశ్రమను నెలకొల్పేందుకు మార్గం సుగమమైంది. తద్వారా ఒక లక్ష ఉద్యోగాల కల్పనకు దారులు వేసింది. దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. ఈ కంపెనీకి 250 ఎకరాలు అవసరం కాగా.. ఇప్పటికే సర్వే నం.300లో 187 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వ కేటాయించింది. ఇందుకుగాను రెవెన్యూ అధికారులు, టీఎస్‌ఐఐసీ అధికారులు రెండు మూడు నెలలుగా సర్వే చేసి భూమిని సిద్ధంగా ఉంచారు. మిగతా భూమిని త్వరలోనే సేకరిస్తామని తెలిపారు.

WhatsApp channel