కామారెడ్డి జిల్లాలో పండుగ పూట తీవ్ర విషాదం జరిగింది. ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. శనివారం సాయంత్రం ఈ విషాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటాపూర్ గ్రామానికి చెందిన మౌనిక (26) ముగ్గురు పిల్లలు మైథిలి (10), అక్షర (9), వినయ్(7)లతో కలిసి శనివారం మధ్యాహ్నం పొలం దగ్గరకు వెళ్లారు. అనంతరం చెరువు వద్దకు వెళ్లి మౌనిక బట్టలు ఉతుకుతుండగా.. పిల్లలు స్నానం చేసేందుకు చెరువులోకి దిగారు.
చెరువులో భారీ గుంత ఉండడంతో పిల్లలు అందులో మునిగిపోయారు. మౌనిక వారిని కాపాడేందుకు వెళ్లి ఆమె కూడా నీట మునిగింది. సాయంత్రం దాటినా నలుగురు ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. చెరువు వద్దకు వెళ్లి చూడగా అక్కడ దుస్తులు కనిపించాయి. కానీ ఎవరి ఆచూకీ కనిపించ లేదు.
దీంతో కుటుంబసభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాత్రి సమయంలో వినయ్ మృతదేహం నీటిపై తేలింది. మిగతా వారి కోసం గాలించగా.. ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఓకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడంతో వెంకటాపూర్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
రంగారెడ్డి జిల్లా కొత్తూరు బైపాస్ హైదరాబాద్- బెంగుళూరు జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. కడప జిల్లా బద్వేల్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ వోల్వో బస్సు.. ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
హైదరాబాద్‌లో ప్రముఖ మెహందీ ఆర్టిస్ట్ పింకీ ఆత్మహత్య చేసుకుంది. అత్తాపూర్‌లో సూసైడ్ చేసుకుంది. చున్నీతో ఉరి వేసుకుని చనిపోయింది. సంవత్సరం కిందట అమిష్ లోయా అనే వ్యక్తితో పింకీకి వివాహం జరిగింది. కుటుంబ కలహాల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. భర్త వేధింపులకే పింకీ ఆత్మహత్య చేసుకుందా లేక వేరే కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.